హైదరాబాద్ – రైలు ఎక్కేప్పుడు ప్రమాదవశాత్తు కింద పడిపోయిన ఓ ప్రయాణికుడి చెప్పును తిరిగి అందించి.. తమ పనితీరును చాటుకున్నారు అర్ పి ఎఫ్ పోలీస్ లు ఈ ఘటన కాజీపేటలో జరిగింది. వినడానికి విచిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజంగా జరిగింది. బంగారం పోతేనే రికవరీ చేయడం కష్టమైన ఈ రోజుల్లో.. చెప్పును రికవరీ చేశారని తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. పోలీసుల పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. జనగామ జిల్లా చిలుకూరు మండలం పల్లగుట్టకు చెందిన రాజేష్(25) అనే యువకుడు సికింద్రాబాద్ వెళ్లాలనుకున్నాడు. దీనికోసం స్టేషన్ ఘన్పూర్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అప్పటికే రైలు కదులుతుండడంతో.. కదులుతున్న రైలు ఎక్కబోయాడు.. రైలు అయితే ఎక్కగలిగాడు.. కానీ, అతడి కాలికున్న చెప్పు ఒకటి జారి పట్టాల మధ్యలో పడిపోయింది. అది అతడిని బాధించింది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న చెప్పులు అలా జారిపోవడంతో.. రైల్వే అధికారులకు ‘నాకు చాలా ఇష్టమైన చెప్పులు అవి.. చెప్పులు కొత్తవి’ జారిపోయాయి.. అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు సికింద్రాబాద్ డివిజనల్ భద్రతాధికారి దేబాస్మిత స్పందించారు. వెంటనే చెప్పును రికవరీ చేయాల్సిందిగా కాజీపేట ఆర్పిఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆ విద్యార్థి చెప్పును రికవరీ చేశాడు. ఆ తర్వాత ఆదివారం నాడు కాజీపేటకు తీసుకువచ్చి రాజేష్ కి అప్పగించారు.