Friday, November 15, 2024

మీ పిఎలే , మీ క‌ళ్ల ముందే పేప‌ర్లు ఎత్తుకెళ్లారు… మీరేం చేస్తున్నారు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో తవ్వినకొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అనుమానితులు, నిందితులు, సాక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, బోర్డు సభ్యులు లింగారెడ్డికి సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరి కొంత మందికి కూడా త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, టీఎస్‌పీఎస్‌సీ బోర్డు సభ్యులు లింగారెడ్డి సిట్‌ విచారణకు శనివారం హాజరయ్యారు. అనితా రామచంద్రన్‌ ఉదయం సిట్‌ ముందు హాజరు కాగా, లింగారెడ్డి మధ్యాహ్నం హాజరయ్యారు. అనితా రామచంద్రన్‌ను సుమారు నాలుగు గంటల పాటు, లింగారెడ్డినిరెండు గంటల పాటు విచారించారు. సిట్‌ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఇద్దరి విచారణ కొనసాగింది. ఇద్దరి స్టేట్‌మెంట్‌ను అధికారులు ఈమేరకు రికార్డ్‌ చేసినట్లు తెలిసింది. పేపర్‌ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్‌.. కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ పీఏగా ఉన్నాడు. లింగారెడ్డి పీఏగా మరో నిందితుడు రమేష్‌ ఉన్నారు. వీరిద్దరు ఇప్పటికే సిట్‌ అదుపులో ఉన్నారు. పేపర్‌ లీకేజీలో సంబంధం ఉన్న ఈ ఇద్దరి పీఏల గురించి సిట్‌ అధికారులు వారిని విచారించినట్లు తెలుస్తోంది. ప్రశ్నపత్రాల తయారీ, వాటి భద్రత, పరిపాలన, పరీక్షల నిర్వహణపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వారి వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు.

పేపర్‌ లీకేజీ కేసులో విచారణకు హాజరుకావాలని 160 సీఆర్పీసీ కింద సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేయడంతో అనితా రామచంద్రన్‌ తొలుత సిట్‌ కార్యాలయానికి చేరుకొని సిట్‌ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ను కలిశారు. మహిళా ఎస్‌ఐలు మాధవి, మేఘన ఆధ్వర్యంలో అనితా రామచంద్రన్‌ను విచారించి వాంగ్మూలం రికార్డు చేశారు. మధ్యాహ్నం వరకు ఆమె నుంచి వివిధ కోణాల్లో సమాచారం సేకరించారు. ఇప్పటికే కేసులో కస్టడీలో ఉన్న కార్యదర్శి పీఏ ప్రవీణ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా అనితా రామచంద్రన్‌ను విచారించినట్లు తెలిసింది. పీఏగా ప్రవీణ్‌ నిర్వర్తించే విధులు, కాన్ఫిడెన్షియల్‌ రూమ్‌కు సంబంధించిన సమాచారంపై ఆమె నుంచి అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. గ్రూప్‌-1 పేపర్‌ సహా అన్ని పేపర్స్‌కి సంబంధించిన మాస్టర్‌ ప్రశ్నపత్రాలు టీఎస్‌పీఎస్‌సీకు ఎప్పుడు వచ్చాయనే కోణంలో సిట్‌ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. కమిషన్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, కాన్ఫిడెన్షియల్‌ రూమ్‌ అధికారిని శంకర్‌లక్ష్మీతో పాటు ప్రశ్నపత్రాల గురించి ఇంకా ఎవరికైనా తెలిసే అవకాశాలు ఉన్నాయా? అని ఆమెను విచారించినట్లు తెలిసింది. ప్రవీణ్‌, రాజశేఖర్‌లతో పాటు సెక్రటరీ పేషీకి తరచూ వచ్చే ఇతర వ్యక్తుల గురించి కూడా ప్రశ్నించినట్లు తెలిసింది.

సెక్రటరీ అనిత రామచంద్రన్‌ విచారణ ముగిసిన అనంతరం బోర్డు సభ్యులు లింగారెడ్డిని సిట్‌ అధికారులు ప్రశ్నించారు. లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న రమేష్‌.. లింగారెడ్డి వద్ద పీఏగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే పలు కోణాల్లో లింగారెడ్డిని విచారించారు. ములుగు జిల్లాకి చెందిన రమేష్‌ తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ ద్వారా టీఎస్‌పీఎస్‌సీలో జాయిన్‌ అయ్యాడు. ఔట్‌సోర్సింగ్‌ కింద డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహించేవాడు. ఏడుగురు బోర్డు సభ్యుల్లో ఒకరైన లింగారెడ్డికి పర్సనల్‌ అసిస్టెంట్‌గా వ్యవహరించేవాడు. ఈ క్రమంలోనే సెక్రటరీ పేషీ, చైర్మన్‌ చాంబర్‌ సహా కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌కి వెళ్తుండేవాడని సమాచారం. ఇలా సెక్రటరీ పీఏ ప్రవీణ్‌, నెట్‌వర్క్‌ రాజశేఖర్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ శంకర్‌లక్ష్మీతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయంతో రాజశేఖర్‌ నుంచి గ్రూప్‌-1 పేపర్‌ తీసుకుని పరీక్ష రాశాడు. ఐతే ఈ వివరాలు బోర్డు సభ్యులు లింగారెడ్డికి ఏమైనా చెప్పి ఉంటాడా? లేదా ఆయనకు ఈ తతంగం గురించి ఏమైనా సమాచారం తెలిసి ఉంటుందా? అనే కోణంలో సిట్‌ విచారించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నిందితులైన ప్రవీణ్‌, రమేష్‌తో పాటు బోర్డు సభ్యులైన లింగారెడ్డి అందించే వివరాల ఆధారంగా మరికొంత మంది బోర్డు సభ్యులతో పాటు కమిషన్‌ చైర్మన్‌కు కూడా సిట్‌ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement