Saturday, September 21, 2024

Special Story – యుద్ధ రంగంలో కొత్త వెప‌న్‌! – టెక్నాల‌జితో చంపేయొచ్చు

భౌతిక‌, ర‌సాయ‌న వెప‌న్ల అవ‌స‌రమే లేదు
ఎల‌క్ట్రానిక్ డివైజెస్‌తో పేలుళ్ల‌కు ప్లాన్‌
పేజ‌ర్లు, వాకీటాకీల‌తో అటాక్‌కు రెడీ
హిబ్జుల్‌పై ఫోక‌స్‌పెట్టిన స్పై ఏజెన్సీ మొస్సాద్‌
తీవ్ర‌వాదుల‌తో స‌హా లెబ‌నాన్ సైనికుల మృతి
వేలాది మంది ప్ర‌జ‌ల‌కు తీవ్ర గాయాలు
తెగిన శ‌రీర‌భాగాలు.. హాస్పిట‌ళ్ల‌కు క్యూ క‌ట్టిన జ‌నం
లెబ‌నాన్‌లో భీతావ‌హ స‌న్నివేశాలు
అయినా స్పందించ‌ని ఇజ్రాయెల్‌
స్ట్రాట‌జిక్‌గా మాట్లాడిన ర‌క్ష‌ణ మంత్రి గాలంట్‌
యుద్ధంలో కొత్త శ‌కంలో ఉన్నామని సుస్ప‌ష్టం
కాలానికి త‌గ్గ‌ట్టు మార్పు చెందాల‌ని వెల్ల‌డి
యూజ్ ఇట్ ఆర్.. లూజ్ ఇట్.. ఇప్పుడిదే ఇజ్రాయెల్ వార్ స్ట్రాట‌జీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌: ..అది సెప్టెంబర్ 17వ తేదీ. స‌మాచారం కోసం మొల‌కు క‌ట్టుకున్న ఎల‌క్ట్రానిక్ డివైజ్‌లు (పేజ‌ర్లు) హీటెక్కి మంట‌పుట్టించాయి. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికి ఫ‌టేల్‌మ‌ని పేలిపోవ‌డం మొద‌లెట్టాయి. ద‌ర్జాగా బెల్ట్ ఏరియాల్లో స్టిక్ చేసుకునే పేజ‌ర్ల పేలుళ్లతో ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి.. వంద‌లాది మంది రోడ్ల‌మీద ఉరుకులు ప‌రుగులు పెట్టడం, పేలుళ్ల‌ధాటికి త‌ట్టుకోలే హాస్పిట‌ళ్ల‌కు ప‌రుగులు తీయ‌డం క‌నిపించింది. ఇది హ‌మాస్ ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం ఇచ్చిన లెబ‌నాన్‌లో జ‌రిగిన ఉదంతం. ఆ త‌ర్వాతరోజు స‌మాచారం చేర‌వేయాల్సిన వాకీటాకీలు కూడా బాంబుల్లా పేలిపోయాయి. దీంతో వంద‌లాది మంది తీవ్ర‌వాదులు చ‌నిపోయారు. చాలామంది సాధార‌ణ పౌరులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 149 మంది లెబ‌నాన్ సైనిక అధికారులు కూడా మృతి చెందారు. అయితే. ఈ వరుస ఘ‌ట‌న‌ల వెనుక క‌చ్చితంగా ఇజ్రాయెల్‌కు చెందిన స్పై ఏజెన్సీ మొస్సాద్ ఉంద‌న్న‌ది అంద‌రూ అంటున్న మాట‌.

- Advertisement -

ప్రాణాలు తీసిన పేజ‌ర్లు, వాకీటాకీలు

ఉన్న‌ట్టుండి పేజ‌ర్లు పేల‌డంతో ఒక్క‌సారిగా యుద్ధంలో కొత్త శకం ప్రారంభమైందని చెప్పుకోవ‌చ్చు. నిన్నటి వరకూ యుద్ధ విమానాలు, వార్ షిప్‌లు, ఆర్మీ సోల్జర్లతో నడిచిన యుద్ధంలో ఇప్పుడు రూటు మారిపోయింది. మిడిల్ ఈస్ట్‌ను విస్తృత యుద్ధం అంచుకు నెట్టివేసిన హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ సరికొత్త యుద్ధాన్ని ప్రారంభించింది. ఇటీవల లెబనాన్‌లో చేసిన జంట దాడులతో తన కొత్త రూపాన్ని నిశ్శబ్దంగా అంగీకరించింది. ఇది ఎవ్వరూ ఊహించని విధ్వంసం. సెప్టెంబర్ 17న లెబనాన్‌లోని హిజ్బుల్లా తీవ్రవాదులు వాడుతున్న పేజర్లే బాంబులుగా మారాయి. టెక్స్ట్ మెసేజ్‌ల కోసం వాడే ఈ యంత్రం చేతిలోనో.. జేబులోనో.. టేబుల్ పైనో.. ఎక్కడుంటే అక్కడే పేలిపోయి, ప్రాణాలు తీశాయి. ఒకటి కాదు రెండు కాదు, లెబనాన్ వ్యాప్తంగా వేల సంఖ్యలో పేజర్లు పేలిపోవడం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుళ్లలో చిన్నారులతో సహా 12 మంది మృతి చెందారు. దాదాపు మూడు వేల మంది గాయపడ్డారు. ఇది ఎలా జరిగిందో అర్థం చేసుకొని, తేరుకునే లోపే, లెబనాన్ బీరుట్‌తో పాటు దక్షిణ లెబనాన్‌లో వాకీ-టాకీలు కూడా పేలడం ప్రారంభించాయి. సెప్టెంబర్ 18న జరిగిన‌ వాకీ-టాకీ పేలుళ్లలో 20మంది మృతి చెందగా, దాదాపు 500 మంది గాయపడ్డారు.

..అయినా, మౌనం వీడ‌ని ఇజ్రాయెల్‌..

సరిగ్గా 24 గంటల్లోనే రెండు పరికరాలు బాంబులుగా మారి ప్రాణాలు తీసాయి. ఇవి రోజూ మనం వాడుతున్న సెల్ ఫోన్ల వంటివే. పేజర్లు.. మెసేజ్‌ల కోసం మాత్రమే వాడితే, ఇన్‌స్టెంట్ వాయిస్ కమాండ్ల కోసం వాకీ-టాకీలు వాడతారు. అయితే, ఇలాంటి అనూహ్య దాడులకు ఇజ్రాయెలే కారణమని లెబనాన్‌లోని హిజ్బుల్లాతో పాటు, ఇరాన్ కూడా నిప్పులు చెరుగుతుంటే.. ఇజ్రాయెల్ మాత్రం, ఎప్పటిలాగే మౌనంగా ఉంది. దీనికి కారణం తామేన‌ని గానీ, తాము కాదు అని గానీ ఇజ్రాయెల్ ఇంతవరకూ చెప్ప లేదు. సెప్టెంబర్ 17 నాటి పేజర్ పేలుళ్లపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ నిరాకరించిన తర్వాత.. 24 గంటల్లో.. అంటే, సెప్టెంబర్ 18న ఉత్తర ఇజ్రాయెల్‌లోని రామత్-డేవిడ్ వైమానిక దళ స్థావరాన్ని సందర్శించారు. అప్పుడే ఈ దాడులకు సంబంధించి నోరు విప్పారు. అందులోనూ, చాలా స్ట్రాటజిక్‌గా మాట్లాడారు. “మేము ఈ యుద్ధంలో కొత్త శకం ప్రారంభంలో ఉన్నాం. కాలానికి తగ్గట్టు మనల్ని మనం తయారుచేసుకోవాలి” అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలంట్ అన్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అద్భుతమైన విజయాలను ప్రశంసిస్తూ.. దేశ భద్రతా ఏజెన్సీ, షిన్ బెట్‌తో పాటు, దాని గూఢచార సంస్థ మొసాద్‌తో కలిసి ఇజ్రాయెల్ దిగ్విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈ మాటలను బట్టి, లెబనాన్‌లో జరిగిన ఘటనలకు ఇజ్రాయెల్ కారణమని స్పష్టంగానే తెలుస్తోంది.

యుద్ధంలో భాగంగానేనా..

ఇజ్రాయెల్ ఇంత పని చేస్తుంద‌ని ఎవ్వరూ అనుకోలేదు. ఒక విధంగా రక్షణ మంత్రి గాలంట్ వ్యాఖ్యలు ఈ జంట దాడుల్లో ఇజ్రాయెల్ పాత్రను స్పష్టంగా అంగీరించినట్లే అనుకోవాలి. సెప్టెంబర్ 17 నాటి ఆపరేషన్.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, గూఢచార సంస్థ మొస్సాద్ కలిసి చేసిన ఉమ్మడి ప్రయత్నమనే నివేదికలున్న తరుణంలో.. గాలంట్ వ్యాఖ్యలను కూడా కలుపుకుంటే, లెబనాన్ జంట దాడులు హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో భాగమనే అనుకోవాలి. ఒక విధంగా ఇది “యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్” అనే కీలక నిర్ణయం తీసుకోవాల్సిన తరుణంలోనే ఇజ్రాయెల్ దీనికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అంటే, లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూపు వాడుతున్న పేజర్లలో పేలుడు సామ‌గ్రిని తయారీ దశలోనే అమర్చిన ఇజ్రాయెల్ వాటిని వాడాల్సిన టైమ్ వచ్చింది కాబట్టి వాడేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న హమాస్, హిజ్బుల్లాతో యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ సెప్టెంబర్ 16న ఓటు వేసింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత పేజర్ పేలుళ్లు సంభవించడం ఇజ్రాయెల్ ప్రిప్లాన్డ్‌గానే ఈ అటాక్‌ చేసిందని చెప్పకనే చెబుతోంది.

