సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లకు నమస్కరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆదివారం నాడు సీఎం కేసీఆర్ ఈ రెండు జిల్లాల కలెక్టరేట్ భవనాలను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్లను తీసుకెళ్లి వారి ఛాంబర్‌లోని సీట్లలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. అలాగే, కామారెడ్డిలోనూ కలెక్టర్ శరత్ ఇలానే కేసీఆర్ కాళ్లకు నమస్కరించారు.
సీఎం కేసీఆర్ కాళ్లకు కలెక్టర్లు పాదాభివందనం చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి స్పందించారు. శుభకార్యం వేళ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం తెలంగాణ సంప్రదాయమని, దీనికి తోడు ఆదివారం ఫాదర్స్ డే కూడా కావడంతో కేసీఆర్‌ను తండ్రిలా భావించి ఆశీస్సులు తీసుకున్నట్టు చెప్పారు.