Wednesday, November 20, 2024

ప్ర‌శ్నాప‌త్రాల లీక్ – గుట్టు సిట్ కు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌ నియామక పరీక్ష ప్రశ్నాపత్రం బయటకు పొక్కిన కేసులో విచారణకు సీసీఎస్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఇప్పటిదాకా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బేగంబజారు పోలీసు స్టేషన్‌ నుంచి సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలందుకున్న సిట్‌ జాయింట్‌ కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ మంగళ వారం రాత్రి టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి ఛైర్మన్‌ జనార్థన్‌రెడ్డితో సమావేశమై వివరాలు సేకరించారు. అక్కడి నుంచి నేరుగా బేగంబజార్‌ పోలీసు స్టేషన్‌కు చేరుకుని స్థానిక ఏసీపీ, సీఐతో భేటీ నిర్వహించి కేసు వివరాలు తెలుసుకున్నారు.

ప్రశ్నాపత్రం లీకేజీపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆరా తీశారు. పరీక్షల నిర్వహణ, లీకేజీ వ్యవహారానికి సంబంధించి 48గంటల్లో నివేదిక అందజేయాలని గవర్నర్‌ కార్యదర్శి టీఎస్‌పీఎస్సీకి లేఖ రాశారు. లీకేజీకి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు లీకేజీ వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేసిన 9మందికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నిందితులకు 14రోజుల రిమాండ్‌ విధించారు. నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఈ వ్యవహారంలో నిందితుల రిమాండ్‌ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), టౌన్‌ ప్లానింగ్‌, బిల్డింగ్‌ ఓవర్సీస్‌ పరీక్షా పత్రాలను కీలక నిందితుడు, టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌ తన వద్దే ఉంచుకున్నట్లు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. 24 పేజీల ఏఈ ప్రశ్నాపత్రం జిరాక్స్‌ పత్రాలు, 25పేజీల టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ ప్రశ్నాపత్రాల నకళ్లను ప్రవీణ్‌ నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పేషి నుంచి ఐపీ అడ్రస్‌, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ను ప్రవీణ్‌ వాంగ్మూలం ఇచ్చాడని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

సిస్టం అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌ సాయంతో ప్రశ్నాపత్రాలను కాపీ చేసుకుని ప్రవీణ్‌ పెన్‌ డ్రైవ్‌లో వేసుకుని రేణుక అనే మహిళకు రూ.10లక్షలకు విక్రయించినట్లు చెప్పారు. ప్రవీణ్‌సాయంతో మిగిలిన నిదింతుల ఇళ్లపై దాడులు నిర్వహించామని చెప్పారు. ఈ కేసులో ఏ3గా రేణుకను చేర్చిన పోలీసులు, ఆమెను న్యాయమూర్తి ఆదేశం మేరకు చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. నిందితులను 10రోజుల కస్టడీకి ఇవ్వాలని బేగంబజార్‌ పోలీసులు పిటీషన్‌ దాఖలు చేశారు.

దీనిపై న్యాయస్థానం నిర్ణయం ప్రకటించలేదు. కాగా ఈ నెల 12న నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ పరీక్ష ప్రశ్నాపత్రాలతోపాటు మరిన్ని పత్రాలు లీకయ్యాయన్న అంశం రాష్ట్రంలోని ఉద్యోగార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఏఈ పరీక్షా పత్రం రేణుక కారణంగానే లీకైందని పోలీసులు తేల్చారు. టౌన్‌ప్లానింగ్‌ పరీక్షతో వెటర్నరీ పేపర్లను కూడా ప్రవీణ్‌ సంపాదించాడని, ఈ పేపర్లు తన చేతిలో ఉన్నప్పటికీ ఒప్పందం కుదరకపోవడంతో వీటిని ఎవరికీ అమ్మలేదని పోలీసులు గుర్తించారు. ఇదిలాఉండగా లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌ ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కు హాజరయ్యాడని, ఇందులో ఆయనకు 103 మార్కులు వచ్చాయని పోలీసులు చెప్పారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కూడా లీక్‌ చేశాడా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ప్రవీణ్‌ ఓఎంఆర్‌ షీట్‌ను పరిశీలించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు ఆయనకు 103 మార్కులు వచ్చినట్లు గుర్తించారు. 150 ప్రశ్నలకు 103 మార్కులు సాధించినా ఈ పరీక్షలో ఆయన అర్హత పొందలేదని సమాచారం. తన హాల్‌టికెట్‌ను బబ్లింగ్‌ చేయడంలో తప్పిదం చేశాడని, అందుకే ఆయన అర్హత సాధించలేదని కమిషన్‌ అధికారులు చెబుతున్నారు. 150కిగాను 103 మార్కులు సాధించే ప్రతిభ ప్రవీణ్‌కు ఉందా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ వచ్చిన సర్వర్‌ను పరిశీలిస్తున్న సైబర్‌ నిపుణులు ఈ ప్రశ్నాపత్రం కూడా లీక్‌ జరిగిందా..? లేదా..? అని విశ్లేషిస్తున్నట్లు సమాచారం.

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌.. – టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్థన్‌రెడ్డి
లీకేజీ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్థన్‌రెడ్డి మంగళవారం కమిషన్‌ సభ్యులు, ఇతర అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రశ్నాపత్రం లీకేజీపై వస్తున్న వదంతులకు అడ్డుకట్ట వేసేందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ఏఈ పరీక్షపై బుధవారం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. నిపుణులతో సంప్రదించిన తర్వాత గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫైనల్‌ కీని విడుదల చేశామని, ఇది వడపోత పరీక్ష మాత్రమేనని అందుకే మార్కులు ఇవ్వలేదని చెప్పారు.

30లక్షల మంది అభ్యర్థులు వన్‌టైం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ఏటా నాలుగువేల ఉద్యోగాలను భర్తీ చేయగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక 35వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన చెప్పారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ జూన్‌ 5 నుంచే నిర్వహిస్తామని ఆయన చెప్పారు. టౌన్‌ ప్లానింగ్‌ పరీక్షకు ఒక రోజు ముందు తమకు కొంత సమాచారం వచ్చిందని, ప్రశ్నాపత్రం లీక్‌ అయినట్లు సంకేతాలు అందడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఇప్పటిదాకా ఈ కేసులో 9మందిని నిందితులుగా చేర్చారని చెప్పారు. ఏఈ పరీక్షపై నివేదిక ఇంకా రావాల్సి ఉందని , ప్రవీణ్‌కు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ లో 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు.

భగ్గుమన్న విద్యార్థి, యువజన సంఘాలు…
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళనలకు దిగాయి. ఉస్మానియా విశ్వ విద్యాలయం జేఏసీ మంగళవారం సాయంత్రం సచివాలయం వద్ద ఆందోళనకు దిగి లీకేజీకి బాధ్యులైన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. భారతీయ జనతా యువమోర్చా, తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం, ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు టీఎస్‌పీఎస్సీని ముట్టడించాయి. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో పెద్దల పాత్ర ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రశ్నాపత్రాలు బయటకు పొక్కిన వ్యవహారాన్ని సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రభుత్వ నిర్వాకం, టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యం వల్లే ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని ఆరోపించారు. లీకేజీ వ్యవహారంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ప్రవీణ్‌ ఫోన్‌లో మహిళల న్యూడ్‌ వీడియోలు..
ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన కేసులో పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌ మొబైల్‌ ఫోన్‌లో ఎక్కువగా మహిళల ఫోన్‌ నంబర్లు, వాట్సాప్‌ ఛాటింగుల్లో మహిళల నగ్నఫోటోలు, వీడియోలు ఉన్నట్లు గుర్తించారు.

నిరుద్యోగుల జీవితాలతో టీఎస్‌పీఎస్సీ చెలగాటం…
నిరుద్యోగ అభ్యర్థులతో టీఎస్‌పీఎస్సీ చెలగాటమాడుతోంది. ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కలలను కల్లలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుని ఆ బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి అప్పగించిన సంగతి తెలిసిందే. 30లక్షల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 5న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం బయటకు పొక్కడం, ఇప్పటిదాకా జరిగిన మిగతా ఎంపిక పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా ముందుగానే బయటకు వచ్చాయన్న ప్రచారం జరుగుతుండడంతో యువత ఆందోళనకు గురవుతోంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తోపాటు మిగతా పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా ముందే బయటకు వచ్చినట్లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం గంటకో మలుపు తిరుగుతోంది. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల భర్తీకి కమిషన్‌ నిర్వహించిన ఎంపిక పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజీతో మొదలైన కమిషన్‌ ఉద్యోగి ప్రవీణ్‌ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశ్నాపత్రం కూడా బయటకు పొక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురుకుల విద్యా సంస్థల్లో ప్రిన్సిపల్‌ ఖాళీల భర్తీకి ని ర్వహించిన ఎంపిక పరీక్షలో 5వేల మందికి పైగా అభ్యర్థులు అనర్హులైనప్పటికీ వారిచేత పరీక్ష రాయించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్‌ కమిషన్‌ ప్రధాన సర్వర్‌ నుంచి ప్రశ్నాపత్రాన్ని బయటకు తీసి అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రవేశ పరీక్షలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన 100మందికి పైగా అభ్యర్థులకు 125కు పైబడి మార్కులు వచ్చాయని, దీన్నిబట్టి చూస్తుంటే ఈ ప్రశ్నాపత్రం కూడా పరీక్షకు ముందే అభ్యర్థులకు చేరినట్లు ప్రచారం జరుగుతోంది. గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్షకు ప్రవీణ్‌ కూడా హాజరుకాగా అతనికి ఈ పరీక్షలో 103 మార్కులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

సర్వీస్‌ కమిషన్‌ ఇప్పటిదాకా నిర్వహించిన సీడీపీవో, ఏవో, డీఏవో తదితర పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు పరీక్షకు ముందే బయటకు పొక్కి ఉండవచ్చని అనుమానిస్తున్న ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఈ ఘటనలో ఎవరున్నా వారిని కఠినంగా శిక్షించాలని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ను ఆదేశించింది. దీంతో ఇప్పటిదాకా ఈ కేసు విచారణను చేపట్టిన బేగంబజార్‌ పోలీసుల నుంచి తదుపరి దర్యాప్తును సీసీఎస్‌లోని సిట్‌ విభాగానికి బదిలీ చేస్తూ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్‌ జాయింట్‌ కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్ బేగంబజార్‌ పోలీసు స్టేషన్‌కు చేరుకుని లీకేజీ వ్యవహారంపై స్థానిక ఏసీపీ, సీఐతో చర్చించారు.

గతేడాది అక్టోబరు రెండోవారంలో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు రెండున్నర లక్షల మంది హాజరుకాగా ఇందులో ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్‌ పరీక్షకు 25వేల మందిని ఎంపిక చేసింది. జూన్‌ మొదటివారంలో గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్ష నిర్వహించేందుకు కమిషన్‌ సిద్ధమవుతుండగా ప్రిలిమ్స్‌ పరీక్షా ప్రశ్నాపత్రం కూడా బయటకు వచ్చిందన్న ప్రచారం జరుగుతుండడంతో ఆ దిశగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించింది. కమిషన్‌ ఛైర్మన్‌ జనార్థన్‌రెడ్డితోపాటు పోలీసు, వైద్య, ఆరోగ్యశాఖ నియామక మండళ్ల అధికారులు, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టుల వ్రాత పరీక్షల్లోనూ అక్రమాలు…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాల్లో ప్రిన్సిపాళ్ల ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ఎంపిక పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు జూనియర్‌ లేదా డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. అయితే ఈ నిబం ధనలను పాటించకుండా అయిదువేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తుల పరిశీలనా సమయంలో ఈ అభ్యర్థులు కమిషన్‌ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌ను ఆశ్రయించి పరీక్షకు హాజరయ్యేలా అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. లెక్చరర్‌గా పనిచేసిన అనుభవ పత్రాలను నకిలీవి సృష్టించి తద్వారా ప్రిన్సిపాళ్ల వ్రాత పరీక్షకు సదరు అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు గుర్తించారు.

వివిధ ఎంపిక పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఎరవేసి వారి ద్వారా లీకేజీ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి కేంద్రంగా అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌ ప్రశ్నాపత్రం పరీక్షకు వారం, పది రోజుల ముందే బయటకు పొక్కినట్లు పోలీసులు గుర్తించారు. గురుకుల విద్యాలయాల సంస్థలో మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రేణుకతో పరిచయం చేసుకుని ఆమె ద్వారా ఒక్కో ప్రశ్నాపత్రాన్ని రూ.20లక్షలకు విక్రయించినట్లు సమాచారం. కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఈ ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేయగా వారిని ఒక రూంలో ఉంచి శిక్షణ ఇప్పించడంతోపాటు పరీక్ష రోజు ఉదయం ప్రత్యేక వాహనంలో సరూర్‌నగర్‌లో ఉన్న పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చి దిగబెట్టిందని, పరీక్ష ముగిశాక తిరిగి వారి నివాసాలకు చేర్చిందని పోలీసులు గుర్తించారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో రేణుక సోదరుడు, భర్తతోపాటు మరికొంత మంది ముఖ్యుల పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రవీణ్‌కు ప్రశ్నాపత్రం ఎలా చేరింది…?
ఏ నియామక సంస్థలో అయినా రూపొందించిన ప్రశ్నాపత్రాన్ని గోప్యంగా ఉంచడం పరిపాటి. ఇంటర్మీడియట్‌ బోర్డులో అయితే సదరు కార్యదర్శి లేదా పరీక్షల నియంత్రణాధికారి దగ్గర ప్రశ్నాపత్రానికి సంబంధించిన కోడ్‌ ఉంటుంది. ఈ ఇద్దరు అధికారులకు తెలియకుండా ప్రశ్నాపత్రం బయటకు వచ్చే అవకాశం ఉండదు. పదో తరగతి పరీక్షలు కూడా ఇలాగే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్‌ ద్వారా ఎంపిక పరీక్షలు నిర్వహిస్తుండడం, ప్రశ్నాపత్రాన్ని రూపొందించి వాటిని పరీక్ష రోజున ఆన్‌లైన్‌లో పెట్టే బాధ్యతను కమిషన్‌ ఛైర్మన్‌ జనార్థన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌ పర్యవేక్షించాలి. అయితే వీరికి తెలియకుండా కమిషన్‌ రూపొందించిన ప్రశ్నాపత్రాలు పరీక్షకు ముందే ఎలా బయటకు పొక్కాయన్న అంశంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జనార్థన్‌రెడ్డి గతంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలోనే ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకణంలో పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడి ఉత్తీర్ణులయ్యే వారిని ఫెయిల్‌ చేసి తద్వారా 25మంది ఆత్మహత్యకు కారణమయ్యారని, అదే జనార్థన్‌రెడ్డిని ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేయించి కమిషన్‌ ఛైర్మన్‌గా నియమించారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అనితా రామచంద్రన్‌ను రాత్రికి రాత్రే విధుల నుంచి తప్పించిన ప్రభుత్వం తిరిగి కీలకమైన టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిగా నియమించిందని, విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందుకే ఆమెను కలెక్టర్‌ పదవి నుంచి తప్పించి మరొక మహిళా అధికారిని నియమించారన్న విషయం అప్పట్లో ప్రచారం జరిగిందని చెబుతున్నారు.

అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌ ప్రశ్నాపత్రంతోపాటు టౌన్‌ప్లానింగ్‌, బిల్డింగ్‌ ఓవర్సీస్‌ ప్రశ్నాపత్రాన్ని కూడా సర్వర్‌ నుంచి తస్కరించి వాటిని కూడా విక్రయించేందుకు ప్రవీణ్‌ ప్రయత్నించాడని, అయితే అభ్యర్థులు భయపడి ఈ ప్రశ్నాపత్రాలను తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో వాటిని అలాగే వదిలేశాడని పోలీసులు గుర్తించారు. ఈ ప్రశ్నాపత్రాల జిరాక్స్‌ పత్రాలను బేగంబజార్‌ పోలీసులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement