దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. సెకండ్ వేవ్ మొదలైన కొత్తలో కేసులన్నీ ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లోనే రావటంతో దక్షిణాది రాష్ట్రాలు పెద్దగా అప్రమత్తం కాలేదు. కానీ వైరస్ చూస్తుండగానే దక్షణాదిని చుట్టుముట్టేసింది. కర్ణాటక, చెన్నై, కేరళ, హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదలకు ఎన్నికలు కూడా కారణంగా కనపడుతున్నాయి. అంతేకాదు ఆయా ఎన్నికల సభల్లో పాల్గొన్న సీఎంలు అంతా వైరస్ బారిన పడటం గమనార్హం.
తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారే. ఇప్పుడు వీరంతా కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. నిజానికి ఏపీ సీఎం జగన్ కూడా తిరుపతి ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉండేది. కానీ ఆయన చివరి నిమిషంలో సభ రద్దు చేసుకోవటంతో జగన్ కరోనా నుండి తప్పించుకున్నారన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తం అవుతోంది.