Tuesday, November 26, 2024

క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌.. అశ్విని – సిక్కిరెడ్డి, సాత్విక్ – చిరాగ్‌ జోడీ పరాజయం

స్పెయిన్‌: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పావి చొచువాంగ్‌పై సింధు ప్రిక్వార్టర్స్‌లో వరుస సెట్లలో గెలిచిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సింధు ప్రపంచ 10వ సీడ్‌ చొచువాంగ్‌పై ప్రపంచ ఏడో నెంబర్‌ సింధు 21-14, 21-18 తేడాతో గెలిచింది. 48నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు థాయ్‌ ప్రత్యర్థిపై పైచేయి సాధించి విజేతగా నిలిచింది. సింధు ప్రారంభంలో 5-1తేడాతో ఆధిక్యం సాధించినా అనంతరం చొచువాంగ్‌ 5-4 ఆ తర్వాత 10-9తో తగ్గించింది. ఈక్రమంలో తొలి సెట్‌ను 21-14తో గెలుచుకున్న సింధు ముందుకు దూసుకుపోయింది.

రెండో సెట్‌లో చొచువాంగ్‌ 20-18తో ప్రతిఘటించినా సింధు విజయాన్ని నిలువరించలేకపోయింది. ఈ విజయంతో మెగాటోర్నీలో ఆరోసీడ్‌గా ఉన్న సింధు చొచువాంగ్‌పై తన రికార్డును 5-3తో మెరుగు పరుచుకుంది. అదేవిధంగా ఈ నెల ఆరంభంలో బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ గ్రూప్‌ మ్యాచ్‌, మార్చిలో జరిగిన ఆల్‌ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఎదురైన పరాభవానికి సింధు బదులు తీర్చుకుంది. కాగా తొలి రౌండులో బై పొందిన సింధు మంగళవారం రెండోరౌండులో స్లేవేకియాకు చెందిన మార్టినా రెపిస్కాపై వరుస సెట్లలో విజయం సాధించింది.

క్వార్టర్‌ ఫైనల్లో డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత సింధు ప్రపంచ టాప్‌సీడ్‌, చైనీస్‌ తైపీకి చెందిన తైజు యింగ్‌తో తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో 12వ సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ అన్‌సీడెడ్‌ చైనా షట్లర్‌ జాంగ్‌ జు లుపై 21-10,21-15తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అయితే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో భారత పురుషుల డబుల్స్‌, మహిళల డబుల్స్‌ జోడీ ఓటమి పాలయ్యారు. మహిళల డబుల్స్‌ జోడీ అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి 13-21, 15-21తేడాతో థాయో జోడీ చేతిలో ఓటమిపాలవగా, పురుషుల డబుల్స్‌ జోడీ సాతిక్‌-చిరాగ్‌ జోడీ మలేషియా దయం ఆంగ్‌ యూ-టియో చేతిలో 20-22, 21-18, 15-21 తేడాతో ఓటమిపాలయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement