Tuesday, November 19, 2024

అలర్ట్ః అండమాన్‌లో ప్రవేశించిన రుతుపవనాలు!

నైరుతి రుతుపవనాలు ఈ సారి ముందే పలకరిస్తున్నాయి. శుక్రవారం దక్షిణ అండమాన్‌ సముద్రంలో పూర్తిగా, దక్షిణ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌ సముద్రంలో పలు ప్రాంతాల్లో ప్రవేశించాయి. సాధారణంగా మే 22న రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి వస్తాయి. ఈ ఏడాది ఒకరోజు ముందుగానే వచ్చాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశముందని  భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ ఏడాది వర్షపాతం సాధారణంగా ఉంటుందని అంచనా వేసింది. కాగా, నైరుతి రుతుపవనాల రాకతో అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులపాటూ… అండమాన్ దీవులపై తేలికపాటి నుంచి మోస్తరు వర్షం… ఆదివారం వరకూ కురుస్తుంది అని వాతావరణ అధికారులు తెలిపారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంపై గాలుల వేగం… గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు.

ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుందని, ఈ అల్పపీడనం 24వ తేదీ నాటికి తుపానుగా మారుతుందని వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా పయనించి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య ఈ నెల 26న తీరాన్ని చేరుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మే 31వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని పేర్కొంది. 

మరోవైపు తెలుగు రాష్ట్రాలకు జూన్ 15 నుంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా కూడా అప్పుడప్పుడూ తేలిక పాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. వాటి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. జూన్ 15 తర్వాత మాత్రం జోరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement