Friday, November 22, 2024

గొల్లకురుమల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం.. ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గొల్ల కురుమల సంక్షేమానికి తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో గొల్ల కురుమలను భాగస్వాములను చేసేందుకు 11వేల కోట్లతో రెండు విడతల్లో గొర్రలె పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కులవృత్తులకు జీవం పోసి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. తెలంగాణ రాకముందు గొర్రెల పెంపకందారుల సొసైటీలో కేవలం 2లక్షల21వేల మంది మాత్రమే సభ్యులుగా ఉండేవారని, నేడు ఆ సంఖ్య 7లక్షల 61వేలకు చేరింది నిజం కాదా..? ఆలోచించుకోవాలని గొల్ల, కురుమలకు సూచించారు.

ఈ మేరకు బుధవారం మన్నెగూడలో నిర్వహించిన యాదవ, కురుమల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో పథకాలు సమర్థంగా అమలవుతున్నాయని కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాల, గిరిరాజ్‌సింగ్‌ ..మంత్రి తలసానిని ప్రత్యేకంగా అభినందించారని గుర్తు చేశారు. బయటి వాళ్లు వచ్చి చెబితేగాని మన గొప్పతనం ఏంటో మనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. పరిశ్రమలు అంటే అంబానీలు, ఆదానీలు మాత్రమే మాత్రమే కాదని, తాతాలకాలం నాటి కులవృత్తులు బాగుంటేనే దేశం కూడా బాగుటుందని కేంద్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు.

గొల్ల కురుమల సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎల్లవేళలా యాదవుల ఆశీర్వాదం ఉండాలని ఆకాక్షించారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట అమరుడు దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా జరపాలన్న గొల్ల కురుమల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. సదర్‌ పండుగను అధికారికంగా జరపాలని డిమాండ్‌ను కూడా నెరవేరుస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement