Tuesday, November 19, 2024

Bandi Sanjay: సింగరేణి ప్రైవేటీకరణ అసాధ్యం.. అదంతా టీఆర్ఎస్ దుష్ప్రచారమే

ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకో అబద్దం… రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తన జిత్తుల మారి ఎత్తులతో రైతులను, విద్యార్థులను, కార్మికులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులను నట్టేట ముంచిన కేసీఆర్ తాను చేసిన తప్పిదాలను కేంద్రంపై మోపి బీజేపీ బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో కొంగు బంగారం…. నల్లబంగారానికి నెలవైన సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందంటూ విష ప్రచారానికి తెరదీస్తూ సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సింగరేణి ఎన్నికలు వస్తుండటంతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఆడే అబద్దాలకు అంతూపొంతు లేకుండా పోయిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించాలనే ప్రచారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకునే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశానని తెలిపారు. తన లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సింగరేణి విషయంలో స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు. సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోం, అది అసాధ్యం కూడా అని కేంద్రమంత్రి తేల్చారని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థలో అత్యధికంగా 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే అని, కేంద్ర వాటా 49 శాతం మాత్రమే అని తెలిపారు. 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడం అసాధ్యం అని ఆ మాటే ఉత్పన్నం కాదని తేల్చేశారు.

కోల్ బ్లాక్ వేలం విషయానికి వచ్చినప్పుడు మైన్స్ అండ్ మినరల్ డెవలప్ మెంట్ రెగ్యులేషన్ యాక్ట్-2015 ప్రకారం పారదర్శకంగా వేలం వేయాలని చట్టం చేశారని బండి సంజయ్ తెలిపారు. ఈ చట్టం ప్రకారం…. యాక్షన్ వేలం ద్వారా, అలైన్ మెంట్ ద్వారా కేటాయించాలనే నిబంధన ఉందని తెలిపారు. ఈ పద్దతి ప్రకారం రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే 2020లో కమర్షియల్ మైనింగ్ అనే అంశాన్ని చట్టంలో చేర్చడంవల్ల నాటి నుండి వేలం ద్వారా మాత్రమే బొగ్గు బ్లాకులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణి ప్రాంతానికి చెందిన 4 బ్లాకులను వేలం వేస్తే ఎవరూ బిడ్లు వేయలేదని స్పష్టం చేశారు. ఈ బ్లాకుల కోసం దరఖాస్తు చేసుకుంటే వేలం ద్వారా సింగరేణి సంస్థ పొందవచ్చు అని అన్నారు. ఇప్పటికే సింగరేణి 3 బ్లాకులను ఈ చట్టం ద్వారా పొందిందన్న బండి… అందులో ఒడిశా రాష్ట్రంలోని నైనికోల్ బ్లాక్, పెనగడప-తెలంగాణ, నూ పాత్రపర-ఒడిశాను సింగరేణి తీసుకుందని కూడా కేంద్ర మంత్రి తెలిపారని వివరించారు. సింగరేణిని ప్రైవేటీకరించబోతున్నారని చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. సింగరేణికి చెందిన ప్రస్తుతమున్న బొగ్గు గనుల నిక్షేపాలు మరో 100 సంవత్సరాల పైచిలుకు ఉంటాయని అన్నారు. బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నేతలు ఈ వాస్తవాలను అర్ధం చేసుకోవాలని, ఇకనైనా కళ్లు తెరుచుకుని వాస్తవాలు మాట్లాడాలని బండి సంజయ్ హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement