సోనూసూద్ ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్.. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటి వరకు ఎంతోమందికి తన ఆపన హస్తాన్ని అందించాడు. లాక్ డౌన్ సమయంలో ఎంతోమందిని తమ సొంత ఊర్లకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. ఉద్యోగాలు ఇప్పించాడు, ఆసుపత్రులకి సాయమందించాడు..ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో..ప్రార్థించే పెదవుల కన్నా సాయమందించే చేతులు మిన్నకి కరెక్ట్ గా సరిపోతాడు సోనూ సూద్. ఇప్పటికి సాయమడిగిన వారికి తనకి చేతనయినా సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు..అపర కుభేరులు కూడా చేయని పనిని ఆయన చేస్తున్నాడు. దాంతో సోనూకి ఎనలేని కీర్తి వచ్చింది..సోనూ అంటే తెలియని వారు ఉండకపోవచ్చనే రీతిగా మారిపోయాయి పరిస్థితులు.. సినిమాల్లో విలన్ ..బయట హీరోగా మారిపోయాడు.
సినిమాలకంటే సోనూసూద్ దానగుణం వల్ల పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు.. తెలుగు రాష్ట్రాలలోనే పలు చోట్ల సోనూ సూద్ కి విగ్రహాలు ఏర్పాటు చేశారు. గుడులు కట్టి పూజిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, సోనూ సూద్ ఫేమ్ ఏ స్థాయికి చేరిందో. ఇక సోషల్ మీడియాలో సోనూసూద్ కి తిరుగులేదు. ఆయనను కోట్లమంది ఫాలో అవుతున్నారు. ఇక ఇన్ స్టాగ్రామ్ లో ఆయన ఫాలోయింగ్ ఏకంగా 14 మిలియన్స్ కి చేరింది. స్టార్ హీరోలకు కూడా ఇంస్టాగ్రామ్ లో ఇంత మంది ఫాలోవర్స్ లేకపోవడం విశేషం.
తాను కష్టపడి సంపాదించిన డబ్బుని ప్రజల సేవకే ఖర్చుపెడుతూ ప్రజల నాలుకపై నానుతూ ఉన్నాడీ హీరో.. ఎవరు ఏ ఆపదలో ఉన్నా నేనున్నాను అనడం అలవాటయిపోయింది సోనూసూద్ కి. సోషల్ మీడియాలో ఒక్క రిక్వెస్ట్ పెడితే స్పందించే వ్యక్తిని మనం ఎప్పుడైనా చూశామా.. అలాంటిది ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా న్యాయమైన కోరికలు, అవసరాలు సోనూ సూద్ సోషల్ మీడియా అభ్యర్థనతో తీరుస్తుండటం విశేషం. అందుకే ఆయన కొందరికి దేవుడయ్యాడు.