తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో సంక్షేమ దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నామని,
ఎమ్మెల్యే సతీష్ బాబు కృషివల్లే ఇది సాధ్యమైందన్నారు. 185 మంది ఎస్టీ సోదర నిర్వాసితులకు ఒక్కొక్కరికి 8 లక్షల పరిహారం ఇవ్వడం జరిగిందన్నారు. దీంతోపాటు ఇంటి జాగా కూడా అందిస్తున్నట్టు మంత్రి హరీశ్ చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇవ్వలేదన్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం 75రూపాయలు పెన్షన్ ఇస్తుండేనని, అది కూడా ఊర్లో ఒక 30 మంది 40 మందికి ఇచ్చేవారన్నారు మంత్రి హరీశ్‌రావు. ఊర్లో ఎవరికైనా కొత్త పెన్షన్ రావాలంటే.. ఎవరో ఒకరు చస్తే గాని ఆ తర్వాత లిస్టులో ఉన్న వారికి వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 29 లక్షల మందికి 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఈరోజు మనం 44 లక్షల మందికి 2,000 చొప్పున పెన్షన్ ఇస్తున్నట్టు తెలిపారు.
మహారాష్ట్ర నుండి 25 మంది సర్పంచులు సిద్దిపేటకు చూడ్డానికి వచ్చినారని, మహారాష్ట్రలో చెరువులను పట్టించుకునే నాధుడే లేడన్నారు. అక్కడ తాగడానికి వారానికి ఒక రోజు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. రైతులకు దొంగరాత్రి కరెంటు, పెన్షన్ 600 మాత్రమే ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో కెసిఆర్ కిట్టు లేదు, వ్యవసాయం కి 24 గంటల కరెంటు లేదు, 2000 పెన్షన్ లేదు, రైతులకు రైతుబంధు లేదని చెప్పారు.
ఎప్పుడైనా మహారాష్ట్రకి మనవాళ్లను పంపిస్తే ఇక్కడ బీఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి గురించి తెలిసి వస్తదన్నారు మంత్రి హరీశ్. ఈరోజు దేశంలో తెలంగాణది సంక్షేమ స్వర్ణ యుగం నడుస్తోందని, ప్రతి సంవత్సరం పేదల సంక్షేమం కోసం 50000 కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు .ఇప్పటివరకు ఆసరా పెన్షన్ల కోసం 53 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. రైతుబంధు పథకం కింద 65వేల కోట్లను రైతులకు నేరుగా ప్రభుత్వం ఇచ్చిందనీ,
ఇప్పటివరకు 65 వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు ఉచిత కరెంట్ అందించిన సీఎం మన కేసీఆర్ మాత్రమే నని స్పష్టం చేశారు.
పేదలకు ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమేనని, ముసలవ్వల కు ఆసరా పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకు అయ్యిండన్నారు మంత్రి హరీశ్‌రావు. పిల్ల పెళ్ళి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు సహాయం చేసి మేనమామ అయిండు కెసిఆర్. రైతుబంధు రైతు బీమా ఇచ్చి రైతులకు రైతు బాంధవుడుగా మారిండు కేసీఆర్. దేవుని దయ వల్ల గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయింది. రేపో, ఎల్లుండో కటక ఒత్తుడే నీళ్ళు పోసుడే. ఒకప్పుడు కరువుకు నెలవైన హుస్నాబాద్లో ఇపుడు కరువుకు సెలవు. అన్ని పండుగలు కలిసొస్తే ఎంత గొప్పగా ఉంటదో అంతటి పండుగను మనం గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు జరుపుకుందాం. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని, సతీష్ బాబును మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, ఎమ్మెల్యే సతీష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.