Business: పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో రూ.58,400 కోట్లకు చేరుకోవచ్చని కౌంటర్ పాయింట్ అంచనా వేస్తోంది. 2017 పండుగల సీజన్‌లో రూ.27,700 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకం జరిగింది. ఇప్పుడు ఆ అంచనాలను చేరుకుంటే కనుక గత ఐదేండ్ల అమ్మకాల కంటే ఇది 111శాతం ఎక్కువ అవుతుందని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.
వాస్తవానికి, గత పండుగ సీజన్లో కరోనా మహమ్మారి కారణంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ కాస్త నిస్తేజంగా ఉంది. ప్రస్తుతం ఆంక్షల సడలింపు నేపధ్యంలో మార్కెట్లో డిమాండ్ పెరగడం మార్కెట్‌ను కలిసివస్తోంది.
మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ అంచనా ప్రకారం.. అక్టోబర్ మొదటి వారం నుండి ప్రారంభమయ్యే పండుగ సీజన్‌లో దేశంలో రూ. 58,400 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడవుతాయి. స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ చిప్ కొరతను ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఇది పెద్ద విక్రయాల పరంపర అని చెప్పవచ్చు.
చిప్ కొరత కారణంగా విడిభాగాల ధర పెరిగింది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌లు ఖరీదైనవిగా మారాయి. 2017లో స్మార్ట్‌ఫోన్‌ల సగటు విక్రయ ధర (ASP) రూ. 12,900 కాగా, కౌంటర్‌పాయింట్ అంచనా ప్రకారం ఈ సంవత్సరం స్మార్ట్‌ఫోన్‌ల పండుగ ASP 33% కంటే ఎక్కువ పెరిగి రూ. 17,200 కి చేరుకుంటుంది. అయినప్పటికీ బలమైన డిమాండ్ ఉంది. ఈ సంవత్సరం చాలా ఆర్థిక సంస్థలు దూకుడుగా కస్టమర్లకు ఈఎంఐ (EMI) సేవలను అందిస్తున్నాయి. అందుకే ప్రజలు ఖరీదైన ఫోన్‌లను కూడా కొనుగోలు చేస్తున్నారు.