హైదరాబాద్, ఆంధ్రప్రభ : అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణ ఖజానాపై ఈ ఏడాది మరికొన్ని అదనపు వ్యయాల మోత మొదలవనుంది. మూడు పద్దులకే బడ్జెట్‌లో 40శాతం కేటాయించాల్సి రానుంది. దీంతో ఆర్థిక సమన్వయానికి చిక్కులు తప్పేలా లేవని ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల భారం భారీగా పెరుగుతూ వస్తోంది. 2017-18లో రూ.22,671 కోట్లుగా ఉన్న ఈ వ్యయాలు, 2021-22లో రూ.30,256 కోట్లకు చేరగా, ఈ ఏడాది మరో రూ.5 వేల కోట్ల పెరుగుదల ఖాయమని తెలుస్తోంది. ఇక మూడేళ్లుగా ఉద్యోగుల వయో పరిమితి పెంపు కారణంగా నిలిపోయిన రిటైర్మెంట్లు ఈ ఏడాది నుంచి ప్రారంభమతున్నాయి. దీంతో బడ్జెట్ కేటాయింపుల్లో 23.74శాతం వేతనాలకు, పింఛన్లకు 11శాతం, వడ్డీ చెల్లింపులకు 15.03శాతం వ్యయం కానుంది. ఈ ఏడాది పింఛన్లకు రూ.14,026 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.19,161 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ మూడు పద్దులకే రూ.63,442 కోట్లను ఖర్చు చేసేందుకు ఆర్థిక శాఖకు ఇబ్బందిగా మారింది.
వడ్డీలు చెల్లింపులకే 33వేల కోట్లు..
ఈ ఏడాది నుంచి ఏటా 8నుంచి 10 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఐదేళ్లలో రూ.44 వేల కోట్ల వ్యయం అవనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడంతో 2021 మార్చి 31నుంచి రిటైర్మెంట్లు నిల్చిపోయాయి. 2021లో రిటైర్ కావాల్సిన ఉద్యోగులు ఈ ఏడాది మార్చి తర్వాత పదవీ విరమణకు అర్హులు అవుతున్నారు. దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రేంవత్ సర్కార్‌కు మరో గుదిబండగా ఇది మారనున్నది. ఐదేళ్లలో 44,051మంది ఉద్యోగులు పదవీ విరమణకు రూ.33 వేల కోట్ల ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
పీఆర్సీ కమిటీ వేగం…
త్వరలో పీఆర్సీ ప్రకటన దిశగా తెలంగాణ రెండో పీఆర్సీ కమిటీ వేగం పెంచింది. మరోవైపు ఐఆర్‌పై కూడా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ప్రభుత్వ వేతనాల వ్యయం మొత్తం రెవెన్యూ వ్యయంలో 23.74శాతానికి చేరినట్లు తేలడంతో భారీ మొత్తంలో పీఆర్సీ ప్రకటన ఉంటుందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వాటా రెవెన్యూ వ్యయంలో 11.07 శాతంగా నమోదవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మార్చిలో సానుకూలత వచ్చేనా..
కాగా, ఉద్యోగుల పెండింగ్ కోరికలైన ఐఆర్, పీఆర్సీలకు ఫిబ్రవరి తర్వాత కొంతమేర సానుకూల వాతావరణం నెలకొంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.. తెలంగాణ రెండో వేతన సవరణ అమలులో భాగంగా ప్రభుత్వ రాబడి, ఖర్చుల వివరాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ మేరకు కసరత్తు ప్రారంభించిన కమిటీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు తన పనిని ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అమలు చేస్తామని హామీనిచ్చింది. ఫిట్‌మెంట్‌పై ఇప్పటికే శాఖలవారీగా సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు, సలహాలు సేకరిస్తున్నారు. మార్చి 5, 6 తేదీల్లో హోంశాఖకు సంబంధించిన అధికారులతో పీఆర్సీ కమిషన్ భేటీ కానున్నట్టు తెలుస్తోంది.
ఐఆర్, పీఆర్సీలపై ప్రభావం…
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏటా జనవరిలో ఒక విడత, జులైలో మరో విడత కరవు భత్యం విడుదల చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ డీఏ, కేంద్ర ప్రభుత్వ డీఏ ప్రకటనపై ఆధారపడి ఉంటుంది. ఏటేటా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల భారం ప్రభుత్వంపై భారీ పెరుగుదల నమోదవుతోందని, బడ్జెట్ అంచనాలకంటే గతేడాది ఈ వ్యయం 7శాతం ఎక్కువగా నమోదైందని గుర్తించారు. మొత్తం రెవెన్యూ వ్యయంలో జీతాలపై ఖర్చు 36.16 శాతానికి చేరుకుంది. 2014-15లో వేతనాలు, జీతాల ఖర్చు రూ.12,200 కోట్లు కాగా 2016-17నాటికి రూ.21,897 కోట్లకు చేరుకున్నది. ఇందులో ప్రణాళికేతర పద్దులో రూ. 20,557 కోట్ల, ప్రణాళికా పద్దులో రూ.1340 కోట్లుగా ఉన్నది.
వడ్డీ చెల్లింపులకు అధికమొత్తం కేటాయింపు..
ఇక.. వడ్డీ చెల్లింపులకు 2014-15లో రూ.5,227 కోట్లు అవసరం కాగా 2016-17నాటికి రూ.8,609 కోట్లకు చేరుకున్నది. పింఛన్లు 2014-15లో రూ.4,210 కోట్లు కాగా 2016-17లో రూ.9,011 కోట్లకు చేరింది. కీలకమైన సబ్సిడీలలో 2014-15లో రూ.3,587 కోట్లు కాగా 2016-17కు రూ.5,935 కోట్లకు చేరాయి. మొత్తంగా 2014-15లో ఈ ఖర్చులు రూ. 25,224 కోట్లు కాగా 2023-24కు రూ.65,452 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది కేవలం మూడు పద్దుల వ్యయం రూ.63,442 కోట్లకు చేరింది.