Friday, November 22, 2024

నాని శ్యామ్ సింగ‌రాయ్ గా అల‌రించాడా – రివ్యూ మీకోసం

ఏపీలో థియేట‌ర్స్, టిక్కెట్స్ రేట్ల‌పై ర‌చ్చ న‌డుస్తుంది. నిన్న హీరో నాని ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ ఆయ‌న బాధ‌ని వెళ్ల గ‌క్కారు. కాగా నేడు నాని న‌టించిన చిత్రం శ్యామ్ సింగ‌రాయ్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో నాని రెండు పాత్ర‌ల‌ని పోషించారు. ఆయ‌న స‌ర‌స‌న హీరోయిన్ సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి న‌టించారు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.. శ్యామ్ సింగ‌రాయ్ పేరే డిఫ‌రెంట్ గా ఉంది. కాగా ఇదో ఇదో విప్లవాత్మక ప్రేమగాథ.. విప్లవం, ప్రేమ ఈ రెండింటి నడుమా సాగే భావోద్వేగ ప్రయాణమే శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా కథలోకి వెళ్లాలంటే ఓ యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి.. వెస్ట్ బెంగాల్‌లోని కాళికా పూర్‌ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఫిల్మ్ మేకర్ కావాలనుకునే వాసుదేవ్ గంటా (నాని) షార్ట్ ఫిల్మ్ ద్వారా పెద్ద సినిమా అవకాశాన్ని అందుకుంటాడు. తన పదేళ్ల కష్టాన్ని నిజం చేసుకుంటాడు. ‘ఉనికి’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడు. ఆ సినిమా మెచ్చి వాసుకి బాలీవుడ్ ఆఫర్ కూడా వరిస్తుంది. సరిగ్గా అదే టైంలో వాసు కాపీ రైట్ ఇష్యూతో అరెస్ట్ అవుతాడు.

వాసు రాసిన కథలన్నీ 1970లో తన రచనలతో ఈ దేశాన్ని, ప్రభుత్వాలను కదిలించిన బెంగాలీ లెంజండరీ రైటర్ శ్యామ్ సింగరాయ్‌వే. తన ప్రమేయం లేకుండా వాసు ఈ కథలన్నీ రాస్తుంటాడు. ఇంతకీ వాసు రాసిన ఒరిజినల్ కథలకి.. శ్యామ్ సింగరాయ్ కథకి నేపథ్యం ఏంటి? ఈ రెండూ ఒక్కటే ఎలా అయ్యాయి? అసలు ఈ శ్యామ్ ఎవరు? వాసు ఎవరు.. వీరిద్దరి ఉన్న సంబంధం ఏంటి? మరి కమ్యునిస్ట్‌ భావజాలమున్న శ్యామ్‌ దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడాల్సి వచ్చింది? దేవదాసీ మైత్రి ( సాయి పల్లవి)తో శ్యామ్ ప్రేమకథేంటి అన్నది తెరపై చూడాల్సిందే.నాని ఈ సినిమాలో చాలా డిఫరెంట్‌గా కనిపిస్తారు. వాసు పాత్రను చాలా అలవోకగా చేసేశారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరో కావడంతో ఆ పాత్రను బాగా ఓన్ చేసుకున్నారు. ఇక శ్యామ్ సింగరాయ్‌గా రెబల్ పాత్రలో ఇరగదీశాడు. సెకండాఫ్ స్టార్టింగ్ సీన్ అదిరిపోయింది. అంటరాని వాళ్లు బావిలో నీళ్లు తాగకూడదనే ఆచారాన్ని మట్టుపెడుతూ.. హీరోయిజం చూపించిన తీరు ఆకట్టుకునేట్టు ఉంది. ఆ సీన్‌లో మంచి మెసేజ్ ఉంది. ఆడది ఎవరికీ దాసి కాదు.. దాస్యాన్ని కోరుకునే వాడు దేవుడు అయితే.. దేవుడి ముసుగులో సాగుతున్న బానిసత్వమే దేవదాసీ వ్యవస్థ అంటూ హీరోయిన్‌ని ఆ బానిసత్వం నుంచి విడిపించే సీన్ హైలైట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో సాయి పల్లవి దేవదాసిగా కెరియర్‌లో గుర్తిండిపోయే క్యారెక్టర్ చేసింది. ఆమె పాత్రని పరిచయం చేసిన తీరు అభినందనీయం. క్లైమాక్స్‌లో ఆమె లుక్ చూసి సర్ ప్రైజ్ అవుతారు. క్లాసికల్ డాన్స్‌లో తనకు తానే సాటి అనేట్టు చేసింది. దేవదాసిగా ఉన్న మైత్రీ.. రోజీగా మారిన తీరు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. శ్యామ్-రోజీల మధ్య భావోద్వేగ సీన్లు ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాయి. అయితే సాయి పల్లవి పాత్రకు మరింత స్కోప్ ఇస్తే బాగుండని అనిపిస్తుంది.కృతి శెట్టి ఉన్నంతలో పర్వాలేదనిపించింది. లాయర్‌గా మడోన్నా సెబాస్టియన్‌ స్కోప్ ఉన్న పాత్రలో నటించింది.ఇలాంటి పీరియాడికల్‌ సినిమాని తెరపై ఆవిష్కరించడానికి మంచి కథ.. నటీనటులు ఉంటే సరిపోదు. గత కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించగలిగే సాంకేతిక నిపుణులు కావాలి.. ఆర్ట్‌ డైరెక్టర్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, సినిమాటోగ్రాఫర్‌.. ఈ చిత్ర విషయంలో ఇవన్నీ చక్కగా కుదిరాయి. నిజంగా 1970ల కాలంలో బెంగాల్‌లో ఉంటే ఎలా అనిపిస్తుందో.. అచ్చంగా అదే అనుభూతికి లోనవుతారు ప్రేక్షకులు. అవినాష్ వేసిన అంతర్ మహల్ సెట్.. రియలిస్టిక్‌గా అనిపిస్తుంది.మిక్కీజె మేయర్ సాంగ్స్‌తో పాటు.. నేపథ్య సంగీతం బాగుంది.. ముఖ్యంగా సీతారామశాస్త్రి రాసిన ‘సిరివెన్నెల’ సాంగ్ హైలైట్ అయ్యింది. ఆ పాటలోనే సినిమా కథ కనిపిస్తుంది. శ్యామ్ సింగరాయ్ టైటిల్ సాంగ్ బాగా కుదిరింది. వెంకట్ బోయినపల్లి.. కొత్త బ్యానర్‌లో కొత్త నిర్మాత అయినప్పటికీ నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీపడలేదు. మొత్తానికి శ్యామ్ సింగ‌రాయ్ చిత్రానికి పాజిటీవ్ టాక్ వ‌స్తుంది. మ‌రి క‌లెక్ష‌న్స్ విష‌యం తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement