సాధారణంగా ఏదైనా నేరాల్లో మహిళలను అరెస్ట్ చేసినా ..విచారణ చేసినా మహిళా అధికారులు ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో దారుణం జరిగింది. ఓ ఎస్ఐ మహిళని గదిలోకి లాక్కెళ్లి కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాన్పూర్ నగర పరిధిలోని కక్వాన్ ప్రాంతంలో పోలీసు చేష్టలకు సంబంధించిన వీడియోను సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఓ మహిళను ఎస్ఐ ర్యాంక్ అధికారి గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టారు. బయటికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమె రెండు చేతులు వెనక్కివిరిచి పట్టుకోవడం కనిపించింది. వదిలేయాలని ఆమె అరుస్తుండగా.. బయట ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీశారు.
తలుపులు ఎందుకు మూసివేశారు.. ఆమెను ఏం చేస్తున్నారు.. మహిళను విడిచి పెట్టండి?.. అంటూ అరవడం వినిపించింది. సదరు పోలీస్ అధికారి మాత్రం వీడియో తీసుకున్నా.. మహిళను విడిచిపెట్టేది లేదని చెప్పారు. మహిళను పోలీసులు ఎందుకు నిర్బంధించారో తెలియాల్సి ఉంది. అయితే, ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాజ్‌వాదీ పార్టీ.. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడింది. ఇది కాన్పూర్ పోలీసుల అవమానకరమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి రోజు పౌరులపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్న వీడియోలు వెలువడుతున్నా, ముఖ్యమంత్రి యోగి మాత్రం మౌనంగా ఉన్నారని విమర్శించారు. సదరు పోలీసుపై చర్యలు తీసుకోవాలని సమాజ్ వాదీపార్టీ డిమాండ్ చేసింది.