Saturday, November 23, 2024

సింగరేణిలో ఎన్నికల వేడి!

తెలంగాణలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు హుజురాబాద్ ఉపఎన్నిక, మరోవైపు సింగరేణి ఎన్నికలు. సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల వేడి అంతకంతకు రాజుకుంటోంది. ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. దీంతో ఎన్నికల్లో గెలుపుకోసం అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ఈ ఏడాది ఏప్రిల్‌ 16 నాటికి ముగిసిపోయింది. గత ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) విజయం సాధించింది. కాలపరిమితి ముగిసిన వెంటనే గుర్తింపు సంఘం తప్పుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కరోనా ఉద్ధతి కారణంగా ఎన్నికలు వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వైరస్ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో సింగరేణిలో ఎన్నికల సైరన్ మోగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలకు సుముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో దళిత బంధు లాంటి పథకంతోపాటు ఇప్పటికే భారీ వరాలు ప్రకటించిన ప్రభుత్వం.. సింగరేణి ఎన్నికలోనూ ఇలాంటి సుత్రాన్ని ఫాలో అవుతోంది. తెలంగాణ‌తో పాటు ద‌క్షిణ భార‌త దేశానికి వెలుగులు నింపుతున్న సింగ‌రేణిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఎంతో కాలంగా వాయిదా ప‌డ్డ సింగ‌రేణి ఎన్నిక‌ల కోసం ఓవైపు టీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతూనే ఉంది. గ‌తంలో కేసీఆర్ సింగ‌రేణి కార్మికుల‌కు అనేక హామీలిచ్చారు. అయితే, ఆ హామీలు అమలుపై కార్మికుల్లో అసంతృప్తి ఉంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సింగ‌రేణి కార్మికుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును 61 సంవ‌త్స‌రాల‌కు పెంచాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కొందరు ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు కార్మికుల పదవీ విరమణ వయసు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43, 899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనున్నది. అంతేకాదు సింగ‌రేణి కోసం మెడిక‌ల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘాన్ని టీఆర్ఎస్ కు అనుబంధంగా మొద‌లుపెట్టి… అధికారిక సంఘంగా గుర్తింపు పొంద‌టంలో శ్ర‌మించిన కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య ఆ మ‌ధ్య సంఘానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అసంపూర్తిగానే మిగిలిన నేపథ్యంలో రిటైర్మెంట్ వయసు పెంచుతూ తాజాగా తీసుకున్న నిర్ణయం కార్మికుల్ని మెప్పిస్తుందని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తింపు సంఘం ఎన్నికల వెళ కేసీఆర్ నిర్ణయాలు కీలకంగా మారాయి. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కర్మిక సంఘం గెలుపు కోసం ఆ సంస్థ గౌరవ అధ్యక్షురాలైన ఎమ్మెల్సీ కవిత వ్యూహాలకు పదునుపెడుతుండగా.. కాంగ్రెస్ అనుబంధ సింగరేణి బొగ్గుగని లేబర్ యూనియన్(ఐఎన్టీయూసీ) తరఫున ఎమ్మెల్యే సీతక్కను బరిలోకి దించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో  సింగరేణిలో ఎన్నికల రాజకీయ వేడి రగులుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement