ఏసీ కోచ్ లో ఎయిర్ కండిషనింగ్ యూనిట్ నుంచి పొగలు రావడంతో సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్ రైలును ఒడిశాలోని బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ లో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రైలులోని బీ-5 కోచ్‌లో పొగ రావడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అలారం మోగించారు. దీంతో రైలు ఆగడంతో అందులోని ప్రయాణికులు భయంతో కిందకు దిగిపోయారు. సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని పొగను అదుపు చేశారు.
మళ్లీ విద్యుత్ కారణంగా ప్రమాదం జరుగుతుందన్న భయంతో ప్రయాణికులెవరూ ఆ కోచ్‌లో ఎక్కేందుకు నిరాకరించినట్లు ఓ అధికారి తెలిపారు. మరికొంత మంది రైలునుంచి దిగి అందులో ప్రయాణించేది లేదని తేల్చి చెప్పారు. తక్షణమే మరొక కోచ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన కోచ్‌ను అధికారులు పరిశీలించారు. 45 నిమిషాల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు ఆర్పిన తర్వాత రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. ఎయిర్ కండిషనర్‌లో జరిగిన చిన్న షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ మంటలు వచ్చి పొగలు వ్యాపించాయని చెప్పారు.