Tuesday, November 26, 2024

కరోనా కాష్టానికి రూ.25 వేలు!

కరోనాతో చచ్చినా డబ్బులే.. బ్రతికినా డబ్బులే.. ఇదేంటి అనుకుంటున్నారా.. అవును ఇదే నిజం. ఇపుడు జరుగుతున్న తంతు ఇదే.. కరోనాతో మరణించిన ఒక వ్యక్తి బాడీని దహనం చేయాలంటే రూ.25 వేలు డిమాండ్ చేస్తున్నారు అంబులెన్స్, శ్మశాన వాటికల నిర్వహకులు. కరోనా రెండో వ్యాప్తితో చాలా మంది మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. కరోనాతో మరణించిన వారిని దహనం చేసేందుకు కొన్ని శ్మశాన వాటికలను మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా రోగి మరణానికీ ఓ ధరను నియమిస్తున్నారు వస్తూ రాయుళ్లు. దీంతో చేసేదేమి లేక..నిట్టూర్పుతోనే డబ్బులు కట్టి బాడీని దహనం చేయిస్తున్నారు మరణించిన వ్యక్తి బంధువులు. కరోనా రెండో వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మరణిస్తుండగా వారి దహనసంస్కారాలకు ఒక ధరను నిర్ణయించి నిర్వహకులు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఆంధ్రప్రభ పరిశీలన చేయగా..పరిశీలనలో విస్తుపోయే నిజాల బయటపడ్డాయి.

బుధవారం తెల్లవారుజామున మూసాపేటలోని జనతానగర్ కు చెందిన ఓ 55ఏండ్ల మహిళ కరోనాతో మృతి చెందింది.. ఈమె దహ సంస్కారాల కోసం బంధువులు శ్మశాన వాటికను సంప్రదించగా వారు రూ.25వేలు డిమాండ్ చేశారు. దీనికి వారు ప్యాకేజీని ప్రకటించడ గమనార్హం..రూ.25 వేలు అయితే వారి మనుషులే వచ్చి బాడీని తీసుకుని అంబులెన్స్ లో ఎక్కించి..మళ్లీ ఎలక్ట్రికల్ దహన ప్రక్రియకు లేదా కట్టె చితిపై ఉంచుతారు. మనుషులు, అంబులెన్సకు, దహనానికి కలిపి మొత్తం రూ.25వేల ప్యాకేజీ. అయితే ఇదంతా మూసాపేట నుంచి ఈఎస్ పక్కనున్న వైకుంఠధామం వరకే ఈ రేటు.. ఏరియా మారితే.. దూరాన్ని బట్టి ప్యాకేజీ మారుతుంది.

ఏరియాలను బట్టి, హాస్పిటల్ ప్రాంతాన్ని బట్టి అంబులెన్స్ వాహనదారులు, శ్మశాన వాటికల ఇన్ చార్లు కరోనా మరణానికి ఓ రేటున ప్యాకేజీని ప్రకటిస్తున్నారు. పైగా మా బలవంతం ఏంలేదు సార్, మీ ఇష్టం ఉంటేనే.. లేకపోతే ఏంలేదు అంటూ.. మీరు వెళ్తానంటే కట్టి దాంట్లోనైనా దహనం చేసుకోవచ్చు. అంటూ సమాధానం చెబుతున్నారు. ఒకవేళ కట్టెల దహనానికి వెళ్లాలని రోగి బంధువు ప్రయత్నిస్తే… అక్కడా ఓ ప్యాకేజీ ఉంది..కట్టెల చితికి రూ.14వేలు, మళ్లీ అంబులెన్సకు రూ.12వేలు (ప్రాంతాన్ని బట్టి మారుతుంది) వసూల చేస్తున్నారు. ఈ రెండు కలుపుకుంటే సుమారు రూ.26వేలు అవుతోంది. అయితే ఇవి మచ్చుకు మాత్రమే.. దూర ప్రాంతాల నుంచి అయితే రూ.30వేలకు పైగా కూడా డిమాండ్ చేస్తుండగా, మాధాపూర్ నుంచి అయితే ఒక్క అంబులెన్స్ కే రూ.19 వేలను డిమాండ్ చేశారు. ప్రధానం హైదరాబాద్ లో ఈఎస్ఎ హాస్పిటల్ పక్కన, గోల్నాక, తార్నాక, అంబర్ పేట ప్రాంతాల్లోని శ్మశాన వాటికల్లో (మరికొన్ని ప్రాంతాల్లోని బరే గ్రౌండ్ లో కూడా) కరోనా పేషంట్ల దహనాలను జరుపుతున్నారు. దీంతో ఇపుడు ఈ శ్మశాన వాటికలకు డిమాండ్ బాగా ఏర్పడింది. అయితే కరోనా ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోయిన వారి అంత్యక్రియలను ప్రభుత్వమే జరుపుతుందని చెబుతున్నా.. అదనంగా కుటుంబ సభ్యులను వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ దహనాలకు ఎలక్ట్రికల్ ధర రూ.4వేలగా జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సాధారణ కట్టెల దహనానికి శ్మశాన వాటికల నిర్వహకులదే తుది నిర్ణయంలా మారింది. సాధారణ మరణానికి కట్టెల దహనానికి రూ. 7 నుంచి 8 వేలు. ఇది కూడా ఓ ప్యాకేజీనే..పైగా కాటి కాపరికి ఎక్స్ ట్రా..రూ.800 వసూలు చేస్తున్నారు.

సాధారణంగా మరణించినా..కరోనాతో మరణించినా.. ఒక మనిషి దహనానికి 6నుంచి 7క్వింటాల్ కలు అవసరం పడుతున్నాయి. ప్రస్తుతం క్వింటా కట్టెల ధర రూ.300 నుంచి 400 పలుకుతోంది. పంజాగుట్ట, బాలానగర్, ఈఎప్, లాలాపేట, గోల్నాకతో పాటు మరికొన్ని ఖబరస్తాలో కూడా కట్టెల దహనాలు జరుగుతూనే ఉన్నాయి. దహనాలకు అవసరమైన కట్టెలను, కుండలను నిర్వహాకులు చాదర్‌ ఘాట్ నుంచి తీసుకు వస్తున్నారు.

ఒక మనిషి చనిపోయారనే వార్త రాగానే బేరానికి దిగుతున్నారు వసూళ్లరాయుళ్లు.. ఇందులో మళ్లీ కమీషన్లు కూడా..ఒక అంబులెన్స్ డ్రైవర్ కి కరోనా పేషంట్ బాడీని తీసుకెళ్లాలని ఫోన్ రాగానే మీరు ఎక్కడున్నారు, మిమ్మల్ని ఫలాన శ్మశానవాటికకి తీసుకెళ్లాలి. అక్కడ ఆలస్యం అవుతుంది. మీరు ఫలాన దగ్గరికి వెళ్లాలని చెబుతూ.. మొత్తానికి కలిపి ఒక ధరను నిర్ణయించి చెబుతున్నారు. ఒకవేళ పేషంట్ తాలుకా వాళ్లు అంత రేటా అంటే బేరానికి దిగుతున్న పరిస్థితులు.. అవసరమైతే..ఎవరూ రారండీ.. మేము కాబట్టి తీసుకెళ్తున్నాం, ఇక మీ ఇష్టం అంటూ సమాధానం ఇవ్వడంతో రోగి బంధువులు అయోమయంలో పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ తరువాత అన్నీ ఓకే అయితే.. వెళ్లే శ్మశాన వాటిక ఇన్ చార్జ్ కు ఫోన్ చేసి చెప్పి, నా కమీషన్ ఎంతంటూ.. అడగడం గమనార్హం. కరోనాతో మరణించిన వ్యక్తి చుట్టూ కరెన్సీ ఈగలు వాలి..డబ్బులను వసూలు చేస్తున్నారు.

- Advertisement -

హైదరాబాద్ లోని శ్మశాన వాటికల్లో కొన్నింటిలో మాత్రమే కరోనా పేషంట్ల దహనానికి అవకాశం ఉంది. దీంతో ఆ శ్మశాన వాటికలను నిర్వహించే కాంట్రాక్టర్లు కరోనా సాక్షిగా కోట్లు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం నగరంలో ఉన్న కొన్ని శ్మశాన వాటికలను జీహెచ్ఎంసీలోని ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి తన తమ్ముడి పేరుతో నడుపుతున్నారని సమాచారం. ఆ ఉద్యోగికి అధికారులు అండదండలు పుష్కలంగా ఉండడంతోనే ఖబరస్థాన్ కాంట్రాక్ట్ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం కరోనాతో చనిపోయి వస్తున్న బాడీల దహనాలకు రూ.25 వేలు వసూలు చేస్తున్న దాంట్లో..ఎలక్ట్రిక్ట్రిక్ దహనానికే రూ.11వేలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ ధర రూ.4వేలే ఉండగా (సాధారణ మరణానికి), వీరు మాత్రం రూ.11వేలు వసూలు చేస్తున్నారు. అయితే సాధారణ మరణానికి ఎలక్ట్రిక్ దహానానికి ధర నిర్ణయించిన అధికారులు.. కరోనా మరణానికి నిర్ణయించకపోవడంతో ఖబరస్థాన్ కాంట్రాక్టర్ దే తుది నిర్ణయం అవుతోంది. దీని ప్రకారం వీరు ఏమేర వసూళ్లకు పాల్పడుతున్నారో అర్ధమవుతోంది.

ఇదిలా ఉంటే గతేడాది కరోనా మొదటి వ్యాప్తిలో రోజుకు సుమారు 20 నుంచి 30 బాడీలు వస్తే… వాటికి తక్కువలో తక్కువ రూ.30వేలు వసూలు చేశారని, దీని ప్రకారం చూస్తే నెలకు లక్షల్లో జేబులు నింపుకున్నట్టు తెలిసింది. దీంతో పాటు ఈ నెలలో 19, 20వ తేదీల్లో కూడా రోజుకు 15కు పైగా బాడీలు వచ్చాయని, వాటికి కూడా రూ.25 వేలకు పైగా వసూలు చేశారని ఆంధ్రప్రభ పరిశీలనలో తెలిసింది. గత వసూళ్లలో భాగంగానే కాంట్రాక్టర్ విరివిగా అంబులెన్లు కొనుగోలు చేశారని కూడా విశ్వసనీయ సమాచారం. జీహెచ్ఎంసీ అండదండలు ఉండడంతోనే కాంట్రాక్టర్ ఈ స్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

మాయదారి కరోనాతో చచ్చినా… బ్రతికినా డబ్బులే అంటూ.. ఓ శ్మశాన వాటిక దగ్గరకు వచ్చినా రోగి బంధువులు సాధించారు. కరోనా వచ్చిందని ఆసుపత్రిలో చేర్చితే అక్కడా వేలల్లో డబ్బులు అయ్యాయని, చనిపోయిందని దహనం చేద్దామంటే ఇక్కడా వేలకు వేలకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఇలా అయితే పేదవాడు ఎలా బ్రతకాలంటూ ఆమె ప్రశ్నించారు. పెడితే మంచి కోరి..పెట్టకపోతే చావు కోరే ఈ రోజుల్లో మా లాంటి పేదోళ్ల పరిస్థితి ఏంటంటూ ఓ రోగి బంధువు ప్రశ్నించారు. దీనిపై గవర్నమెంట్ పట్టించుకోవాలే అంటూ కోరారు.

కొవిడ్ రెండో వ్యాప్తితో ఇప్పటికే చాలా మంది మృత్యువాత పడగా.. ప్రతిరోజూ కొంతమంది చనిపోతూనే ఉన్నారు. వ్యాధితో చనిపోతున్న వారి దహనాలకు శ్మశానవాటికల నిర్వహకులు అధిక ధరలు, ప్యాకేజీలు ప్రకటిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంబులెన్స్ నిర్వహకులు, శ్మశాన వాటికల నిర్వహకులపై దృష్టి సారించడంతో పాటు, కరోనాతో మృతి చెందిన వారిని ప్రభుత్వమే ఉచితంగా తరలించి, దహనం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలతో పాటు మృత్యువాత పడిన రోగుల బంధువులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement