హైదరాబాద్, ఆంధ్రప్రభ : -తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వల్ప అస్వస్తతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన బాగా ఆలసటకు గురి కావడంతో పాటు ఎడమ చేయి లాగుతుండడం, కాలు నొప్పి ఉందని సీఎం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు, యశోదా ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావుకు తెలిపారు. వెంటనే ఆయన ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్, న్యూరోఫిజీషియన్ల బృందంతో కలిసి ప్రగతి భవన్ వెళ్లారు. అక్కడ ఆయనకు సత్వరమే వైద్యుల బృందం ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండు రోజులుగా నలతగా ఉందని, ఎడమ చేయి లాగుతోందని కేసీఆర్ వైద్యులకు చెప్పడంతో గుండె సంబంధిత సమస్య ఉందన్న అనుమానంతో వైద్యులు సీఎం కేసీఆర్‌ను తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం యశోదా ఆసుపత్రికి రావాలని కోరారు. సతీమణి శోభ, కుమార్తె కవిత, మనవడు హిమాన్షు, ఎంపీ సంతోష్ రావులతో కలిసి కేసీఆర్ ఉదయం ఆసుపత్రికి చేరుకున్నారు. వెంటనే ఆయనను స్ట్రెఛర్‌పై వైద్యుల బృందం ఆసుపత్రి తొమ్మిదవ అంతస్తులో ఉన్న థియేటర్లలోకి తీసుకువెళ్లి అవసరైన ప్రత్యేక పరీక్షలన్నీ నిర్వహించింది. సీఎం కేసీఆర్ ఎడమ చేయి లాగుతుందన్న ఫిర్యాదుతో తొలుత ఆయనకు గుండె సంబంధిత యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు.
ఆ తర్వాత చేయి లాగుతుందని చెప్పడంతో 2డీ ఎకో, ఎంఆర్‌ఐ వంటి పరీక్షలు జరిపామని డాక్టర్ ఎంవీ రావుతో పాటు ప్రమోద్ కుమార్, ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ విష్ణురెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. ఎడమ చేయి నొప్పి అని చెప్పడంతో కరోనరి బ్లాక్స్ ఎమైనా ఉన్నాయోనన్న అనుమానంతో తొలుత యాంజియోగ్రామ్ చేశామని చెప్పారు. అదృష్టవశాత్తు బ్లాక్స్ ఏమీ లేవని అన్నారు. హార్ట్ ఫంక్షన్ ఎట్ల ఉందో తెలుసుకోవడానికి ఈసీజీ, 2డీ ఎకో టెస్టులు కూడా చేశామని ఫలితాలు సాధారణంగానే వచ్చాయని చెప్పారు. తర్వాత గుండెకు సంబంధించినటువంటి రక్త పరీక్షలు కూడా చేశామని రిపోర్టులు నార్మల్‌గానే వచ్చాయని చెప్పారు. ఈ రిపోర్టులన్నింటినీ పరిశీలించాక కేసీఆర్ గుండెకు సంబంధించిన సమస్యేదీ లేదన్న నిర్ధారణకు వచ్చామని చెప్పారు. ఎడమ చేతికి నొప్పి ఎందుకు కలుగుతోందని దానికి సంబంధించిన ఎంఆర్‌ఐ టెస్టు, బ్రెయిన్‌కు సంబంధించి కూడా మరో పరీక్ష నిర్వహించామని అది కూడా నార్మల్‌గానే వచ్చాయని చెప్పారు. ఆయా రంగాల్లో ఉన్న వైద్యులనంతా కూర్చుని రిపోర్టులపై చర్చించామని చెప్పారు. కేసీఆర్‌కు కొంచెం బ్లడ్ ఫ్రెషర్, మధుమేహం ఉందని అవి నియంత్రణలోనే ఉన్నాయని చెప్పారు. 90 శాతం పరీక్షల రిపోర్టులు వచ్చాయని ఇతర పీరీక్షల రిపోస్టులు రావలసి ఉందని తెలిపారు.
గుండె, కిడ్నీ, లివర్ ఫంక్షన్, కోలెస్ట్రాల్ లెవల్స్ బాగున్నాయన్నారు. దీంతో కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని బ్లడ్ ఫ్రెషర్, మధుమేహం నియంత్రణలో ఉంచుకోవాలని కోరినట్టు చెప్పారు. ఈ మధ్య ఆయన పర్యటనలకు తరచూ వెళుతుండడంవల్ల నీరసంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రసంగాలు తరచూ ఇస్తుండడంవల్ల విశ్రాంతి అవసరమని చెప్పామని, విశ్రాంతి తీసుకుంటే మంచిదని చెప్పామన్నారు. ఇకనుంచి ప్రతి వారం ఆయనకు రక్త పరీక్షలు నిర్వహిస్తామని గ్లూకోస్ లెవల్ ఎలా ఉన్నాయో పరీక్షలు నిర్వహించి పరిశీలిస్తామని చెప్పారు. వారం పాటు విశ్రాంతి తీసుకున్నాక రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారని చెప్పారు.
అవసరమైన రక్త పరీక్షలన్నీ నిర్వహించామని ఫలితాలు సాధారణంగానే వచ్చాయని పేర్కొన్నారు. రక్త ప్రసరణ బాగానే ఉందని, ఎక్కడా బ్లాక్‌లు లేవని తేలినట్లు వివరించారు. డే కేర్ విధానంలో సీఎంను ఆసుపత్రిలో చేర్చామని సాయంత్రానికి ఆయన తిరిగి ఇంటికి వెళతారని చెప్పారు. రెండు రోజులుగా బాగా అలసిపోయినట్టు సీఎం తమకు చెప్పారని వారు పేర్కొన్నారు. తొలుత ఆయనను పరీక్షించేందుకు వెళ్లిన సమయంలో ఎడమ చేయి లాగుతోందని, కాలు నొప్పిగా ఉందని చెప్పినట్టు వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ సర్వైకల్ స్ప్రెయిన్‌తో ఇబ్బంది పడుతున్నారన్న విషయం బయట పడిందని చెప్పారు. నరంపై ఒత్తిడి పడి కేసీఆర్ ఎడమ చేయికి నొప్పి కలిగిందని చెప్పారు.
ప్రతియేటా ఫిబ్రవరి నెలలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఈ ఏడాది ఇంకా వైద్య పరీక్షలు చేయించుకోకపోవడంతో ఆసుపత్రికి రావాలని కోరడంతోనే అందుకు ఆయన అంగీకరించారని చెప్పారు. దీంతో ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలన్నీ చేశామని తెలిపారు. పెద్ద వారికి ఇటువంటి ఇబ్బందులు తలెత్తడం సర్వసాధారణమేనని వారు తెలిపారు. నరంపై ఒత్తిడి పడడంవల్లే ఎడమ చేయికి నొప్పి కలిగిందని మందులు వాడితే ఇది తగ్గిపోతుందని శస్త్ర చికిత్స అవసరం లేదని చెప్పారు. కేసీఆర్ తరచూ వార్త పత్రికలు చదువుతారని, ఐపాడ్ ఎక్కువగా చూస్తుండడంవల్లే ఎడమ చేయి నొప్పి కలిగిందని తాము అనుమానిస్తున్నట్టు వారు చెప్పారు.
ఉదయం స్వల్ప ఆస్వస్తతకు గురైన కేసీఆర్
శుక్రవారం ఉదయం సీఎం కేసీఆర్ యాదాద్రి వెళ్లేందుకు కార్యక్రమం రూపొందించుకున్నారు. యాదాద్రిలో జరుగుతున్న ఆలయ పనులను పర్యవేక్షించి అక్కడ జరుగుతున్న పనులను అధికారులతో కలిసి సమీక్షించాలని భావించారు. అక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనాలని, పట్టువస్త్రాలు సమర్పించాలని నిర్ణయించారు. అయితే ఆయన ఉదయమే స్వల్ప అస్వస్తతకు గురి కావడంతో యాదాద్రి పర్యటన రద్దయింది. యశోదా ఆసుపత్రి వైద్యుల వైద్యుల సూచన మేరకు శుక్రవారం కేసీఆర్ సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల దాకా అవసరమైన వైద్య పరీక్షలన్నీ నిర్వహించిన డాక్టర్లు ఆ తర్వాత రెండు గంటలపాటు తమ పర్యవేక్షణలో ఉంచుకున్నారు. డే కేర్ విధానంలో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్‌ను మధ్యాహ్నం 3 గంటల తర్వాత డిశ్ఛార్జ్ చేశారు. కేసీఆర్ అస్వస్తతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న మంత్రులు కేటీ రామారావు, హరీష్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, షేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రెడ్యా నాయక్‌లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిడ్ తదితరులు ఆసుపత్రికి చేరుకుని కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని ఎటువంటి సమస్యలు లేవని తేలడంతో కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఊపిరి పీల్చుకున్నారు. శాసనసభ సమావేశాలు జరుగుతుండడంతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు యశోదా ఆసుపత్రికి చేరుకుని తమ అధినేత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.