యాదాద్రి ప్రతినిధి, (ప్రభన్యూస్) : తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు హాస్పిటల్స్పై కలెక్టర్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. రెండు ఆస్పత్రులపై కంప్లెయింట్స్ రావడంతో వాటిని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న సాయితేజ నర్సింగ్ హోమ్, తేజస్విని హాస్పిటల్, సాయి తేజ డయాగ్నొస్టిక్ సెంటర్లపై ఫిర్యాదులు అందాయి. కాగా, ఈ పిర్యాదు ఆధారంగా వివరణ కోరుతూ సాయి తేజ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ డయాగ్నొస్టిక్ సెంటర్ సీజ్ చేయాలని కలెక్టర్ పమేల సత్పతి ఆదేశాలు జారీ చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు మంగళవారం రాత్రి తెలిపారు.
గత ఏడాది జులై 7న జాయింట్ డైరెక్టర్ మెటర్నటీ హెల్త్ టీం యాదాద్రి భువనగిరి జిల్లా హాస్పిటల్ ను సందర్శించి విచారణ రిపోర్ట్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కు నివేదిక అందజేసిన్నట్లు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ కి వచ్చే గర్భిణులను, జిల్లా ఆస్పత్రిలో డాక్టర్లను, సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి సాయితేజ నర్సింగ్ హోమ్, తేజస్విని హాస్పిటల్, తేజ డయాగ్నొస్టిక్ సెంటర్ లో రక్త పరీక్షలు, అవసరమైన సిజేరియన్ చేయిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి.
ఈ ఫిర్యాదులపై సాయి తేజ నర్సింగ్ హోమ్, తేజస్విని హాస్పిటల్, సాయి తేజ డయాగ్నొస్టిక్ సెంటర్ లపై తెలంగాణ అల్లోపతి ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ యాక్ట్ ప్రకారం సీజ్ చేసినట్లు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సెంటర్లను ఎలాంటి వైద్య సేవలు ఇతర కార్యక్రమాలు చేపట్టరాదని, చేపట్టినచో తీవ్రమైన క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. వాటిని జిల్లా వైద్య శాఖ అధికారులు మంగళవారం రాత్రి సీజ్ చేశారు.