Friday, November 15, 2024

Special Story – బండి రావాలి .. కదం తొక్కాలి

సంజయ్‌కు మరోసారి పగ్గాలివ్వాలి
ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌గా ముద్ర
యవతరంలో క్రేజ్‌
ప్రభుత్వంపై పోరాటంలో దూకుడు
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై అదే ధోరణి
ప్రజాసంగ్రామ యాత్రతో జోష్‌
గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతం
ఉద్యోగుల కోసం జాగరణ
గతంలో పార్టీ అధ్యక్షుడిగా చెరగని ముద్ర
మళ్లీ అవకాశం ఇవ్వాలి
బీజేపీ శ్రేణుల డిమాండ్‌
అధిష్టానానికి లేఖల శరపరంపర

(న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జ్‌)

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:రాష్ట్ర బీజేపీలో కొత్త నినాదం ఊపందుకుంటోంది. గతంలో దాదాపు మూడేళ్లపాటు పార్టీ పగ్గాలు పట్టి రాష్ట్రంలో పార్టీని విస్తృతం చేసిన బండి సంజయ్‌కు మరోసారి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. పార్టీ శ్రేణులు బహిరంగంగానే తమ ఆలోచనలను, ఆకాంక్షలను అధిష్ఠానానికి వివరిస్తున్నాయి. సంతకాల సేకరణ, లేఖలతో తమ అభిప్రాయాలను చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షా, పార్టీలో కీలక వ్యక్తులు సంతోష్‌.. బన్సల్‌ వంటివారికి వినతుల ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఒకప్పుడు జంటనగరాలకే పరిమితమన్న ముద్ర పడిన పార్టీని గ్రామీణ ప్రాంతాల్లో వికసించేలా చేయడంలో సంజయ్‌ విజయం సాధించిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

ప్రత్యర్థులపై ధాటీగా విమర్శలు చేయడం, కార్యకర్తల కోసం, ప్రజాసమస్యలపైన క్షేత్రస్థాయిలో బలంగా పోరాడటంలో బండి దూకుడుగా వ్యవహరిస్తారు. అదే కార్యకర్తల్లో జోష్‌ను పెంచుతోంది. బండి వస్తే కమలం కదంతొక్కడం.. దూసుకుపోవడం ఖాయమన్నది వారి విశ్వాసం. అందుకు తగిన కారణాలను వారు వివరిస్తున్నారు.రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్‌ ఓ ఫైర్‌బ్రాండ్‌. అచ్చమైన తెలంగాణ మాండలికంలో, ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తేలా మాట్లాడటంలో ఆయనది ప్రత్యేక శైలి. అతి చిన్నవయస్సులోనే ఆర్‌ఎస్‌ఎస్‌తో అడుగులు వేసి, ఏబీవీపీలో పనిచేసి రాటుదేలి.. పరివార్‌ ఆలోచనలతో ఎదిగిన బండి సంజయ్‌ కరీంనగర్‌లో రాజకీయాలు ప్రారంభించారు. కార్యకర్తలతో కలసిపోవడం.. భేషజాలు లేకుండా పనిచేయడం, పోరాడటం, అరెస్టులకు, కేసులకు భయపడకపోవడం వంటి లక్షణాలతో ఆయన మాస్‌ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు.

- Advertisement -

కార్పొరేటర్‌ స్థాయి నుంచి ఒక్కో మెట్టూ ఎక్కి ప్రస్తుతం కేంద్రమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఓబీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌కు అనూహ్యంగా 2020లో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. బీజేపీ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఇది ఒకటి. తెలంగాణలో ఎలాగైనా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో గడచిన దశాబ్దంగా వ్యూహాలు అమలు చేస్తున్న జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయం వెనుక కీలక అంశం ఉంది. అంతవరకు హైదరాబాద్‌-సికింద్రాబాద్‌కే బీజేపీ పరిమితమై ఉండేది. ప్రత్యేకించి ఒక సామాజిక వర్గానికి చెందినవారికే రాష్ట్ర పార్టీ పగ్గాలు అందేవి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆ పార్టీ మచ్చుకైనా కన్పించేది కాదు. ఒకటీ అరా ప్రాంతాల్లో అప్పుడప్పుడు చిన్నాచితకా కార్యక్రమాలు మాత్రమే జరిగేవి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌నుంచి బండి సంజయ్‌ ఎన్నికైన తరువాత జాతీయ నాయకత్వం ఆలోచనల్లో స్పష్టమైన మార్పు వచ్చింది.

