కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇంకా సోనియా గాంధీనే కొనసాగుతారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఇవ్వాల జరిగిన సీడబ్ల్యూసీ భేటీ తర్వాత ఎట్లాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మాకు నాయకత్వం వహిస్తారని, భవిష్యత్తు చర్యలు తీసుకుంటారని కార్యవర్గ సమావేశం అనంతరం పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఆమె నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతారని చెప్పారు. గాంధీ కుటుంబం కారణంగా పార్టీ బలహీనపడుతుందని కొందరు భావిస్తున్నారని, ఈ భేటీలో సోనియా గాంధీ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.. మీరంతా కూడా ఇదే అభిప్రాయంతో ఉంటే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని, కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఆమె అన్నట్టు వేణుగోపాల్ తెలిపారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ.. “ప్రతి పార్టీ కార్యకర్త రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారని, అయితే తదుపరి పార్టీ ఎన్నికలలో అధ్యక్షుడిని ఎన్నుకుంటారని” స్పష్టం చేశారు.