అయిదు రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ప్రతిపక్ష పార్టీలతో కీలక భేటీకి సన్నాహాలు చేస్తున్నారు. అన్నిప్రతిపక్ష పార్టీలతో సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా.. ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయాలన్న లక్ష్యంతోనే ఈ భేటీ ఉండబోతోందని పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించిన ప్రాథమిక చర్చలను సోనియా ఇప్పటికే పూర్తి చేసినట్టు సమాచారం. అయితే.. గతంలోనూ సోనియా ఆధ్వర్యంలో ఓ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తృణమూల్ అధినేత్రి మమతను ఆహ్వానించ లేదు. అయితే.. ఈ సారి మాత్రం మమతకు ఆహ్వానం ఉంటుందంటున్నారు.
‘‘గతంలో రెండు సార్లు ప్రతిపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించాం. ఈ రెండు సార్లూ అన్ని ప్రతిపక్ష పార్టీలనూ ఆహ్వానించాం. ఈ సారి కూడా అలాగే అన్ని ప్రతిపక్ష పార్టీలనూ ఆహ్వానిస్తాం’’ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత ప్రకటించారు. ఈ సమావేశానికి సీపీఎం వెనక నుంచి కీలకమైన మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. చాలా పార్టీలు ఎన్నికల్లో బిజీగా ఉన్నాయని, అందుకే ఫలితాల తర్వాతే ఈ సమావేశం జరుగుతుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ప్రకటించారు.
గతేడాది ఆగస్టులో అన్ని ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. దీనికి 19 పార్టీలు హాజరయ్యాయి. దేశ భవిష్యత్తు దృష్ట్యా వ్యక్తిగత అవసరాలన్నింటినీ పక్కనపెట్టి, కలిసి రావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా పిలుపునిచ్చారు. అంతేకాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓ రూట్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేసుకుందాని సోనియా ఈ సమావేశంలో సూచించారు.