ప్రీ ప్లాన్డ్ యుద్ధ తంత్రం..

హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య దాదాపు ఒక సంవత్సరం పాటు నడిచిన సంఘర్షణల తర్వాత, దక్షిణ లెబనాన్, ఉత్తర ఇజ్రాయెల్‌లో పదివేల మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి ఇజ్రాయెల్ నివాసితులు తిరిగి రావడం రాజకీయ అవసరంగా మారింది. అందుకే, ఇజ్రాయెల్ తన అధికారిక యుద్ధ లక్ష్యాన్ని మొదటిసారి ప్రకటించి, హిజ్బుల్లాపై యుద్ధానికి ఓటు వేసింది. సెప్టెంబర్ 18న, నెతన్యాహు తన ఇజ్రాయెల్‌ ఉత్తరాన నివశించే ప్రజలను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి తీసుకురండి అని కూడా ప్రకటించారు. తర్వాత, ఇజ్రాయెల్ డిఫన్స్ ఫోర్స్ తన 98వ శాఖను గాజా నుండి ఉత్తర ఇజ్రాయెల్‌కు తరలించే విషయం బయటపడింది. దీన్ని బట్టి, ఇజ్రాయెల్ ఉత్తర దిశలో యుద్ధం తీవ్రతరమవుతుందని అప్పుడే హింట్ ఇచ్చినట్లయ్యింది. ఇక, సెప్టెంబర్ 18న లెబనాన్‌లో దేశవ్యాప్తంగా వాకీ-టాకీలు పేలడంతో ఇజ్రాయెల్ ప్రీ ప్లాన్డ్ యుద్ధ తంత్రం అర్థమయ్యింది.

స‌ప్ల‌య్ చేయ‌లేద‌న్న కంపెనీలు..

ఈ వాకీ-టాకీలను తయారు చేసే జపనీస్ సంస్థ ICOM వీటి తయారీని ఎప్పుడో నిలిపేసినట్లు ప్రకటించింది. పేలుడుకు గురైన IC-V82 పరికరాలు, గుర్తింపు పొందిన ఏజెంట్ ద్వారా సరఫరా కాలేదని తర్వాత తెలిసింది. సదరు ఏజెంట్ అధికారికంగా లైసెన్స్ పొందలేదు. అలాగే, సెక్యూరిటీ సర్వీస్ ద్వారా తనిఖీ కూడా చేయలేదని తెలిసింది. ICOM సంస్థ ఈ పేలుళ్లకు సంబంధించిన మోడల్‌ను పది సంవత్సరాల క్రితమే నిలిపివేసినట్లు వెల్లడించింది. దీన్ని బట్టి, హిజ్బుల్లా వాడుతున్న IC-V82 పరికరాలన్నీ నకిలీవని తేలింది. అయితే, అవి నకిలీవా లేదంటే కంపెనీ ద్వారా అప్పట్లోనే రవాణా చేసిన‌వా అనేది గుర్తించలేకపోయామని ICOM సంస్థ పేర్కొంది. పేజర్ల విషయంలోనే అంతే జరిగింది. తైవన్‌కు చెందిన గోల్డ్ అపోలో తన బ్రాండ్ పేరుతో వచ్చిన పెజర్లను తాము తయారుచేయలేదనీ.. ఆ కంపెనీ చెప్పింది. ఏది ఏమైనప్పటికీ, పేలుడుకు కారణమైన ఈ పరికరాలు ఎక్కడ నుండి వచ్చాయన్నది సస్పెన్స్‌గానే ఉంది.

ఇది మంచి ప‌రిణామం కాద‌న్న ఐక్య‌రాజ్య‌స‌మితి

లెబనాన్‌లో జరిగిన ఈ దాడిని యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ చీఫ్, వోల్కర్ టర్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేజర్ దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించాయని అన్నారు. సాధారణ పౌర జీవితంలో రోజువారీ ఉపయోగించే వస్తువుల్లో మోసపూరితంగా పేలుడు పదార్థాలు ఉంచడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని తేల్చారు. దీనిపై, స్వతంత్రంగా లోతైన, పారదర్శక విచారణ జరిపించాల్సిందిగా కోరారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ కూడా ఈ పరిణామాన్ని వ్యతిరేకించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement