Tuesday, November 26, 2024

T Congress | బీజేపీకి సిట్‌, బీఆర్‌ఎస్‌కు సీబీఐ అంటే భయమెందుకు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఆర్‌ఎస్‌, బీజేపీలను బాధితులుగానే చూపిస్తున్నారని, మరి ఈ కేసులో దోషి ఎవరని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపైన సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కాంగ్రెస్‌ పార్టీ ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేయాలా..? వద్దా… అనేదానిపైన చర్చ జరుగుతోందని రేవంత్‌రెడ్డి వివరించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్‌లో మంచి పదవులు ఇచ్చారని.. ఇది కూడా కరప్షన్‌ కిందనే విస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగించినందున తాము కూడా వినతిపత్రం ఇస్తామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురిలో ముగ్గురు పార్టీ మారినవారేనని తెలిపారు. ఈ కేసును రెండు కోణాల్లో చూడాలన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలను బాధితులను చూస్తున్నారని చెప్పారు. విచారణ పద్దతి అది కాదని రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నేరం జరిగింది.. కానీ విచారణ మేమే చేస్తామనడం ద్వారా టీఆర్‌ఎస్‌ లోపం బయటపడింది. నేరమే జరగలేదు అంటూనే సీబీఐ విచారణ అడగటం ద్వారా బీజేపీ లోపం బయటపడింది. సీబీఐ విచారణ అనగానే బీజేపీ, సిట్‌ విచారణ అనగానే టీఆర్‌ఎస్‌ ఎందుకు సంకలు గుద్దుకుంటున్నారు.’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాజకీయ అవసరాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు.

చైనాను ప్రశ్నించలేని స్థితిలో మోడీ సర్కార్‌..
దేశం, రాష్ట్రం ప్రమాదంలో ఉన్నాయని, ఇలాంటి సమయంలో వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కాంగ్రెస్‌ శ్రేణులు ప్రజల కోసం పోరాడాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే మోడీ సర్కార్‌ ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ఉందని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ హెచ్చరించినా.. దేశ భద్రత కేంద్రానికి పట్టడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కుటుంబ సభ్యులకు దోచిపెట్టడానికి కేసీఆర్‌ దేశం మీద పడ్డారని ఆయన ఆరోపించారు. స్వాతంత్య్ర పూర్వపు పరిస్థితిలే ఇప్పుడు దేశంలో నెలకొన్నాయన్నారు.

- Advertisement -

బ్రిటీష్‌ విధానాలను దేశ ప్రజలపై రుద్దాలని బీజేపీ ప్రయత్నిస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశానికి పొంచి ఉన్న ముప్పు నుంచి కాపాడేందుకు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర చేస్తున్నరాని, మహాత్ముడి స్పూర్తితో ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారని రేవంత్‌రెడ్డి కొనియాడారు. రాహుల్‌ పాదయాత్ర భయంతోనే మోడీ కోవిడ్‌ రూల్స్‌ తీసుకొస్తున్నారని ఆయన విమర్శించారు.

హాత్​సేహాత్​ జోడోలో పార్టీ శ్రేణులు పాల్గొనాలి..
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురావడంలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రమాదంలో ఉన్న దేశం, రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ శ్రేణులు అంతా పాల్గొని ప్రజల పక్షాన నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, సంభాని చంద్రశేఖర్‌, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

గాంధీభవన్‌లో పీజేఆర్‌ వర్థంతి..
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పి. జనార్దన్‌రెడ్డి వర్థంతి కార్యక్రమాన్ని గాంధీభవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, టీ పీసీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, పి. విజయారెడ్డి, మెట్టు సాయికుమార్‌ తదితరులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement