రాష్ట్రంలోని గిరిజనులకు త్వరలోనే గిరిజన బంధు ఇస్తామని.. పోడు భూములకు రైతు బంధు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ ఆత్మీయ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి గిరిజనులు, ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుమ్రం భీం, సంత్ సేవాలాల్ విగ్రహాలకు సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… దళిత బంధు మాదిరిగానే గిరిజన బంధును అమలు చేసి తీరుతామని ప్రకటించారు. గిరిజనుల అభ్యున్నతే తమ లక్ష్యమని కేసీఆర్ తేల్చిచెప్పారు. పోడు భూములు పంచిన తర్వాత అసలు భూములు లేని గిరిజనులను తేలుద్దాం.. ఆ లెక్కను చూసిన తర్వాత దళితబంధు మాదిరిగా గిరిజన బంధును కూడా అమలు చేయబోతున్నామన్నారు. భూమి, భుక్తి లేకుండా, ఎలాంటి ఆధారం లేని వారికి గిరిజన బంధును తన చేతుల మీదుగా ప్రారంభిస్తానన్నారు.