న్యూఢిల్లి కర్నాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పీఠంపై గత నాలుగు రోజులుగా కొనసాగతున్న ఉత్కంఠకు తెరపడింది.. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరు ఖరారు కాగా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది.. మే 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులో వారి ప్రమాణ స్వీకారం జరగనుంది. కాగా,నేటి సాయంత్రం బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈ ఇద్దరిని ముఖ్యమంత్రి, ఉప మఖ్యమంత్రిగా ఎన్నుకోనున్నారు..
ఇది ఇలా ఉంటేమాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యనే కర్ణాటక నూతన ముఖ్యమంత్రి అని ప్రకటించిన వెంటనే ఆయన నివాసం బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఆయన మద్దతుదారులలో కూడా ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తోంది. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో సిద్ధరామయ్య పోస్టర్లు, బ్యానర్లు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య మద్దతుదారులంతా సంబురాలు చేసుకుంటున్నారు. టపాసులు పేలుస్తూ.. మిఠాయిలు తినిపించుకుంటూ, సిద్ధరామయ్య బ్యానర్లకు పాలాభిషేకం చేస్తున్నారు.
కాగా, సీఎం పదవి విషయంలో అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తగ్గేదేలే అన్నట్లు పంతంపట్టారు. గత మూడు రోజులుగా హస్తినలో వరుస భేటీలు, చర్చలు జరుగుతున్నా సందిగ్ధత వీడలేదు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇప్పటికే పలుదఫాలు సిద్ధరామయ్య, శివకుమార్‌తో భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా సేకరించి సీఎం పదవి పీటముడిని విప్పేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ సమస్య కొలిక్కిరాలేదు. మధ్యే మార్గంలో డిప్యూటీ ముఖ్యమంత్రి, కీలక కేబినెట్ పోర్టుపోలియోల వంటి ప్రతిపాదనలు శివకుమార్ ముందుంచినా ఆయన ససేమిరా అనడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూనే, ముఖ్యమంత్రి పీఠం విషయంలో మెట్టు లేదు డికె. మరోవైపు మాజీ అధినేత్రి సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పార్టీ ముఖ్యనేతలు కేసీ వేణుగోపాల్, సూర్జేవాలా సైతం ఈ వ్యవహారంపై తలలు పట్టుకున్నారు. చివరకు చెరొక రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగేలా అధికార పంపిణీ ప్రతిపాదన కూడా అగ్రనేతలు వీరిముందు ఉంచారు. ఒకదశలో ఈ ఫార్ములాకు డీకే శివకుమార్ అంగీకరించారని, అయితే, మొదటి రెండున్నరేళ్లు తానంటే తానే ముఖ్యమంత్రిగా ఉంటామని ఇద్దరు మొండికేయడంతో సమస్య మళ్లి మొదటికొచ్చింది. రాహుల్, ఖర్గేతో దాదాపు రెండు గంటలపాటు డీకే చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయనకు రెండు ఆఫర్లు ఇచ్చారు. మొదటి ప్రతిపాదనలో భాగంగా, డిప్యూటీ సీఎం పదవితోపాటు పీసీసీ చీఫ్‌గా కొనసాగింపు, ఆయన వర్గానికి ఆరు కీలక మంత్రివర్గ పదవులు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. డికె అన్నింటికీ ససేమిరా అనడంతో పంచాయితీ సోనియా గాంధీకి చేరింది.. గత రాత్రి డికెతో రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్ లు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.. భవిష్యత్ పై రాహుల్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు సోనియా గాంధీతో కూడా అయనకు చెప్పించారు.. దీంతో మెత్తబడిన డికె ఉప ముఖ్యమంత్రి పదవితో రాజీ పడ్డారు..కీలకమైన శాఖలతో పాటు ఆయన వర్గానికి చెందిన వారికి మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇస్తామని ఇటు సిద్ద రామయ్య, అటు రాహుల్ గాంథీ లు శివకుమార్ కు చెప్పడంతో కర్నాటకు ముఖ్యమంత్రి పీఠం ఎపిసోడ్ కు తెరపడింది..