తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక సందర్భంగా రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార, ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ, కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ మధ్య ఓ పాట వివాదంగా మారింది. ‘రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న’ అంటూ వైసీపీ కోసం గాయని మంగ్లీ గతంలో పాడిన పాట ఎంతో ప్రజాదరణ పొందింది. అప్పట్లో ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి సైతం ఈ పాటకు టిక్ టాక్ వీడియో చేయడం హాట్‌టాపిక్ కూడా అయ్యింది.
ఇప్పుడు ‘రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న’ పాట ట్యూన్‌తో రూపొందిన ‘భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ’ అనే పాటతో బీజేపీ తిరుపతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. సోమవారం నెల్లూరులో నామినేషన్ల సందర్భంగా ఒకే ట్యూన్లో ఉన్న ఈ రెండు పాటలు మారుమోగాయి. దీంతో తమ పాటను బీజేపీ కాపీ కొట్టిందని వైసీపీ ఆందోళన చేస్తుండగా.. కేంద్ర పథకాల పేర్లు మారుస్తూ జగన్ కాపీ కొడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇలా ఓ పాట రెండు పార్టీల మధ్య వివాదంగా మారింది.