Friday, November 22, 2024

ఫ్రెంచ్‌ పరిశ్రమలకు స్పెషల్‌ కారిడార్‌.. కేటీఆర్‌ స్పీచ్‌కు ప్యారిస్‌ ఫిదా!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రపంచ యవనికపై తెలంగాణ కీర్తి పతాకం సగర్వంగా ఎగిరింది. ప్యారిస్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ఫ్రెంచ్‌ సెనేట్‌లో శుక్రవారం చేసిన కీలకోపన్యాసానికి వాణిజ్య, రాజకీయ ప్రముఖుల నుంచి విశేష స్పందన వచ్చింది. కేటీఆర్‌ ప్రసంగానికి సభికులు కరతాళ ధ్వనులతో స్పందించారు. పారిస్‌లోని ఫ్రెంచ్‌ సెనేట్‌లో జరిగిన యాంబిషన్‌ ఇండియా–2021 బిజినెస్‌ ఫోరమ్‌లో మంత్రి కేటీఆర్‌ చేసిన కీలకోపన్యాసం ప్రపంచవ్యాప్తంగా వివిధ నాయకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

ప్రతిష్టాత్మక కాన్ఫరెన్స్‌లో కొవిడ్‌ అనం తర కాలంలో ”ఇండో-ఫ్రెంచ్‌ సంబంధాల భవిష్యత్తును రూపొందించడం” అనే అంశంపై మంత్రి ప్రసంగించారు. ఏడేళ్లుగా సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్న తీరును వివిరిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ జాతీయ విధానాలు కేంద్ర ప్రభుత్వ పరిధి అయితే, భారత సమాఖ్య నిర్మాణంలో రాష్ట్రాలు కూడా భూమి కేటాయింపు, ఆమోదం, అనుమతులు అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. తెలంగాణలో గత ఏడేళ్లలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

తెలంగాణ ప్రభుత్వ పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, రాష్ట్రంలో నెలకొన్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను కేటీఆర్‌ సెనేట్‌ వేదికగా ప్రస్తావించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని ఫ్రెంచ్‌ పెట్టుబడిదారులకు సూచిస్తూ… ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్రెంచ్‌ కంపెనీలకు, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రమని, తెలంగాణ ప్రభుత్వ టీఎస్‌ఐపాస్‌ పాలసీ పారదర్శకతతో కూడిన స్వీయ ధ్రువీకరణను అనుమతిస్తుందని, చట్టం ప్రకారం 15రోజుల్లో అన్ని రకాల అనుమతులకు సంబంధించి పూర్తి క్లియరెన్స్‌ లభిస్తుందన్నారు. ఈ 15 రోజుల వ్యవధిలో అనుమతుల జారీ జరగకపోతే 16వ రోజున పూర్తి అనుమతులు లబించి ఆమోదించినట్లు భావించవచ్చని స్పష్టం చేశారు.

తెలంగాణకు టీఎస్‌ఐఐసీలో 200 వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉందని, విద్యుత్‌, నీరు, అత్యుత్తము మౌలిక సౌకర్యాలను కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ను కేటీఆర్‌ హైలైట్‌ చేస్తూ ప్రభుత్వం తన సొంత ఖర్చులతో శిక్షణనిచ్చి, వారిని నాణ్యమైన మానవ వనరులుగా మారుస్తుందన్నారు. ఇది స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఏ కంపెనీ అయినా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇతర రాష్ట్రాలు ఆఫర్‌ చేస్తున్న అంశాల కంటే తాము ఎక్కువ ఆఫర్‌ చేస్తామని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించి తెలంగాణను భాగస్వామ్య రాష్ట్రంగా ఎంపిక చేసినందుకు ఫ్రెంచ్‌ సెనేట్‌కు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement