హైదరాబాద్, ఆంధ్రప్రభ : బాజా భజంత్రీలతో చేసే పెళ్లి వేడుకను ఆదర్శంగా తీర్చిదిద్దడం అభినందనీయమని, సామాజిక సేవలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. పరిగికి చెందిన కావలి నర్శమ్మ, లక్ష్మయ్య దంపతులు కుమారిడి పెళ్లికి సజ్జనార్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. పెళ్లి వేడుకను హంగూ ఆర్భాటాలతో కాకుండా పలువురికి ఆదర్శంగా నిలిచే విధంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పెళ్లి తంతు కార్యక్రమంలో వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సజ్జనార్ రక్తదానం చేసి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే సేవా కార్యక్రమాలను తలపెట్టడం ఆదర్శమని అభినందించారు. తలసేమియా రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అందరి కృషి అవసరమన్నారు. ఆ వ్యాధిగ్రస్తులను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల లోనూ పాలుపంచుకుంటోందన్నారు. కొద్ది నెలల ముందు సంస్థ సిబ్బంది, ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. తలసేమియా బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ పెళ్ళికి పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహనరెడ్డి కూడా హాజరయ్యారు.