దేశంలో మతాంతర వివాహాలకు సంబంధించిన ప్రత్యేక వివాహ చట్టం (SMA), 1954ను సుప్రీంకోర్టులో పిల్ వేశారు. దీంతో ఈ చట్టంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ చట్టంలో ఏం పొందుపరిచారో తెలుసుకుందాం..
దేశంలోని ఏ పౌరులు అయినా.. యువతీ, యువకులు పెళ్లి చేసుకోవాలంటే కొన్ని రూల్స్, గైడ్‌లైన్స్ పాటించాల్సి ఉంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకు కొన్ని సర్దుబాట్లు ఉన్నా.. వయసు రీత్యా ఎలాంటి మినహాయింపులు లేవు. అలాగే ఎలాంటి ఆచారాలు, వ్యవహారాలు లేకుండా ప్రత్యేక వివాహ చట్టం 1954 వీలు కల్పిస్తుంది. దేశంలో మతాంతర, కులాంతర వివాహాలను ధ్రువీకరించడానికి.. నమోదు చేయడానికి చేసిన చట్టమే ఇది. ఈ యాక్ట్ ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు తమ వివాహాన్ని పౌర ఒప్పందం ద్వారా చేసుకోవచ్చు. ఈ చట్టం కింద ఎలాంటి మతపరమైన విధి విధానాలు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఇందులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు కూడా పెళ్లి చేసుకునే చాన్స్ ఉంది. అంతేకాకుండా ఇది ఒక్క దేశంలోని పౌరులకే కాకుండా.. విదేశాలలో నివసిస్తున్న భారతీయులకు కూడా వర్తిస్తుందని చట్టం చెబుతోంది.
30 రోజుల్లో అభ్యంతరాలు తెలపవచ్చు..
వివాహం చేసుకునే వాళ్లలో ఒకరు జిల్లా రిజిస్ట్రార్ అధికారికి పెళ్లి గురించి నోటీసు ఇవ్వాలి. ఇద్దరిలో ఒకరు నోటీసు ఇచ్చిన తేదీకి ముందు కనీసం 30రోజుల నుంచి ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి. ఆ నోటీసును వివాహ నోటీసు పుస్తకంలో నమోదు చేస్తారు. అలాగే వివాహ అధికారి తన కార్యాలయంలో నోటీసును ప్రచురిస్తాడు. వివాహ నోటీసులో పెళ్లి చేసుకోబోయే వాళ్ల పేర్లు, పుట్టిన తేదీ, వయస్సు, వృత్తి, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా, పిన్ కోడ్, గుర్తింపు సమాచారం, ఫోన్ నంబర్ మొదలైన అన్ని వివరాలు ఉంటాయి. అయితే.. ఈ వివాహంపై ఎవరైనా అభ్యంతరాలు తెలపవచ్చు. 30 రోజుల్లో అభ్యంతరాలు రాకపోతే పెళ్లి జరుగుతుంది. అభ్యంతరాలు వస్తే వివాహ అధికారి వాటిపై ఎంక్వైరీ చేసి తదుపరి చర్య తీసుకుంటారు. ఆ తర్వాత అతను వివాహాన్ని నిర్వహించాలా వద్దా నిర్ణయిస్తారు.