Thursday, November 14, 2024

Smart Exclusive – పారిస్ ఒలింపిక్స్ క్రీడా గ్రామం మ‌హాద్భుతం!

కండ్లు చెదిరే కట్టడాలు, అధునాత సౌకర్యాలు
131 ఎక‌రాల్లో ప్ర‌త్యేక క్రీడా గ్రామం నిర్మాణం
82 అతి పెద్ద భ‌వ‌నాలు, 3వేల ప్లాట్ల‌లో 7200 గ‌దులు
సీన్ న‌ది ఒడ్డున మూడు న‌గ‌రాల్లో విస్త‌ర‌ణ‌
14,500 మంది అథ్లెట్స్‌కి అధునాతన వ‌స‌తి
15,490 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణాలు
ప్రాక్టీసు కోసం పలు రకాల క్రీడా వేదికలు
కుటుంబంతో గడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
జియో థర్మల్​ విధానంలో బిల్డింగ్స్​ నిర్మాణం
కర్బన రహితం, కాలుష్య రహితంగా చర్యలు
కలప, ఉక్కు కంటే మేలైన మంచాలు
అథ్లెట్లకు అందుబాటులో మూడు లక్షల కండోమ్స్
క్రీడాకారుల రొమాన్స్ కోసం ప్రత్యేక సౌకర్యాలు​

ఒలింపిక్స్​.. ప్రతి క్రీడాకారుడు ఒక్కసారైనా పాల్గొనాలి అనుకునే వేదిక. క్రీడా రంగంలో ఉన్న వారికి ఇదో తీరని దాహర్తి, ఒక స్ఫూర్తి.. ఒలింపిక్స్​లో పార్టిసిపేట్​ చేయడం అంటే ప్రపంచ దేశాలతో పోటీ పడడం. 200 కంటే ఎక్కువ దేశాలు సమ్మర్, వింటర్ గేమ్స్‌లో 400కి పైగా ఈవెంట్స్​లో పాల్గొంటాయి. అందుకే ఒలింపిక్స్​కి అంత క్రేజ్​ ఉంటుంది. ఇక.. 1896 నుంచి ఈ ఒలింపిక్స్​ ఆటలు ప్రారంభం కాగా, 1900, 1924 సంవత్సరాల్లో పారిస్​లో ఒలింపిక్స్​ జరిగాయి. మళ్లీ ఇప్పుడు 2024 ఒలింపిక్స్​ క్రీడలకు పారిస్​ వేదిక అయ్యింది. కాగా, నాలుగేండ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఆయా దేశాల క్రీడాకారులు ఉవ్వీళ్లూరుతుంటారు. మరి ఈ క్రీడా గ్రామం ముచ్చట్లేంటియో చదివి తెలుసుకుందాం..


ఆంధ్రప్రభ స్మార్ట్​, స్పోర్ట్స్​ డెస్క్​:

పారిస్ ఒలింపిక్స్ కోసం పారిస్​లో ప్రత్యేక క్రీడా గ్రామం నిర్మతమైంది. ఇదికూడా పర్యావరణహితంగా, అథ్లెట్ల అవసరాలకు అనుగుణంగా 131 ఎకరాల్లో ఈ క్రీడా గ్రామాన్ని నిర్మించారు. దీని నిర్మాణం కోసం ముందుగానే కొంతమంది అథ్లెట్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇక.. 82 భవనాల్లో మూడు వేల ప్లాట్లలో 7200 గదులను నిర్మించారు. ఈ భవనాలన్నీ సీన్ నది ఒడ్డుపై మూడు (సెయింట్ డెనిస్, సెయింట్ వాన్, లీలి సెయింట్ డెనిస్) నగరాల్లో విస్తరించి ఉన్నాయి.

- Advertisement -

₹15,490 కోట్ల ఖర్చుతో..

ఒలింపిక్స్ లో 14,500 మందికి, పారాలింపిక్స్​లో 9 వేల మందికి ఈ క్రీడా గ్రామం వసతి కల్పించనుంది. దీని నిర్మాణం కోసం సుమారు ₹15,490 కోట్ల ఖర్చు చేశారు. అథ్లెట్ల శిక్షణకు, జిమ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా సరదాగా సేద తీరేందుకు కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాకుండా బాస్కెట్​ బాల్, బ్రేక్ డ్యాన్సింగ్, హ్యాండ్​ బాల్, ఫెన్సింగ్, వెయిట్​ లిఫ్టింగ్, రెజ్లింగ్ కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ వేదికలున్నాయి.

వినోదం కోసం విలేజ్​ క్లబ్​..

వినోదం కోసం విలేజ్ క్లబ్ ఉంది. ఫ్రాన్స్​లో ఒకే చోట నిర్మించిన అతిపెద్ద నిర్మాణం ఇదే. పిల్లలున్న అథ్లెట్ల కోసం ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా ఈ క్రీడా గ్రామంలో నర్సరీ (పిల్లలతో కలిసి సమయం గడిపేందుకు)ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడి ప్రధాన భోజనశాలలో ఒకేసారి 3500 మంది భోజనం చేయొచ్చు. మన అథ్లెట్ల కోసం భారతీయ వంటకాలతో ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు.

ఒలింపిక్స్​ తర్వాత మారనున్న సీన్​..

ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఈ క్రీడా గ్రామం పూర్తిగా మారిపోనుంది. 2800 ఇళ్లు, ఓ హోటల్, పార్కు, కార్యాలయాలు, దుకాణాలతో ఇది నివాస ప్రాంతం అవుతుంది. ఇక.. ఈ క్రీడా గ్రామం నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పర్యావరణ రక్షణ కోసమని అథ్లెట్ల గదుల్లో ఏసీలు బిగించలేదు. జియోథర్మల్ విధానంలో భవనం మొత్తాన్ని చల్లగా ఉంచే ఏర్పాట్లు చేశారు. ఇక.. అథ్లెట్ల ట్రాన్స్​పోర్టేషన్​ కోసం ఎలక్ట్రిక్​బస్సులు, ద్విచక్ర వాహనాలను రెడీగా ఉంచారు. కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ భవనాల నిర్మాణంలో 75శాతం పునర్వినియోగానికి ఉపయోగపడే సామగ్రి వాడినట్టు తెలుస్తోంది.

రొమాన్స్​ కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

టోక్యో మాదిరిగానే ఇక్కడా కార్డుబోర్డు (పెద్ద అట్టలు)తో చేసిన మంచాలనే ఉపయోగించారు. అయితే.. ఇవి ఒకరికే సరిపోయేంత చిన్నగా ఉన్నాయని, శృంగారానికి సౌకర్యవంతంగా లేవనే విమర్శలు వచ్చాయి. కానీ, అలాంటిదేమీ ఉండదని నిర్వాహకులు తెలిపారు. కాగా, ఈ మంచాలు కలప, ఉక్కు మంచాల కంటే దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా పునర్​ వినియోగించేందుకు వీలుగా ఈ మంచాలను, పరుపులను ఏర్పాటు చేశారు. ఇక.. క్రీడా గ్రామంలోని అథ్లెట్ల కోసం 3 లక్షల కండోమ్‌లను అందుబాటులో ఉంచినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement