విశాఖ జిల్లా సీలేరు నదిలో రెండు నాటు పడవలు మునిగిన ఘటనలో ఆరుగురు జల సమాధి అయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. మరో మహిళ, చిన్నారి గల్లంతయ్యారు. నిన్న రాత్రి వరకు వారిద్దరి కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పడటంతో గాలింపు చర్యలను సిబ్బంది నిలిపివేశారు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం బుధవారం గాలింపు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని గుంటవాడ పంచాయతీ కోందుగూడా గ్రామానికి చెందిన సుమారు 11 మంది పనుల నిమిత్తం వలసకూలీలుగా తెలంగాణకు వెళ్లారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పనులు లేకపోవడంతో స్వగ్రామాలకు పయనమయ్యారు. సోమవారం రాత్రి సీలేరు చేరుకున్నారు. రోడ్డుమార్గాన ఒడిశా వెళ్తే, అడ్డుకుంటారేమోనని భయపడిన కూలీలు అడ్డదారిన సీలేరు కంపెనీ కాలువ దగ్గరకు చేరుకున్నారు. సోమవారం అర్ధరాత్రి 11 మంది గిరిజనులు రెండు నాటు పడవల్లో ఒడిశాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొదట బయలుదేరిన నాటు పడవ నది మధ్యలోకి వెళ్లేసరికి ముందు వెళ్తున్న నాటు పడవ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రెండో నాటుపడవలో ఉన్నవారు నదిలో పడినవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో రెండో పడవ కూడా మునిగిపోయింది. దీంతో రెండు పడవల్లోని 11 మంది నదిలో మునిగారు.
వారిలో ముగ్గురు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకుని గ్రామానికి వెళ్లి విషయం తెలియజేశారు. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం చిన్నారులు అభి, గాయత్రి, అనూష మృతదేహాలతో మరో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి కోసం బుధవారం ఉదయం గాలింపు చేపట్టారు. మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.