Friday, November 22, 2024

కిష‌న్ రెడ్డి వ‌న్నీఅబ్ద‌ద్దాలే…8 ఏళ్ల‌లో సింగ‌రేణి అద్భుత ప్ర‌గ‌తి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆర్థిక పరిపుష్టితో ఉన్న సింగరేణి అప్పుల పాలైందని వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని సింగరేణి యజమాన్యం తీవ్రంగా ఖండించింది. బొగ్గు ఉత్పత్తి, సంక్షేమంతో పాటు థర్మల్‌ విద్యుత్‌, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలోనూ అద్భుత ప్రగతిని సాధిస్తోందని, సంస్థకున్న పేరు ప్రతిష్టలను కించపరుస్తూ అవాస్తవమైన ఆరోపణ లు చేయడం సరికాదని యజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొన్నది. సింగరేణి టర్నోవర్‌ రూ.32 వేల కోట్లు ఉందని, ప్రతి ఏటా రూ.750 కోట్లకు వడ్డీ రాబడులతో సంస్థ ఎంతో ఆర్థికంగా ఉందని తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఒడిశాతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో సంస్థ విస్తరి స్తోంది. వివిధ బ్యాంకులు, ఎల్‌ఐసీలో డిపాజిట్ల ద్వారా రూ.11,665 కోట్ల సొమ్మును కలిగి ఉంది. వీటి ద్వారా కంపెనీకి ఏడాదికి సుమారుగా రూ.750 కోట్ల వడ్డీ వస్తోంది. వీటితో పాటు వినియోగాదారుల నుంచి రావాల్సిన బకాయిలు రూ.15,500 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ విధంగా మొత్తం రూ.27 వేల కోట్ల పరిపుష్టితో సింగరేణి సంస్థ ఉంది. రూ.12 వేల కోట్లకు పైగా అప్పులున్నాయని దుష్పచారం చేయడం అత్యంత బాధకరం.

దేశంలో ఏ సంస్థ చేయని విధంగా సింగరేణి ఆర్థిక పునాదులను బలంగా వేసుకున్నది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలతో పాటు సోలార్‌ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసుకున్నది. సోలార్‌ ప్లాంట్ల కోసం చేసిన రూ.472 కోట్ల అప్పులను ఇప్పటికే తీర్చివేయగా.. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కోసం చేసిన అప్పులో రూ.5,300 కోట్లకు గాను ఇంకా రూ.2,800 కోట్లు మాత్రమే చెల్లించవలిసి ఉంది. అంటే సింగరేణికి కేవలం రూ.2,800 కోట్లు మాత్రమే. జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది’ అని సింగరేణి సంస్థ పేర్కొన్నది.
రాష్ట్ర విభజన తర్వాత సంస్థ ఎంతో ప్రగతి సాధించిందని వివరించారు. 2013-14 నుంచి 2022-23 నాటికి ఆర్థికంగా మరింత బలపడిందని యజమాన్యం తెలిపింది. బాండ్లు, పెట్టుబడుల రూపంలో కంపెనీకి రూ.11,665 కోట్లు, సింగరేణి పెట్టుబడులకు వస్తున్న వడ్డీ రూ.750 కోట్లు. 273శాతం వృద్ధితో రూ.32,830 కోట్ల టర్నోవర్‌. లాభాలు 459 కోట్ల నుంచి 500శాతం వృద్ధితో రూ.2,300 కోట్లకు చేరింది. కార్మికుల సగటు వేతనం 234శాతం వృద్ధితో రూ.1.40 లక్షలు. లాభాల బోనసును 30శాతానికి పెంపు. సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుతో రూ.150 కోట్ల వరకు ఆదా. సింగరేణి థర్మల్‌ ప్లాంట్‌తో ఏటా రూ.500 కోట్ల లాభాలు’ ఉన్నాయని సింగరేణి యజమాన్యం తెలిపింది. సంస్థపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement