విరామం లేకుండా పేలుతున్న తుపాకులు
అన్నల రక్తంతో ఎర్రబారుతున్న అబూజ్‌మడ్
నక్సల్స్ రహిత భారత్ లక్ష్యమంటున్న అమిత్‌షా
అడవులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు
నాలుగు రాష్ట్రాల పోలీసులతో స్పెషల్ యాక్షన్
నిత్యం ఎన్‌కౌంటర్లు.. నేలకొరుగుతున్న అగ్ర నేతలు
15 రోజుల్లో 52 మంది మావోయిస్టుల మృతి
న్యూస్ నెట్‌వర్క్, ఆంధ్రప్రభ :
దండకారణ్యం దద్దరిల్లితోంది. నిత్యం తుపాకీ మోతలతో నెత్తురోడుతోంది.. పైన డ్రోన్ల సాయంతో మావోయిస్టులున్న ప్రాంతాన్ని గుర్తించి భద్రతా దళాలు ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో నక్సల్స్, పోలీసు బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఎందరో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. వయోభారంతో ఉన్న మావోయిస్టు అగ్రనేతలను లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు పోతున్నాయి. ఒకవైపు ఏరివేత.. మరోవైపు లొంగిపోవాలన్న ప్రభుత్వం పిలుపుతో వృద్ధాప్యంలో ఉన్న మావోయిస్టులు సైతం అడవులకే పరిమితం అవుతున్నారని తెలుస్తోంది.
దండకారణ్యం కేంద్రంగా…
దండకారణ్యం అటవీ ప్రాంతం నాలుగు రాష్ట్రాలకు విస్తరించి ఉంది. తెలంగాణ, ఛత్తీస్‌గడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాల్లో ఒకటైన బీజాపూర్ జిల్లా అబూజ్‌మడ్ అడవులు దట్టంగా ఉంటాయి. ఎత్తైన కొండలు కూడా. ఇవి శత్రుదుర్భేద్యంగా ఉంటాయని భావించి మావోయిస్టులు దీన్ని కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఎత్తైన కొండల నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను కూడా బైనాక్యులర్స్ ద్వారా గుర్తించే అవకాశాలు ఉంటాయి. దంతెవాడ, నారాయణ్‌పుర్, బీజాపుర్ జిల్లాల్లో దాదాపు నాలుగు వేల ఎకరాల్లో అబూజ్‌మడ్ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడికి రావడం భద్రతా బలగాలకు సాధ్యం కాదని, మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకుంటారనే ప్రచారం ఉంది. అబూజ్‌మడ్ అడవుల్లో కీలక నాయకులు ఉండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని నిఘావర్గాలు అనుమానించి హెచ్చరించాయి. అక్కడే ఆయుధ తయారీ, శిక్షణ, సమావేశాలు జరుగుతుంటాయని నిఘా వర్గాలు గుర్తించాయి. అలాగే ప్రతి అగ్రనేతకు నాలుగు అంచెల భద్రతా కూడా ఉంటాయి.
కేంద్ర-రాష్ట్ర బలగాలు నిరంతర నిఘా..
దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేకమార్లు ప్రకటించారు. 2026 మార్చికి నక్సల్స్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది. అలాగే ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు పెరిగిపోయాయి. దాదాపు బస్తర్ జిల్లాల్లో మావోయిస్టుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రంగంలోకి దిగింది. కేంద్ర-రాష్ట్ర బలగాలు ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్లి వామపక్ష తీవ్రవాదాన్ని తుది ముట్టించడానికి సిద్ధమయ్యాయి. అందులో భాగంగా దండకారణ్యం చుట్టూ కేంద్ర బలగాల క్యాంపెయిన్ ఏర్పాటు చేసింది. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక క్యాంప్ ఏర్పాటు చేసిన మావోయిస్టుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. అటు కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా చొచ్చుకుపోతున్నాయి. లోపల ఉన్న మావోయిస్టులెవరూ బయటకురాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. డ్రోన్లతోనూ నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) ద్వారా అమ్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్(యూఏవీ)లను కూడా వినియోగిస్తూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఉన్న బలగాలకు చేరవేస్తున్నారు. కీలకమైన ప్రాంతాల్లో రాత్రిపూట కూడా నిఘా పెట్టే డ్రోన్లను వాడుతున్నారు. మావోయిస్టులు మందుపాతరలు పెట్టి ఉంటారని అనుమానిస్తును బలగాలు ఆత్యాధునిక బాంబు నిర్వీర్య దళాలను రంగంలోకి దింపాయి. ఇలా ముప్పెట దాడి చేసి మావోయిస్టులను మట్టుబెడుతున్నాయి.
