Friday, November 22, 2024

బస్‌ టికెట్‌తో పాటే ప్రయాణికులకు స్నాక్‌ బాక్స్‌.. e-గరుడ బస్సుల్లో పైల‌ట్ ప్రాజెక్టు

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్‌ టికెట్‌ తో పాటే ‘స్నాక్‌ బాక్స్‌’ను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్‌ బాటిల్‌ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్‌ బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్‌ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్‌ e-గరుడ బస్సుల్లో స్నాక్‌ బాక్స్‌ విధానాన్ని రేప‌టి (శనివారం) నుంచి ప్రారంభిస్తోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు కూడా స్నాక్ బాక్స్‌ విధానాన్ని అమ‌లు చేయ‌నున్నట్టు టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ స్నాక్‌ బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు మౌత్‌ ప్రెషనర్‌, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్‌ బాక్స్‌ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. “ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు వినూత్న కార్యక్రమాలతో టీఎస్‌ఆర్టీసీ ముందుకు వెళుతోంది. అందులో భాగంగా స్నాక్‌ బాక్స్‌ ప్రయాణికులకు ఇవ్వాలని నిర్ణయించింది. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని బలపరిచే చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు ప్రయాణంలో ఉపయోగపడే మౌత్‌ ప్రెషనర్‌, టిష్యూ పేపర్‌తో కూడిన స్నాక్‌ బాక్స్‌ను ప్రయాణికులకు సంస్థ అందించనుంది.

టీఎస్‌ఆర్టీసీ ఏ కార్యక్రమం తీసుకువచ్చినా ప్రయాణికులు బాగా ఆదరిస్తున్నారు. సంస్థను ప్రోత్సహిస్తున్నారు. ఈ స్నాక్ బాక్స్‌ విధానాన్ని అలాగే అదరించాలి.” అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ కోరారు. ప్రతి స్నాక్‌ బాక్స్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని, దానిని ఫోన్లలో స్కాన్‌ చేసి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు. ఈ ఫీడ్‌ బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని స్నాక్‌ బాక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. ప్రయాణికుల ఫీడ్‌ బ్యాక్‌ను బట్టే మిగతా సర్వీసులకు స్నాక్ బాక్స్ విధానాన్ని విస్తరిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement