కేంద్రం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తామని భీష్మిచుకుని కూర్చున్న వేళ…లాభాల బాటలో దూసుకుపోతోంది విశాఖ ఉక్కు పరిశ్రమ. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు తగిన ప్రోత్సాహం కేంద్రం నుంచి లేదు అది కనుక ఉంటే ఏనాడో లాభాల బాట పట్టేది అన్నది కార్మిక సంఘాల వాదన. ఇక సొంత గనులు లేకపోయినా ఉక్కు అనేక సందర్భాలలో లాభాలను చవిచూసింది. రెండేళ్ళుగా ఉక్కు ప్రైవేట్ బలిపీఠం మీద ఉంది. దాంతో ఉక్కుని ప్రైవేట్ పరం చేయవదంటూ ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కార్మిక లోకం అంతా గట్టి పట్టుదలతో పనిచేస్తోంది. గతం కంటే ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తూ రికార్డులను ఒక వైపు బద్ధలు కొడుతోంది. ఇపుడు ఆరేళ్ళ తరువాత మళ్లీ విశాఖ ఉక్కు లాభాల బాటలోకి వచ్చింది. నిజంగా ఇంతటి కీలకమైన సమయంలో విశాఖ ఉక్కు లాభాలను చూడడం అంటే నిజంగా గొప్పగా చెప్పుకోవాలి. విశాఖ ఉక్కు 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 835 కోట్ల రూపాయల లాభాలను సాధించింది. ఈ విషయాన్ని విశాఖ ఉక్కు కర్మాగారం ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ భట్ తెలియచేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే స్టీల్ ప్లాంట్ 2021-22లో అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది.
అలాగే ఉక్కు కర్మాగారం అత్యుత్తమ అమ్మకాల టర్నోవర్ ను కూడా సాధించింది. దీని విలువ 28 082 కోట్లుగా పేర్కొంటున్నారు. ఇది మునుపటి టర్నోవర్ కంటే 35 శాతం ఎక్కువగా తెలియచేస్తున్నారు ఇక విశాఖ ఉక్కు కర్మాగారం ఈ రకమైన లాభాలు గడించడం వెనక సమిష్టిగా పని చేసిన విధానం ఉందని అంటున్నారు. అలాగే స్థూల మార్జిన్ గ 3575 కోట్లు ఆర్ద్జించిందని ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ భట్ వివరిస్తున్నారు. అంతే కాదు 2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రధాన ఉత్పత్తి యూనిట్లలో అత్యుత్తమ ఉత్పత్తి గణాంకాలను సాధించడం కోసం పెద్ద ఎత్తున జరిగిన కృషిని ఆయన కొనియాడారు. నిజంగా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ విశాఖ ఉక్కు ఈ స్థాయిలో లాభాలను ఆర్జించడం అంటే మెచ్చుకుని తీరాలి. లాభాల్లో దూసుకుపోతోన్న విశాఖ ఉక్కుని నష్టాల్లో ఉందంటూ కేంద్రం ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.