Wednesday, November 20, 2024

చిన్నచిన్న కలలు చిన్నబోయాయి.. 2019 స్థాయి కంటే దిగువన ఎకానమీ.. నోబెల్‌ అవార్డ్‌ గ్రహీత

న్యూఢిల్లీ: నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్రజలు తీవ్ర బాధలో ఉన్నారని అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా 2019 నాటి స్థాయి కంటే దిగువనే ఉందని వ్యాఖ్యానించారు. జనాల చిన్న చిన్న కలలు చిన్నబోయాయన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ యూనివర్సిటీ 11వ వార్షిక స్నాతకోత్సవ వేడుకలో విద్యార్థులను ఉద్దేశించి అమెరికా నుంచి వర్చువల్‌గా అభిజిత్‌ బెనర్జీ మాట్లాడారు. ఇటివల పశ్చిమబెంగాల్‌ పర్యటనలో గ్రహించిన అంశాలను విద్యార్థులతో ఆయన పంచుకున్నారు. విద్యార్థులు సమాజానికి ఎంతోకొంత తిరిగిచ్చేయగల స్థానంలో ఉన్నారు. సమాజానికి ఇది ఆవశ్యకం. భారత్‌లో తీవ్ర బాధాకాలంలో ఉన్నామని అభిజిత్‌ పేర్కొన్నారు. గ్రామీణ పశ్చిమ బెంగాల్‌లో కొంతకాలమే ఉన్నాను. విన్న కథలు, కలలు చాలా చిన్నవి. కానీ నిజమవ్వడం లేదు. చిన్న కొర్కెలు మరింత చిన్నవైపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు.

తీవ్రమైన బాధలో ఉన్నామని భావిస్తున్నానని అభిజిత్ బెన‌ర్జీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా 2019 నాటి స్థాయి కంటే దిగువనే ఉంది. ఎంత దిగువన ఉందో తెలియదు. కానీ గణనీయంగా ఉంటుందన్నారు. నేను ఎవరినీ నిందించడం లేదు. చెబుతున్నానంతే అని అన్నారు. కెరియర్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన సూచించారు. భారతీయ గొప్ప సినీ దర్శకులైన సత్యజిత్‌ రే, శ్యామ్‌ బెనగల్‌ ఇద్దరూ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. కానీ ఇందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారని గుర్తుచేశారు. విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ జీవితంలో బాగానే రాణించారు. ఆలోచనాత్మకంగా ఉండడం చాలా ముఖ్యమని విద్యార్థులకు ఆయన సూచించారు. కాగా 2019లో ఎస్తర్‌ డఫ్లో, మిచెల్‌ క్రెమెర్‌తో ఉమ్మడిగా అభిజిట్‌ బెనర్జీ నోబెల్‌ అవార్డ్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే.

10 రోజులు తీహార్‌ జైళ్లో ఉన్నా: అభిజిత్‌ బెనర్జీ
జీవితంలో మార్గంలో నడవాలనేది విషయంలో కుటుంబం లేదా సమాజం ఒత్తిళ్లను పట్టించుకోవద్దని విద్యార్థులకు సూచించారు. జీవితంలో ఏం చేయాలనుకుంటున్నా ధైర్యంతో ముందడుగు వేయాలని ఆయన సూచించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) ఢిల్లిdలో విద్యార్థిగా ఉన్నప్పుడు 10 రోజులు తీహార్‌ జైలులో గడిపానని ఆయన వెల్లడించారు. జేఎన్‌యూని వీడి హార్వర్డ్‌లో చేరడానికి ముందు విద్యార్థుల ఆందోళనలో పాల్గొన్నాను. అప్పుడు 10 రోజులు జైల్లో పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చాక.. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావని పెద్దవాళ్లు అన్నారు. హార్వర్డ్‌ లేదా అమెరికా నిన్ను అడుగుపెట్టనివ్వబోవన్నారు. నేను పశ్చాత్తాప పడాల్సిందేనని అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement