ఆంధ్రప్రభ, సిరిసిల్ల: బతుకమ్మ చీరల ఆర్డర్ రాకపోవడం… మరో వైపు పోలిస్టర్, పెట్టికోట్ తదితర వస్త్ర ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో సిరిసిర వస్త్ర పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో పడింది. దీంతో చేనేత కార్మికులకు ఉపాధి కరువైంది. రాష్ట్రంలో ఎన్నికలు రావడంతో బతుకమ్మ చీరలు నిలిచిపోయాయి. కొత్త ఉత్పత్తులకు ఆర్డర్లు లభించకపోవడంతో పవర్లూమ్ పరిశ్రమ మూతపడింది. అలాగే ప్రభుత్వం ఉపాధి కల్పించకపోవడం, అలాగే ఆర్డర్లు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మరమగ్గాల పరిశ్రమలు మూత పడుతున్నాయి. సిరిసిల్లలో 30 వేల మరమగ్గాలు ఉన్నాయి. కార్మికులకు పని లేక, విద్యుత్ సబ్సిడీ కోల్పోయి, విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మరమగ్గాలు స్క్రాప్ కింద విక్రయిస్తున్నారు.
ఉపాధికి దూరం..
సిరిసిల్లలో ఉన్న పదివేల మరమగ్గాలకు ఉత్పత్తుల ఆర్డర్లు లేవు. నిరంతరం ఉపాధి కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పిన పాలకులు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. బతుకమ్మ చీరల పెండింగ్ బకాయిలు రూ.150 కోట్ల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులు సొసైటీ సభ్యులైన ఆసాముల(పెట్టుబడి పెట్టినవారు)కు ఇచ్చారు. ఎవరికి ఎంత మేరకు బకాయలు అందాయో లెక్కలు తేలడం లేదు. ఉత్పత్తులు సాగిస్తామంటే ముడి సరుకులు ఇచ్చే యజమానులు ముందుకు రావడం లేదు. ఉత్పత్తులకు తగిన మార్కెట్ లేకపోవడంతో యజమానులు ముందుకు రావడం లేదని కార్మికులు చెబుతున్నారు.
యజమానులకు, ఆసాములకు పెరుగుతున్న దూరం
గతంలో బతుకమ్మ చీరల పేమెంట్లు నేరుగా యజమానులకు అందేవి. వాటి నుంచి 50 శాతం ఆసాములకు చేరేవి. ఈ క్రమంలో యజమాని నుండి ముడి సరుకులు ఆసాములకు అంది, వారు ఉత్పత్తులు సాగిస్తే మరమగ్గాలపై కార్మికులకు ఉపాధి దొరికేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ బకాయిలు ప్రస్తుతం నేరుగా ఆసాములకు అందడంతో యజమానులకు, ఆసాముల మధ్య దూరం పెరిగింది. దాని ప్రభావం వస్త్ర పరిశ్రమలపై పడింది. మరమగ్గాలకు ఉపాధి లేకుండా పోయింది. దీనితో మరమగ్గాలు మూలనపడ్డాయి. వీటిని స్క్రాప్ కింద అమ్ముకునే పరిస్థితి నెలకొంది. పట్టణంలో పాత సామాను కింద మరమగ్గాలని తరలిస్తున్న గూడ్స్ వాహనాలు పట్టణవాసులకు నిత్యం దర్శనమిస్తున్నాయి.
విద్యుత్ సమస్య కూడా కారణమే..
ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల కింద నడిచే మర మగ్గాలకు అందిస్తున్న విద్యుత్ సబ్సిడీ కోర్టు ఉత్తర్వుల కారణంగా నిలిచిపోయింది. ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల కింద నడిచే విద్యుత్ మీటర్లను మూడవ కేటగిరీకి మార్చడంతో విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమల మూతపడడానికి ఇదో ప్రధాన కారణమైంది. కుటీర పరిశ్రమల కింద 5 హెచ్‌పీ ల విద్యుత్‌ను వాడుకోవాలన్న నిబంధన ఉన్నప్పటికీ, పరిశ్రమలు విస్తృతం కావడంతో అధిక మీటర్లు తీసుకొని పరిశ్రమలు నడుపుతున్నారు. నిబంధన ప్రకారం రెండు మీటర్లు అంతకంటే ఎక్కువ మీటర్లు ఉన్న కార్ఖానాలకు మూడవ కేటగిరీ కింద విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తుంది.
సంక్షోభం పరిస్థితులు…
గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పెండింగ్ బకాయిలు చెల్లించలేదు. బతుకమ్మ చీరల ఉత్పత్తుల ఆర్డర్లు పూర్తి చేయడం, కొత్త ఆర్డర్లు, కొత్త ప్రణాళిక రాకముందే అసెంబ్లీ ఎన్నికలు రావడం, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం, పెండింగ్ బిల్లులు నిలిచిపోవడంతో పరిశ్రమ ఆర్థిక సంక్షోభానికి గురైన విషయం తెలిసిందే. సుమారు రూ. 350 కోట్లకు పైగా బతుకమ్మ చీరల బకాయిలు ఉన్నాయి. నిరంతర ఉపాధి కల్పిస్తామని పాలకులు ప్రకటిస్తూ వచ్చారు. ఎట్టకేలకు రూ. 150 కోట్ల మేర బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. మరోవైపు నేతన్నలను తమ వైపు మళ్లించుకోవాలని అధికార పార్టీ తాపత్రయ పడుతూనే రూ.150 కోట్ల మేర రెండు విడుతల్లో బకాయిలు చెల్లించింది. నేతన్నలు తమ వైపు వస్తారని ఆశపడింది. అయితే దీనికి భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకున్నప్పటికీ తదుపరి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం నేతన్నల ఓట్ల మద్దతు అధికార పార్టీకి లభించలేదు. ఇటీవల జరిగిన సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో సైతం బీఆర్‌ఎస్ ప్యానల్ గెలిచి, అధికార పార్టీకి మద్దతు లభించలేదు. ఈ నేపథ్యంలో మిగిలిన పాత బకాయిల చెల్లింపు కోసం, వస్త్ర పరిశ్రమల ఉపాధి కోసం పాలకుల వద్దకు స్థానిక నాయకత్వాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.