Wednesday, November 20, 2024

డ్రగ్స్‌ కట్టడికి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌.. పంజాబ్‌, హర్యానా తరహాలో స్వతంత్య్ర వ్యవస్థకు యోచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో డ్రగ్స్‌ నియంత్రణకు పంజాబ్‌, హర్యానా తరహాలో పూర్తిగా స్వతంత్ర వ్యవస్థతో ప్రత్యేక విభాగం రూపొందుతోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. డ్రగ్స్‌ కట్టడికి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పేరుతో ప్రత్యేక విభాగం రెడీ అవుతున్నది. వివిధ రాష్ట్రాల్లో ఈ స్పెసల్‌ టాస్క్‌ఫోర్స్‌ డీజీపీ పరిధిలో పనిచేస్తూ, అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్నారు. స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌లో ఇద్దరు ఎస్పీ ర్యాంక్‌ అధికారులు, ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, ఇతర సిబ్బంది ఉన్నారని, అదే విధంగా తెలంగాణలోనూ టీములను రెడీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో 25శాతం ఎక్సైజ్‌ సిబ్బందికి భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తున్నారు. డ్రగ్స్‌ బాధితుల కౌన్సెలింగ్‌కు ఎన్జీవోల సహకారం తీసుకోవాలని ప్రతిపాదనలున్నాయని తెలిసింది. డీ ఎడిక్షన్‌, ప్రివెన్షన్‌కు ప్రభుత్వ ప్రాధాన్యతనివ్వనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో డ్రగ్స్‌ నియంత్రణకు కేంద్ర సంస్థలైన నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ సహాకరం ఈ బృందాలు తీసుకోనున్నాయి. జిల్లా స్థాయిల్లో డీఎస్పీ స్థాయి అధికారులతో జిల్లా టీములను ఏర్పాటు చేసే యోచన పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. జిల్లాల్లో ఎంపీ స్థాయి నుంచి గ్రామ సర్పంచ్‌ వరకు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోనున్నారు.

స్టార్‌ హోటళ్లు, పబ్‌లలో డ్రగ్స్‌కు అనుమతిస్తే లైసెన్సుల రద్దుతోపాటు యజమాన్యాలను ప్రాసిక్యూట్‌ చేస్తామని ఆబ్కారీ శాఖ తీవ్ర హెచ్చరికలు చేసింది. ప్రతి పబ్‌, స్టార్‌ హోటల్‌, బార్‌లపై ప్రత్యేక నిఘాను పెట్టేందుకు ఆబ్కారీ శాఖ సిద్ధమైంది. డ్రగ్స్‌ అడ్డాలుగా అనుమానిస్తున్న పలు పబ్‌లపై ఆబ్కారీ శాఖ ఉక్కుపాదం మోపింది. మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం, ప్రమోషన్లకు వేదికలుగా పబ్‌లు మారాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ఆబ్కారీ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఈ సందర్భంగా కీలక ఆధారాలు లభ్యమైన జూబ్లిdహిల్స్‌ ఫిల్మ్‌నగర్‌లోని ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ లైసెన్సును రద్దు చేస్తూ కీలక నిర్ణయం వెలువరించింది.. జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చేల్‌ పరిధిలోని బార్లు, పబ్‌లలో డ్రగ్స్‌ వినియోగం జరుగుతోందని, ఇక్కడే డ్రగ్స్‌ మాఫియా పలువురు వినియోగదారులకు నేరుగా విక్రయాలు జరపడంతోపాటు డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం, మాదకద్రవ్యాలను ప్రమోట్‌ చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ అధికారులకు విచారణలో భాగంగా తెలిసింది. దీంతో కొందరు ఆబ్కారీ శాఖలోని సిబ్బందిని వినియోగదారులుగా అనుమానిత పబ్‌లకు పంపి అక్కడి పరిస్థితులను వీడియో తీయించారు. పబ్‌లు, బార్లలోని వీడియో ఫుటేజీలను, ప్రైవేటు వీడియోలను పరిశీలించిన తర్వాత 16 బార్లు, పబ్‌లలో తతంగం నడుస్తున్నట్లుగా గుర్తించారు. ప్రముఖులు, సినీరంగంలోని కొందరికి చెందిన పబ్‌లు, మైక్రో బ్రూవరీలలో ఈ వ్యవహారం నడుస్తుండటం, స్టార్‌ హోట్లళ్లలోని బార్లతోపాటు నగరంలోని విలాసవంతమైన కొన్ని బార్లు కూడా డ్రగ్స్‌ దందాకు అడ్డాలుగా ఉన్నాయని గుర్తించారు.

రాష్ట్రంలో 24 క్లబ్‌లు, 8 టూరిజం టెవలప్‌మెంట్‌ లైసెన్సులను జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 460 బార్లు ఉండగా హైదరాబాద్‌లో 230 బార్లు ఉన్నాయి. ప్రధానంగా హైలెవల్‌లోని ఎలైట్‌ బార్లు, స్టార్‌ హోటళ్లు, పబ్‌లలో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలు, ప్రమోషన్‌ జరుగుతున్నట్లుగా తేలడంతో వీటిపై కఠిన చర్యల దిశగా ఆబ్కారీ శాఖ అధికారులు దృష్టి సారించారు. పబ్‌లు పూర్తిగా సీసీటీవీ సదుపాయం కల్గి ఉండాలని, డ్రగ్స్‌ వినియోగం, విక్రయం నిషేధించనైనది. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్‌ చర్యలుంటాయనే నోటీస్‌ బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు. ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని, అనుమానిత వ్యక్తులు పబ్‌లలో కనిపిస్తే పబ్‌ నిర్వాహకులు తమకు నేరుగా సమాచారం అందజేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా నగరంలో అడ్డగోలుగా విస్తరించిన హుక్కా సెంటర్లపై కూడా దాడులు చేయాలని ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది. నేటి నుంచి ఆయా అనుమానిత సెంటర్లపై నిఘా పెట్టాలని చూస్తోంది. బార్లు, మద్యం దుకాణాల్లో వీటికి అనుమతి లేనప్పటికీ ఎక్కువగా పోలీస్‌ శాఖ అనుమతితో నడుస్తున్నాయని గుర్తించారు. వినియోగం జరిగే అవకాశాలున్న ప్రాంతాలతోపాటు కొరియర్‌, బార్లు, పబ్‌లపై దృష్టిసారించి ఇకపై వరుసగా భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement