నిన్న (ఆదివారం) అర్ధరాత్రి.. దాదాపు సమయం 12-00 గంటలు దాటే ఉంటుంది. సాధారణంగా అందరు బెడ్ మీదకు చేరుకునే టైమ్.. అట్లాంటి టైమ్‌లో ఉన్నట్టుండి ఓ పోలీసాఫీర్‌కి ఫోన్ కాల్ వచ్చింది.. అదేమిటంటే.. ‘‘సార్.. మా పిల్లి బావిలో పడిపోయింది. మీరే కాపాడాలే” అని ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు.. దీంతో ఆ పోలీసు ఆఫీసర్ ఏంచేశాడంటే..
పొద్దంతా పలు రకాల పని ఒత్తిళ్లతో గడిపిన పోలీసులు, రాత్రి వేళ రెస్ట్ తీసుకుందామనే సమయానికి వారికి బిగ్ టాస్క్ వచ్చింది. అయితే ఇది సాధారణ ఫోన్ కాల్ అనుకుని ఈజీగా తీసుకుంటే.. ప్రజల ఆగ్రహానికి గురికావడం తప్పదనుకున్నారు ఆ పోలీసు ఆఫీసర్. ఫోన్ చేసిన వ్యక్తిపై అసహనం చెందకుండా వెంటనే స్పందించారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ. తమ పరిధిలో ఉండే టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావుకు ఫోన్ చేసి, కాలర్ తో అత్యవసరంగా మాట్లాడాలని తెలిపారు. బావిలో పడిపోయిన పిల్లిని రెస్క్యూ చేసి కాపాడాలని ఆదేశించారు.
అంతేకాకుండా వాట్సాప్ లో వారి లొకేషన్, కాంటాక్ట్ నెంబర్ కూడా కరీంనగర్ టౌన్ ఏసీపీకి షేర్ చేయడంతో టాస్క్ మరింత ఈజీ అయ్యింది. దీంతో టౌన్ ఏసీపీ ఆ ఏరియాలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అంజిరెడ్డి, ఇతర సిబ్బందిని రెస్క్యూ టీమ్‌గా ఏర్పాటు చేసి, యమ అర్జంటుగా ఆ స్థలానికి వెళ్లి పిల్లిని కాపాడే ప్రయత్నం ప్రారంబించారు.
అక్కడికి చేరుకున్న పోలీస్ రెస్క్యూ టీం హెడ్ కానిస్టేబుల్ అంజిరెడ్డి , సిబ్బంది బావిలోకి ఒక బుట్టను తాడు సహాయంతో పంపించి, ఆ బుట్టలో పిల్లి కూర్చునేలా ప్రయత్నించారు. పిల్లి బుట్టలో కూర్చున్న తర్వాత దాన్ని సురక్షితంగా పైకి లాగి ప్రాణాలతో కాపాడారు. అప్పుడు సమయం దాదాపు అర్ధరాత్రి 12:30 నుంచి 12:45 అవుతోంది అనుకుంటా. ఇక రెస్క్యూ ఆపరేషన్ ముగియడంతో పోలీసులు సంతోషంతో పిల్లిని యజమానికి అప్పగించారు. ఆ పిల్లి యజమాని సంతోషంతో పోలీసు లకు, ఫోన్ కాల్‌తో వెంటనే రెస్పాడ్ అయిన సీపీ సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… ఆపదలో ఉన్న సమయంలో ప్రజలు అర్ధరాత్రి అయినా, మరే సమయంలో అయినా తనకు ఫోన్ చేయొచ్చన్నారు. డయల్@100 నంబర్ కి కాల్ చేస్తే పోలీసులు ఎవరైనా స్పందిస్తారన్నారు. ఎల్లవేళలా పోలీసులు ప్రజల సంరక్షణ కోసం ఉన్నారని తెలిపారు.