హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఏళ్లుగా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఇబ్బందులు పడుతున్న ఎల్బీనగర్తోపాటు మరో అయిదు నియోజకవర్గాల్లోని వేలాది ప్రజల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 118 దూరం చేసిందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ. రామారావు అన్నారు. దాదాపు దశాబ్దంన్నరకు పైగా ఈ ప్రాంతంలో 1000 గజాలలోపు స్థలం ఉన్న వారు క్రమబద్ధీకరణ కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఎల్బీనగర్లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన మన నగరం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నివాస ప్రాంతాల జాబితా నుంచి అన్యాక్రాంతమైన పలు కాలనీల పేర్లు కూడా జీవో 118లో స్పష్టంగా పొందుపరిచామని, దీంతో ఆయా కాలనీల వాసులకు ఎంతో మేలు జరిగిందన్నారు.
జీవో 118 మేరకు కాలనీల తుది జాబితాను మంత్రి కేటీఆర్ స్వయంగా చదివి వినిపించారు. ఈ సందర్భంలో దాదాపు ఆరు అసెంబ్లిd నియోజకవర్గాలకు చెందిన 44 కాలనీల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ మంత్రి కేటీఆర్ ప్రసంగాన్ని స్వాగతించారు. గజానికి కేవలం 250 నామమాత్రపు ధరతో ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించనున్నట్లు సభాముఖంగా మంత్రి ప్రకటించారు. ఈ ప్రాంత ప్రజలు 2007 నుంచి తమ ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆయా కాలనీ వాసుల వ్యాపారు చిరునామాలకు, పిల్లలను విదేశాలకు పంపే క్రమంలో సమర్పించాల్సిన నివాస ధృవీకరణ పత్రాలకు, ఇతర ముఖ్యమైన అంశాల్లో ఆరు నియోజకవర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.
గతంలో అనేక మంది ముఖ్యమంత్రులకు ఈ సమస్యపై ప్రజలు విన్నవించినా పరిష్కారం కాలేదని, చివరకు 2018లో తాను ఎల్బీనగర్ జోనల్ ఆఫీసులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సమస్యను పరి ష్కారానికి మార్గాన్ని సుగమమం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్బీనగర్తోపాటు పరిసర నియోజకవర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 1200కోట్లను ఖర్చు చేసి ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించిందని, రూ.113 కోట్లతో స్టాటజిక్ నాలా అభివృద్ధి పథకం(ఎస్ఎన్డీపీ)ని అమలు చేసిందన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే డీ. సుధీర్‌రెడ్డి , ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
కాలనీల క్రమబద్ధీకరణ సమస్య పరిష్కారం కోసం పలు మార్లు చొరవ తీసుకున్నందుకు కేటీఆర్‌కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మీ,డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, మున్సిపల్‌శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్‌బోర్డు ఎండీ దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు.