తమిళనాడులోని కడవూర్‌లో స్లెండర్ లోరిస్‌లకు అభయారణ్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 11,806 హెక్టార్ల విస్తీర్ణంలో దుండిగల్ జిల్లా పరిధిలో ఇది ఉంది. స్లెండర్ లోరీస్ అనేది అరుదైన క్షీరదం. కోతి మాదిరిగా ఉంటుంది. జీవితంలో ఎక్కువ కాలం చెట్లపైనే ఉంటుంది. చెట్లపై వాలే కీటకాలను తింటూ రైతులకు మేలు చేస్తుంది. అంతరించి పోతున్న అరుదైన జాతుల జాబితాలో లోరిస్ ఉంది.
గత ఏప్రిల్ తమిళనాడు ప్రభుత్వం శాసనసభలో స్లెండర్ లోరీస్ అభయారణ్యం గుర్తింపును ప్రతిపాదించింది. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972, సెక్షన్ 26(ఏ)(1)(బి) ప్రకారం కడవూర్ స్లెండర్ లోరిస్ అభయారణ్యంగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం 15 నెలల్లో ప్రభుత్వం మార్గనిర్దేశనం చేసి స్లెండర్ లోరీస్ పరిరక్షణకు కీలక నిర్ణయం తీసుకుందని తమిళనాడు పర్యావరణ చీఫ్ సెక్రటరీ సుప్రియా సాహూ హర్షం వ్యక్తం చేశారు.