హైదరాబాద్, ఆంధ్రప్రభ: క్లాసు రూముల్లో చదువు ఒత్తిడి కారణంగా విద్యా కుసుమాలు రాలుతున్నాయి. గడిచిన కొంతకాలంగా వందల మంది విద్యార్థులు కార్పొరేట్ ధనదాహానికి బలైపోతున్నారు. దీంతో కన్నవారికి కడుపు కోతలు మిగులుస్తున్నారు. ప్రతీ ఏడాది ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతునే ఉంది. గడిచిన కొన్నేళ్లుగా చదువు ఒత్తిడితోనో, లెక్చరర్ వేధించాడనో, కొట్టాడనో.. వందలాది మంది విద్యార్థులు అర్థాంతరంగా తనువు చాలించి తమ తల్లిదండ్రులను శోక సంద్రంలో ముంచేస్తున్నారు. కార్పొరేట్ మాఫియాపై కన్నెర్ర చేయాల్సిన అధికారులు తమ విధులను, బాధ్యతలను విస్మరిస్తున్నారు. నార్సింగి శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ఎన్.సాత్విక్ బలవన్మరణం ఘటన రాష్ట్రంలో ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. కొన్ని కార్పొరేట్ కాలేజీలు ధనదాహమే తమకు పరమావధిగా భావిస్తూ విచ్చలవిడిగా కాలేజీలను స్థాపిస్తూ తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చిపిప్పి చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
గత 20 రోజుల్లోనే నలుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారంటే ఈ పరీక్షలు, మార్కులు, ర్యాంకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా ఇంటర్ బోర్డు మాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తోంది. కొన్ని కార్పొరేట్ కాలేజీలు నరక కూపాలుగా తయారయ్యాయని విద్యార్థి సంఘాలు ఆరో పణలు చేస్త్తున్నాయి. చదివితే చదువు లేకుంటే చావు అన్నట్లు వ్యవహ రిస్తున్నాయనే విమర్శలున్నాయి. తమ పిల్లలకు అక్షరాలు నేర్పిస్తారని పంపిస్తే అర్థాంతరంగా వారి ఆయువు తీసేస్తున్నారని బాధిత తల్లి దండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా బలవన్మరణా నికి పాల్పడిన వారి సంఖ్య భారీగానే ఉందని పలు గణాంకాలు తెలుపు తున్నాయి.
కార్పొరేట్ కాలేజీలకు విద్యార్థుల ప్రాణాలంటే లెక్కేలేకుండా పోతుందనే విమర్శలు విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి. వారికి కేవలం మార్కులు, ర్యాంకులే ప్రధానం అన్నట్లుగా విద్యా విధానాన్ని రూపొందించుకుని అమలు చేసుకుంటున్నారు. ఇంటర్ బోర్డు నిబంధనలు తుంగలో తొక్కి తమ ప్రణాళికను నడిపిస్తున్నారు. రోజుకు 16 నుంచి 18(రెసిడెన్షియల్ వారికి) గంటల వరకు చదువే లోకంగా హాస్టళ్లలో చదివిస్తున్నారు. రోజుకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకే తరగతులు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. చాలా కార్పొరేట్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ రెండే కోర్సులు కనిపిస్తాయి. మిగిలిన ఆర్ట్స్ కోర్సులు అస్సలే కనబడవు. పైగా కార్పొరేట్ కాలేజీల్లో హాస్టళ్ల అనుమతి లేదని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. కానీ విచ్చలవిడిగా బ్రాంచుల పేరుతో కాలేజీలు, హాస్టళ్లను ఏర్పాటు చేసుకొని విద్యను వ్యాపారంగా చేసుకుంటున్నారు.
2014 నుంచి 3500 మంది బలి…!
జైళ్లలాంటి కార్పొరేట్ హాస్టళ్లలో విద్యార్థులు టార్చర్ బరిస్తున్నారని సాత్విక్ తన సూసైడ్ నోట్లో స్పష్టం చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉందోనని. ఒక్క సాత్విక్ మాత్రమే కాదు గత కొన్నేళ్లుగా ఎంతో మంది విద్యార్థులు ఇలాంటి ఒత్తిళ్లతోనే ప్రాణాలు తీసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 1995 నుండి 2021 వరకు 1,88,229 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2014 తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తరహా విద్యార్థుల ఆత్మహత్యలు బాగా పెరిగాయి. 2018లో 428 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోగా, అందులో 196 మంది అమ్మాయిలు, 232 మంది అబ్బాయిలే ఉన్నారు. 2019లో 426 మంది కాగా, అందులో అమ్మాయిలు 177, అబ్బాయిలు 249మంది ఉన్నారు. 2020లో విద్యార్థుల ఆత్మహత్యలు 489కి పెరిగాయి. అందులో 184 మంది అమ్మాయిలు ఉంటే, 305 మంది అబ్బాయిలుండడం గమనార్హం. 2021లో 567మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటే అందులో 227మంది అమ్మాయిలుకాగా, 340 మంది అబ్బాయిలు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ఎక్కువగా అబ్బాయిలే ఉండడం బాధాకరం.
జాతీయ వైద్య కమిషన్ నివేదిక ప్రకారం గడిచిన 5ఏళ్లలో దేశవ్యాప్తంగా 119 మంది మెడికల్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అదే తెలంగాణలో సగటున ఏడాదిలో 350 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2014 నుంచి 2021 వరకు 3500 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఇందులో 23శాతం మంది ఇంటర్ విద్యార్థులే ఉన్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిక కారణం పరీక్షలు దగ్గరపడుతుండటంతో చదవాలంటూ ఒకవైపు కాలేజీలు ఒత్తిడి చేయడం, మరోవైపు తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకోలేని విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో చాలా కేసులు ఇప్పటికే విచారణలో ఉన్నాయి. న్యాయస్థానాలు చీవాట్లు పెట్టినా కొన్ని కార్పొరేట్ కాలేజీలు మాత్రం తమ తీరును మార్చుకోవడంలేదు.
విచారణ చేపట్టిన ఇంటర్ బోర్డు…!
రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో సూసైడ్ చేసుకున్న సాత్విక్ ఘటనపై ఇంటర్ బోర్డు విచారణ ప్రారంభించింది. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు అధికారులు కాలేజీ యాజమాన్యం నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది. మరోవైపు సాత్విక్ సూసైడ్‌పై తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ (టీఎస్ సీపీసీఆర్) సీరియస్‌గా పరిణగించింది. సుమోటోగా కేసు స్వీకరించామని కమిషన్ సెక్రటరీ స్వరూపరాణి మీడియాతో తెలిపారు. ఘటనపై నిజనిర్ధారణ చేసి త్వరగా రిపోర్టు ఇవ్వాలని ఇంటర్మీడియట్ కమిషన్‌ను ఆదేశించింది.
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు సూసైడ్ లేఖ..
సాత్విక్ సూసైడ్ ఘటనలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాలేజీకు చెందిన ఆ నలుగురిని నార్సింగి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సాత్విక్ రాసిన సూసైడ్ నోట్‌ను నార్సింగి పోలీసులు పరిశీలించారు. దీనిపై మరింత స్పష్టత కోసం సూసైడ్ లెటర్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిసింది. సాత్విక్ చేతిరాతను సూసైడ్ నోట్లో ఉన్న రాతను కచ్చితత్వంతో పోల్చేందుకు నిపుణుల అభిప్రాయం సేకరిస్తున్నారు.