Sunday, November 17, 2024

వరికొయ్యలు కాలిస్తే ముప్పే.. 20 ఏండ్ల సాగు వెనక్కి

వరికొయ్యలను తగులబెట్టడం ద్వారా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. నేలకు మేలు చేసే క్రిమికీటకాలు నశించడమే కాదు, భూమిలో సారం తగ్గిపోవడం, వాయు కాలుష్యం పెరిగిపోవడం లాంటి నష్టాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఎండ కాలంలో కాల్చివేయడంతో భారీ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. కొన్నిసార్లు విలువైన ఆస్తులు, మూగజీవాలు అగ్నికి బలవుతున్నాయి. ఒక్కోసారి మనుషుల ప్రాణాలూ గాల్లో కలుస్తున్నాయి. తాజాగా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేటలో ఓ మహిళా రైతు పొగతో ఊపిరాడక చనిపోవడం కలిచివేసింది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండాలన్నా.. నేలను కాపాడుకోవాలన్నా కొయ్యకాళ్లను కాల్చకపోవడమే మంచిది. మల్చర్‌ పద్ధతిలో అయినా లేదా గడ్డిని కలియదున్నినా సేంద్రియ ఎరువుగా ఉపయోగ పడుతుంది. భూసారంతోపాటు దిగుబడులు పెరిగి రైతుకు మేలు జరుగుతుంది..

వరి సాగు పెరగడం.. పశువుల సంఖ్య తగ్గడం.. వంటి కారణాల వల్ల గడ్డి మిగులుతున్నది. అయితే కొంద రు అవగాహనలోపంతో కొయ్యకాలును కాల్చడం వల్ల తీరని నష్టం వాటిల్లుతున్నది. భూసారం దెబ్బతిని దిగుబడులపై ప్రభావం పడుతున్నది. భూమి లోపల ఉన్న కోటానుకోట్ల సూక్ష్మ జీవుల వినాశనం జరుగుతున్నది. ఇదే సమయంలో అగ్నిప్రమాదాలు సంభవిస్తుండగా, ఒక్కోసారి మనుషులు, పశువుల ప్రాణాలకూ హాని కలుగుతున్నది. తాజాగా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేటలో రైతు గుండ ఎంకవ్వ (55) వరికొయ్యలు దహనం చేస్తూ పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోవడం పరిస్థితికి అద్దంపట్టింది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండాలన్నా.. నేలను కాపాడుకోవాలన్నా వరి కొయ్యలను కాల్చొద్దు. సేంద్రియ ఎరువుగా మలుచుకుంటే రైతుకు మేలు జరుగుతుంది..

నిప్పు పెడితే నష్టాలే..

వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది.

విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, పాస్పరస్‌ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుంది. దిగుబడి పోతుంది. భూమికి పీచు పదార్థంగా ఉపయోపగడే అవశేషాలు కాలిపోతాయి. పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి. మేలు చేసే సూక్ష్మ జీవులు చనిపోతాయి. పొలాల్లో తిరిగే పాములు, ముంగీసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాశులు చనిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు కూడా ఒక్కోసారి బుగ్గవుతున్నాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆలస్యంగా కోతకు వచ్చే పంటలు, కల్లాల దగ్గరే ఉన్న ధాన్యం కాలిపోయే ప్రమాముంది.

- Advertisement -

కలియ దున్నితే ఎన్నో ప్రయోజనాలు..

వరి కొయ్యలు నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బన శాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశమున్నది. దుక్కిదున్నే సమయంలో సూపర్‌ ఫాస్ఫేట్‌ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. కలియ దున్నితే ఎకరాకు దాదాపుగా టన్ను ఎరువు తయారవుతుంది. మొక్కలకు 2 శాతం నత్రజని(యూరియా), 4 శాతం పాస్పరస్‌ అదనంగా అందిస్తుంది. జింక్‌, మాంగనీస్‌, ఇనుము, కాల్షియం లాంటి సూక్ష్మధాతువులు పంటకు మేలు చేకూర్చుతాయి. నేలలో కరుగని మూలకాలను అనుకూలంగా మార్చుతుంది. నీటినిల్వ పెరుగుతుంది. ఒక టన్ను వరి గడ్డి కావాలంటే.. ఆ వరి పెరుగుదలకు 18.9 కిలోల పొటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరంతో పాటు కొంత మోతాదులో సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి. కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే, గడ్డి ద్వారా పోషకాలన్నీ తిరిగి నేలకు చేరుతాయి.

ఒక్కసారి కాల్చితే 20 ఏండ్లు వెనక్కే..

కొయ్యకాళ్లను తగులబెట్టడం వ్యవసాయానికి చేటు చేస్తుంది. వాతావరణంలో కాలుష్యం పెంచుతుంది. ఒక్కసారి కొయ్యకాళ్లను కాల్చితే వ్యవసాయం 20 ఏండ్లు వెనుకబడినట్టే. మట్టిలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇందులో పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు కూడా ఉంటాయి. కొయ్యకాళ్లను తగులబెట్టినప్పుడు ఇవన్నీ చనిపోతాయి. దీంతో భూమి సారం కోల్పోతుంది. ఈ విధానం సరికాదని శాస్త్రవేత్తలు సైతం తేల్చారు.. మల్చర్‌తో ఈ సమస్యకు చక్కని పరిష్కారం దొరికింది. రొటోవేటర్‌తో దున్నే యంత్ర పరికరం ఇది. ఇది కొయ్యకాళ్లను చిన్న చిన్న ముక్కలుగా, పౌడర్‌గా మారుస్తుంది. తర్వాత రెండు బస్తాలు సూపర్‌ వేసి దున్నితే భూమి సారవంతంగా మారుతుంది. దీంతో ఎకరాకు 10 ట్రాక్టర్ల మట్టి వేసినట్లు అవుతుంది.. భూసారం పెరిగి పంట దిగుబడి అనూహ్యంగా పెరుగుతుంది.

మల్చర్‌ (స్రెడర్‌)తో తొలగింపు సులభం

మల్చర్‌ విధానంలో కొయ్యకాళ్లు తొలగించుకొనే విధానం పాటించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. గడ్డి కప్పు యంత్రంతో సులువుగా కొయ్యకాళ్ల సమస్యను అధిగమించవచ్చు. ఈ యంత్రంతో గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేయవచ్చు. ఈ యంత్రాన్ని ట్రాక్టర్‌కు తగిలించి కొయ్యకాళ్లను తొలగించవచ్చు. ఈ యంత్ర పరికరంలో గేర్‌ బాక్స్‌, రోటర్‌తో పాటు కత్తులతో చేసిన గడ్డిని సమాంతరంగా నేలపై పరుచుటకు రోలర్‌తో అమర్చబడి ఉంటుంది. పరికరాన్ని సులువుగా ట్రాక్టర్‌ త్రీ పాయింట్‌ లింకేజీ మీద అమర్చుకోవచ్చు. ట్రాక్టర్‌ పీటీవో ద్వారా శక్తిని తీసుకొని మల్చర్‌ పని చేస్తుంది.

ఎన్నో ఉపయోగాలు..

మల్చర్‌ పరికరం కొయ్యకాళ్ల గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి నేలపై సమాంతరంగా పరుస్తుంది. దీన్ని నీటి తడి పెట్టి అలాగే వారం, పది రోజుల పాటు మురగనివ్వాలి. తరువాత దున్నితే ముక్కలుగా మారిన గడ్డి నేలలో కలిసిపోతుంది. దీంతో నేలలో తేమ శాతం పెరుగుతుంది. నేల సారవంతం అవుతుంది. నీటి కోతను తగ్గించుకోవచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement