కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం పార్టీ నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో గాంధీ-కుటుంబ విధేయుల వైఖరితో కలత చెందిన అసంతృప్తివాదులు బుధవారం నుంచి వరుస సమావేశాలు నిర్వహించారు. అయితే.. వరుస నష్టాలు ఎదురైనా గాంధీల నాయకత్వమే ఉండాలని విధేయులు పట్టుబడుతున్నారు. గత CWC సమావేశంలో పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి అన్ని పదవుల నుండి వైదొలగాలని సోనియా గాంధీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు. 2020లో ఎన్నికల పరాజయాల తర్వాత సోనియా గాంధీకి మొదటిసారి లేఖ రాసినప్పటి నుండి G-23 గ్రూప్ పార్టీ పునర్నిర్మాణం కోసం నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సోనియాతో ఆజాద్ భేటీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
తాము కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని అనుకుంటున్నామని ‘G-23’ అసమ్మతివాదుల కోర్ గ్రూప్ అంటోంది. కాగా, మొన్న బుధవారం జరిగిన జి-23 సమావేశానికి హాజరైన హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాతో రాహుల్ గాంధీ కూడా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారనే దానిపై హుడా స్పష్టత కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన హుడా, పార్టీ నిర్ణయాల గురించి నేతలు తరచూ వార్తాపత్రికల ద్వారా తెలుసుకుంటారని రాహుల్ గాంధీకి చెప్పారు. జి-23 నేతలు ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదని, సోనియాగాంధీకి తెలియజేసిన తర్వాతే ఈ భేటీ జరుగుతున్న హుడా అన్నారు.