సరైన వ్యూహం అమలు చేస్తే తెలంగాణలో పార్టీ విస్తరించవచ్చన్న విషయాన్ని మోడీ-షా జోడీ గుర్తించింది. అక్కడికి కొద్దిరోజుల తర్వాత మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన బండి సంజయ్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించింది. 2020 మార్చిలో ఆయన బాధ్యతలు చేపట్టారు. వెంటనే పోరాటపంథాను అనుసరించారు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై నిత్యం ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. రోడ్డెక్కారు. కార్యకర్తలను కదం తొక్కించారు. అందుకోసం క్షేత్రస్థాయికి చొచ్చుకుపోయారు. పార్టీని రాష్ట్రం నలుమూలలా విస్తరించే లక్ష్యంతో ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో ఐదు దశల్లో పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆంక్షలు, అరెస్టులు, వేధింపులు తప్పలేదు. అయినా ఎదుర్కొని మాస్‌ లీడర్‌గా… క్రౌడ్‌పుల్లర్‌గా ఎదిగారు. శ్రేణుల్లో హీరోగా నిలిచారు.

317 జీవోతో ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం జరుగుతున్న నేపథ్యంలో వారి తరపున పోరాటం చేశారు. జాగరణ పేరుతో ఉద్యోగులతో కలసి రాత్రిపూట నిరసనల కార్యక్రమం చేపట్టారు. ఇలా ఒక్కో అంశంపై తనదైన పంథాలో దూసుకుపోయారు. ఫలితంగా బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా మారింది. బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టే శక్తిగా ప్రజలు భావించారు. బండి సంజయ్‌ దాదాపు మూడేళ్లపాటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని మలిచారు. కొన్నిసార్లు నోరు జారారు.. వివాదాల్లో చిక్కుకున్నారు.. వాటినుంచి పాఠాలు నేర్చారు. బీఆర్‌ఎస్‌ కుంచుకోట దుబ్బాకలో బీజేపీ పతాకం ఎగరేసేలా చేయడంలో బండి సంజయ్‌ పోరాటం శ్రేణులకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ తరువాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్నడూ లేని రీతిలో 48 డివిజన్లలో విజయం సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ఇవన్నీ సంజయ్‌ పోరాట ఫలితాలే. ఆ పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం లేక మూడో స్థానానికే పరిమితమైంది.ఆ పరిస్థితుల్లో, జాతీయ నాయకత్వం వ్యూహంలో అనూహ్యమైన మార్పు రావడం, బండి సంజయ్‌ను మార్చి రాష్ట్ర పార్టీ పగ్గాలు కిషన్‌రెడ్డికి అప్పగించడం వంటి పరిణామాలను శ్రేణులు జీర్ణించుకోవడానికి సమయం పట్టింది. శాసనసభ ఎన్నికలకు కొద్దినెలలముందు జరిగిన ఈ మార్పుతో పార్టీ తీవ్రంగా దెబ్బతింది. దాదాపు అధికారంలోకి వస్తుందనుకున్న స్థితి నుంచి నామమాత్రంగా మిగిలిపోయింది. బండిని మార్చడానికి కొన్ని కారణాలను నాయకత్వం చెప్పినప్పటికీ కార్యకర్తలకు రుచించలేదు. రాష్ట్రంలో అతిపెద్ద, ప్రభావవంతమైన రెడ్డి సామాజికవర్గాన్ని కాదనలేకపోవడం ఒక కారణం.

జూనియర్‌ అయిన బండి నేతృత్వంలో పనిచేయడానికి సీనియర్లు, ఇతర పార్టీలనుంచి రావాలనుకుంటున్న ప్రముఖులు సంశయించడం, పార్టీలో సీనియర్లను కలుపుకుపోకుండా.. ఒంటరిగా సంజయ్‌ వ్యవహరించడం వంటి మరికొన్ని కారణాలను చెప్పుకొచ్చారు. అయితే, ఈ కారణాల సంగతి ఎలా ఉన్నా.. తాజా శాసనసభ ఎన్నికల్లో ప్రత్యామ్నాయమనుకున్న బీజేపీ.. 8 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈలోగా రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇతర పార్టీలనుంచి ప్రముఖులు బీజేపీలోకి వచ్చారు.

తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 8 స్థానాల్లో విజ యం సాధించింది. బండి సంజయ్‌ మరోసారి కరీంనగర్‌నుంచి విజయం సాధించారు.శాసనసభ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని, అందుకు కారణాలను జాతీయ నాయకత్వం గుర్తించింది. హరియాణా వంటి రాష్ట్రాల్లో ప్రభావవంతమైన జాట్‌ సామాజికవర్గాలను కాదని ఓబీసీ వర్గాలను ప్రోత్సహించి, మంచి ఫలితాలు సాధించిన బీజేపీ తెలంగాణకు సంబంధించిన వ్యూహాల్లోనూ మార్పులపై దృష్టి సారిస్తోంది. కేవలం రెడ్డి సామాజికవర్గానికే పరిమితమైపోకుండా రాష్ట్రంలో బలమైన బీసీ-ఓబీసీ వర్గాలను సమీకరించుకోవడం వారి ఆలోచనల్లో భాగం. అందుకే బండి సంజయ్‌ (ఓబీసీ), ఈటల రాజేందర్‌ (బీసీ) వంటివారికి ప్రాధాన్యత కల్పించింది.

మోడీ-షా-నడ్డా వీరిని పలు సందర్భాల్లో మెచ్చుకున్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే, బండి సంజయ్‌కు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా అవకాశం ఇచ్చింది. రెడ్డి సామాజికవర్గాన్ని గౌరవిస్తూ చెందిన కిషన్‌రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించింది. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల ఆదరించిన నేపథ్యంలో శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అయితే దానిని ఒక ఉద్యమంగా.. ఒక వేవ్‌గా మార్చడానికి తగిన మాస్‌ లీడర్‌ కావాలి. వివాద రహితుడైన కిషన్‌రెడ్డి సమర్థతపై ఎవరికీ అనుమానం లేదు. కానీ క్షేత్రస్థాయిలో దూకుడుగా.. సై అంటే సై అనే ధోరణితో పనిచేసే నాయకుడిని కార్యకర్తలు కోరుకుంటున్నారు.

హైడ్రా కూల్చివేతల సందర్భంలో ఈటల చొరవగా జనంలోకి వెళ్లారు. గ్రూప్‌ 1 అభ్యర్థుల ఆందోళనల్లో బండి సంజయ్‌ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నడిరోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పనిలో పనిగా బీఆర్‌ఎస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో అభ్యర్థుల చెంతకు సంజయ్‌ వెళ్లినప్పుడు వారిలో కన్పించిన జోష్‌, విశ్వాసాన్ని పసిగట్టిన పార్టీ కార్యకర్తల్లో మళ్లి బండికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తే కమలవికాసం ఖాయమన్న నమ్మకం ఏర్పడింది. మిగతా పార్టీలకన్నా కమలంలో భిన్నమైన పరిస్థితులుంటాయి. కార్యకర్తలకు కాస్త చొరవగాను, నిర్భయంగాను వ్యవహరిస్తారు. వారి మనసులోని విషయాలను నేరుగా అధిష్ఠానానికి చేరవేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది

. బండికి పగ్గా లివ్వాలంటూ సంతకాల సేకరణ ప్రారంభించారు. జేపీనడ్డా, అమిత్‌ షా, పార్టీవ్యూహకర్త బీఎల్‌ సంతోష్‌, రామ్‌మాధవ్‌, సునీల్‌ బన్సల్‌ వంటివారికి లేఖలు పంపుతున్నారు. బండి రావాలి… కమలం కదం తొక్కాలని కోరుతూ పంపిన ఆ లేఖల సంఖ్య ఒకటీ అరా కాదు.. వేలల్లోనే ఉన్నాయి. వారం రోజులుగా ఈ మార్పు కన్పింస్తోంది. ఇక జాతీయ నాయకత్వం ఆలోచనల్లో మార్పు వస్తుందో రాదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement