Tuesday, November 19, 2024

Smart Exclusive – ఆపరేషన్ కాక్టస్ …. మిషన్​ ఇంపాజిబుల్​

అబ్దుల్ గయూమ్.. మాల్దీవుల అధ్యక్షుడు. 1980, 1983 సంవత్సరాల్లో తన ప్రభుత్వంపై తిరుగుబాటు యత్నాలు జరిగాయి. కానీ, సక్సెస్ కాలేదు. అది 1988 నవంబరు.. దాదాపు 80మంది పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్‌ త‌మిళ్ ఈలం సాయుధ (PLOTE) కిరాయి సైనికులు శ్రీలంక స్పీడ్ బోట్లను హైజాక్ చేశారు. వాటితో ఓ తెల్లవారు జామున మాలేలో దిగిపోయారు. చూస్తుండగానే ముఖ్యమైన గవర్నమెంట్ బిల్డింగులు, ఎయిర్‌పోర్టు, నేవీ పోర్టు, టీవీ, రేడియో స్టేషన్ సహా రాజధానిలోని పలు ప్రాంతాల్లోకి ఈ కిరాయి మూక చేరిపోయింది.

కిరాయి సైన్యం నియంత్ర‌ణ‌లోకి మాల్దీవులు
పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ త‌మిళ్ ఈలం నియంత్రణలోకి మాల్దీవుల దేశం వచ్చేసింది. అధ్యక్షుడు గయూమ్ టార్గెట్‌గా ఈ కిరాయి సైనికులు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్నారు. కానీ, అలర్టయిన ప్రభుత్వ ముఖ్యులు గయూమ్‌ను ముందుగా రక్షణ మంత్రి ఇంటికి చేర్చారు. ఆయన గయూమ్‌ను ఓ సురక్షిత గృహంలోకి తీసుకెళ్లారు.. ఈలోపు కిరాయి సైనికులు రాష్ట్రపతి భవన్‌ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో మాల్దీవుల విద్యామంత్రి మాత్రం ఆ కిరాయి దుండ‌గుల చేతికి చిక్కాడు.

శ్రీ‌లంక‌, పాక్ హెల్ఫ్ కోరిన గ‌యూమ్‌..
ఇంత‌టి దారుణ స్థితిలో తను తలదాచుకున్న భవనం నుంచే గయూమ్ శ్రీలంక, పాకిస్థాన్ సైనిక జోక్యాన్ని కోరాడు. అయితే.. అబ్బే, మాకు అంత శక్తిసామర్థ్యాలు లేవని ఆ దేశాలు నిరాకరించాయి. త‌ర్వాత‌ సింగపూర్ సాయాన్ని కోరాడు. ఆ దేశం కూడా ఎన్నో కారణాలు చెబుతూ సారీ అనేసింది. బాబ్బాబు, దగ్గరలో మీ యుద్ధనౌక గానీ ఉంటే పంపాల‌ని అమెరికాను అభ్యర్థించాడు. సాయం చేయాలనే ఉంది గానీ, మరీ మీకు 1000 కిలోమీటర్ల దూరంలోని సైనిక స్థావరం నుంచి బలాలు పంపాలంటే 2, 3 రోజులు పడుతుందని అమెరికా కూడా చావుకబురు చల్లగా చెప్పింది.

హెల్ప్​ చేయని ఇతర దేశాలు..
అయితే.. ఇక్క‌డ ఏ దేశం కూడా మాల్దీవుల‌కు సాయం చేయాల‌నే ఆలోచ‌న‌లో లేవు. నిజానికి అవన్నీ సాకులుగా తెలుస్తున్నాయి. అయినా.. ఆశ వదలని అధ్య‌క్షుడు గయూమ్ బ్రిటన్ సాయం కూడా కోరాడు. వాళ్లేమో ఇండియా సాయం తీసుకోవోయ్ అని ఓ ఉచిత సలహా ఇచ్చారు. మరోవైపు కిరాయి సైనికులు మొత్తం ప్రభుత్వ భవనాలన్నీ ఆక్రమించేశారు. ఆ త‌ర్వాత అధ్యక్షుడి కోసం వెతుకుతున్నారు. అప్పుడు ఆయన ఇండియా సాయాన్ని కోరాడు. దీంతో ఇండియా రంగంలోకి దిగింది. వేరే శషభిషల్లేవు. వెనుకంజ లేదు. సాకులు అస‌లే లేవు. సాయం కోసం ఇండియా రెడీ అయిపోయింది.

స్పెష‌ల్ ఆప‌రేష‌న్ స్టార్ట్‌..
అరేబియా సముద్రంలో భార‌త‌ పట్టు ఉండాలంటే.. అంతర్జాతీయ జలాల్లో బయటి శక్తుల రాకడను నిరోధించాలంటే మాల్దీవుల్లో సుస్థిర, భారత అనుకూల ప్రభుత్వం ఉండాలి. అదీ భార‌త దేశం ముఖ్య ఉద్దేశం. వ్యూహాత్మకంగా అది కీలకమైన కేంద్రం. అందుకే అప్పటి ప్రధాని రాజీవ్​ గాంధీ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ కాక్టస్’ స్టార్ట్​ అయ్యింది. వెంటనే (నవంబరు 3వ తేదీన‌) రాత్రికి రాత్రే పారాచూట్ రెజిమెంట్ ప్రత్యేక విమానాల్లో ఆగ్రా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరింది. 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి హుల్హులేకు భారత బలగాలు చేరుకున్నాయి. అధ్య‌క్షుడు గయూమ్ విజ్ఞప్తి చేసిన 9 గంటల్లో మన సైన్యం ఆ దేశంలో దిగింది.

- Advertisement -

గంట‌ల స‌మ‌యంలోనే విముక్తి..
భార‌త పారాట్రూపర్లు మొట్టమొదట ఎయిర్ పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. మాలేకి చేరుకుని అధ్యక్షుడు గయూమ్‌ని రక్షించారు. చకచకా కొద్దిగంటల్లోనే రాజధానిలోని ప్రతి భవనాన్నీ విముక్తం చేశారు. గయూమ్ ప్రభుత్వం పున‌రుద్ధ‌ర‌ణ అయ్యింది. మిగిలిన కొందరు కిరాయి సైనికులు బతుకుజీవుడా అని శ్రీలంక వైపు పారిపోయారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో మరణించింది కేవ‌లం 19 మంది. అందులో కిరాయి సైనికులు హతమార్చిన ఇద్దరు బందీలు కూడా ఉన్నారు. కొందరు కిరాయి సైనికులు పట్టుబడ్డారు. శ్రీలంక వైపు పారిపోతున్న బోట్లను ఇండియన్ గోదావరి, బెత్వా నౌకలు అడ్డుకుని ప‌ట్టేసుకున్నాయి. ఇక‌.. అంత‌టితో ఆపరేషన్ కాక్ట‌స్ అయిపోయింది.

ఇండియా స్పంద‌న‌పై ప్ర‌శంస‌లు..
ఈ విష‌యంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఇండియా సత్వర స్పందనను ప్రశంసించారు. “ప్రాంతీయ స్థిరత్వానికి విలువైన సహకారం” అని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ కూడా అభినందించారు. ఒకటీ రెండు సార్క్ దేశాలు సహజంగానే ఇండియా మరీ పెద్దన్న పాత్రలోకి, బలప్రయోగాల్లోకి దిగుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. పట్టుబడిన ఆ కిరాయి సైనికులకు యావజ్జీవ కారాగారశిక్ష అమ‌లు చేశారు.

కృతజ్ఞ‌త లేని మాలే స‌ర్కారు..
ఇలాంటి మాల్దీవుల ప్ర‌భుత్వం ఇప్పుడు చైనా తోకగా మారింది. చైనాకు అది అవసరం, అరేబియా కీలక స్థావరాల్లో ఇండియా పట్టును సడలించడం, అంతర్జాతీయ జలాల్లో తన ప్రాబల్యం పెంచుకోవ‌డం చైనాకు అత్యంత అవ‌స‌రంగా మారింది. దీనికోసం మాల్దీవులను మంచి చేసుకుని త‌న ప‌ట్టును మ‌రింత పెంచుకుంటోంది. ప్రస్తుతం మాల్దీవుల అధ్యక్షుడు మొయుజ్జూ చైనా పర్యటన చేసి సంప్ర‌దింపులు జ‌రుపుకున్నాడు. ప‌లు ఒడంబ‌డిక‌ల మీద ఇరుదేశాలు సంత‌కాలు కూడా చేశాయి. ఈ క్ర‌మంలో మాల్దీవుల్లోని సైనికులను వాపస్ తీసుకోవాలని అక్క‌డి ప్రభుత్వం ఇండియాకు నిష్కర్షగా చెప్పింది. అంతేకాకుండా చైనా యుద్ధనౌక, జలాంతర్గాములు ఆ దేశ పరిసరాల్లో తిష్ట వేశాయి. అయితే.. మాల్దీవులు చిన్న పామే… కానీ, దాని వెనుక ఉన్నది మాత్రం భారీ డ్రాగన్!. ఈ కుట్ర‌ల‌ను భార‌త ప్ర‌ధాని మోదీ ఎలా తిప్పికొడ‌తారో అని ప్ర‌పంచ దేశాల‌న్నీ వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement