కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రలో ఇవ్వాల (గురువారం) సోనియాగాంధీ పాల్గొన్నారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర కర్నాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ యాత్రలో జకన్న హళ్లి చేరుకున్న సోనియా.. మాండ్యా జిల్లాలోని పాండపుర తాలూకా నుంచి ఇవ్వాల ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన యాత్రలో పాల్గొన్నారు. సాయంత్రం ఏడు గంటలకు నాగమంగళ తాలూకాలో యాత్ర ముగియనుంది. ఆ తర్వాత బ్రహ్మదేవరహళ్లి మీటింగులో సోనియా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర మొన్నటి శుక్రవారం కర్నాటకలోకి ఎంటరైంది. కేరళ సరిహద్దులోని చామరాజ్నగర్లోని గుండులుపేటలో అడుగుపెట్టడం ద్వారా రాహుల్ కర్నాటక రాష్ట్రంలో కాలుమోపారు. ఈ యాత్రకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది. ‘ఆశ, ప్రేమ, విజయాల ప్రయాణమిది. భారత్ జోడో యాత్ర స్ఫూర్తి ఇదే’ అని అందులో పేర్కన్నారు.
పాండవపుర తాలూకా వద్ద ప్రారంభమైన ఈ యాత్ర ఇవ్వాల నాగమంగళ తాలూకా వద్ద ముగియనుంది. ఇక్కడి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఎదురుగా ఉన్న మడకె హోసూరు గేట్ వద్ద రాత్రి బస చేస్తారు. భారత్ జోడో యాత్ర కర్ణాటకలో 21 రోజులపాటు 511 కిలోమీటర్ల మేర సాగుతుంది. చామరాజనగర్, మైసూరు, మాండ్యా, టుముకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూర్ జిల్లాల మీదుగా యాత్ర కొనసాగుతుంది.