కీలకనేతలను కాపాడుకోవడమే మావోయిస్టులకు పెద్ద సవాల్
మావోయిస్టు పార్టీలో కొత్త రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో ఉన్న కీలక నేతలందరూ వృద్ధాప్యంతో బాధపడుతున్నారన్న సమాచారం నిఘా వర్గాల వద్ద ఉన్నాయి. సాధారణంగా కేంద్ర కమిటీ సభ్యులకు నాలుగు అంచెల భద్రతా ఉంటుంది. అయితే కొత్తతరం లేకపోవడంతో కీలకనేతల భద్రత కూడా వారి ఒక సమస్యగా ఉందని తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి కూడా వృద్ధాప్యం సమస్యతో బాధపడుతూ తూటలకు బలైనట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ రథసారధి నంబాళ్ల కేశవరావు, మాజీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లోజుల వేణుగోపాల్ 70 ఏళ్లకు పైబడ్డ వారే..! మిగతా వారిలో కడారి సత్యనారాయణరెడ్డి, మోడెం బాలకృష్ణ, తెంటూ లక్ష్మీనర్సింహాచలం, పుల్లూరి ప్రసాదరావు కూడా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఓ వైపు కేంద్ర బలగాలను ఎదుర్కోవడం.. మరోవైపు అగ్రనేతలను కాపాడుకోవడం మావోయిస్టు పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. మల్లోజుల కోటేశ్వరరావు భార్య పోతుల కల్పన కేంద్ర కమిటీ సభ్యుల్లో ఏకైక మహిళ. ఆమె జనతన సర్కార్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అడపాదడపా పోలీసుల వ్యూహాలను తిప్పికొడుతున్న కేంద్ర కమిటీ సభ్యుల్లో తిప్పిరి తిరుపతి, గాజర్ల రవి, కట్టా రామచంద్రారెడ్డి, బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, పసునూరి నరహరి ఉన్నారు.
మావోయిస్టు పార్టీకి కీలక సమయం ఇదే!
ఒక వైపు మావోయిస్టు పార్టీ అగ్రనేతలను కాపాడుకోవడం.. మరో వైపు ముప్పెట దాడి చేస్తున్న కేంద్ర, రాష్ట్రాల బలగాలను ఎదుర్కోవడం ఆ పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. గత ఏడాది 267 మంది వరకూ కోల్పోయిన మావోయిస్టు పార్టీ ఈ ఏడాది ఆరు ఎన్‌కౌంటర్లలో సుమారు 50 మంది వరకు కోల్పోయింది. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిరావును కోల్పోవడం ఆ పార్టీకి తీరని లోటు. ఎన్‌కౌంటర్‌లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడిని కోల్పోవడం ఇదే ప్రథమం. కొత్త రిక్రూట్ లేకపోవడంతో, మరోవైపు ఉన్న క్యాడర్ పోలీసు తూటలకు బలి అవడంతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. తుది శ్వాసలో మావోయిస్టు పార్టీ ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. డ్రోన్, అత్యాధునిక సాయంతో బలగాలు ముందుకు వెళుతున్న ఈ తరుణంలో మావోయిస్టు పార్టీకి కీలక సమయంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.