Friday, November 22, 2024

మొగుల‌య్య‌కి ప‌ద్శశ్రీ – ఎన్ని క‌ష్టాలు ప‌డ్డారో తెలుసా

అదృష్టం ఎప్పుడు వ‌రిస్తుందో ఎవ‌రికి తెలియ‌దు. అదృష్టం వ‌రించాలే కానీ సామాన్యుడిని సెల‌బ్రిటీగా మార్చేస్తుంద‌న‌డానికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. సెల‌బ్రిటీగా మారేందుకు వ‌య‌సుతో సంబంధ‌మే లేదు. ఇప్పుడు అలాంటి ఉదాహ‌ర‌ణే మ‌రోసారి నిరూపిత‌మ‌యింది. ఉండేందుకు ఇల్లు లేదు..తినేందుకు తిండిలేద‌న్న రీతిలో ఆయ‌న జీవితం గ‌డిచింది. రెండేళ్ల క్రితం భార్య శంకరమ్మఅనారోగ్యంతో చనిపోతే.. ఆమె దహన సంస్కారాలకు అవసరమైన డబ్బులు లేని పరిస్థితి. తీవ్ర ఇబ్బందుల నడుమ దహన సంస్కారాల్ని పూర్తి చేశాడు. రెండో కొడుకు ఆరోగ్యం సరిగా లేకపోవటంతో ఇంటికే పరిమితయ్యాడు. కిన్నెర వాయిద్య కళలో అతని నేర్పునకు చాలా ఆలస్యంగా గుర్తింపు లభించింది. ఆయ‌నే మొగుల‌య్య‌.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తోన్న చిత్రం భీమ్లా నాయ‌క్ లో పాట పాడే అవ‌కాశం వ‌చ్చింది. దాంతో అంద‌రికి మొగుల‌య్య ప‌రిచ‌యం అయ్యాడు మొద‌టిసారి. ఆయనకు ఇప్పుడు 68 ఏళ్లు. ఇన్నాళ్లు ఆయన జీవితంలో కష్టపడిందే తప్పించి సుఖపడింది లేదు. ఆయన ఉండేది హైదరాబాద్ లోని సైదాబాద్ కు సమీపంలోని సింగరేణి కాలనీలోని గుడిసెల్లోని ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు. సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం ఆవుసలకుంట. వారి తాత ముత్తాతల నుంచి వంశపార్యంపరంగా కొనసాగిస్తున్న 12 మెట్ల కిన్నెరవాయిద్య కళనే మొగులయ్య నమ్మకున్నాడు. ఆయనకు ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు కిన్నెర సాధన మొదలు పెట్టాడు. ఊరూరా ప్రదర్శనలు ఇస్తూ.. కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఎనిమిదేళ్ల క్రితం జీవనం కోసం హైదరాబాద్ కు వచ్చాడు. అయినా అతడి కష్టాలు తీరలేదు.

కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దమడూరుకు చెందిన డాక్టర్ రంగయ్య పీహెచ్ డీ కోర్సులో భాగంగా మొగులయ్యయ జీవిత చరిత్రను పబ్లిష్ చేశారు. దీంతో.. అతడి గురించి తొలిసారి బయట ప్రపంచానికి తెలిసింది. మొగులయ్యను ప్రభుత్వం గుర్తించి ఉగాది పురస్కారం అందజేసింది. అంతేకాదు.. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో మొగులయ్య జీవితాన్ని పాఠంగా పెట్టారు. అలా బయటకు వచ్చిన ఆయన జీవితకథ.. పవన్ కల్యాణ్ కళ్లల్లో పడటంతో అతడి దశ.. దిశ మొత్తంగా మారిపోయింది. పద్మశ్రీ పురస్కారం కూడా మొగుల‌య్య‌ని వ‌రించింది. ఈ అవార్డు త‌న‌కు వచ్చిందన్న విషయం తెలిసినంతనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. కిన్నెర వాయిద్యాలను తయారు చేసి కళాకారుల్ని తయారు చేస్తానని చెప్పాడే కానీ.. సరైన ఇంట్లోకి మారతానని మాత్రం మాట వరుసకు చెప్పక పోవటం ఆయ‌న నిరాడంబ‌ర జీవితానికి నిద‌ర్శ‌న‌మనే చెప్పాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement