హైదరాబాద్, ఆంధ్రప్రభ: దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న డీఎస్సీ 1998, 2008 అభ్యర్థుల కల సాకారమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ-1998, 2008లో ఎంపికైనా పలు కారణాలతో చాలా మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందలేకపోయారు. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారుతున్న వీరి సమస్య సమస్యగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో ఆ రెండు బ్యాచ్‌లకు చెందిన అభ్యర్థుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులకు కొంతమేరకైనా న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.
వీరు మొత్తం ఎంతమంది ఉంటారు, వీరికి ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుంది? అనే సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీ ప్రభుత్వం అక్కడి వారికి మినిమం టైం స్కేల్ ఇచ్చింది. అదే మాదిరిగా తెలంగాణలోనూ మినిమమ్ టైమ్ స్కేల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 1998, 2008 బ్యాచ్‌లో అన్యాయానికి గురైనోళ్లు సుమారు 2500 నుంచి 3000 వేల మంది వరకు ఉంటారని సమాచారం. వీరందరికీ మినిమం టైమ్ స్కేల్ వర్తింపచేసే అంశాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అసలు విషయం ఇదీ..!
1998లో ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం డీఎస్సీ 1998 నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ సమయంలో అభ్యర్థుల కటాఫ్ మార్కులకు సంబంధించి.. ఓసీలకు 50, బీసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. ఆ మేరకు అప్పటి ప్రభుత్వం 221 జీవో జారీ చేస్తూ అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు కూడా పిలిచారు. అయితే కొన్ని విభాగాల్లో కటాఫ్ ఉన్న అభ్యర్థులు లేకపోవడంతో ఓసీలకు 45, బీసీలకు 40 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 35 మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తూ ప్రభుత్వం మరో జీవో 618 విడుదల చేసింది. ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించారు. దీంతో అసలు సమస్య మొదలైంది. ప్రభుత్వం ఇలా రెండు జీవోలు జారీచేయడంతో.. మొదట 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత.. 618 జీవో ప్రకారం తక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది.
కాని అధికారుల పొరపాటుతో ఎక్కువ కటాఫ్, తక్కువ కటాఫ్ ఉన్న రెండురకాల అభ్యర్థులను ఒకేసారి ఇంటర్వ్యూలకు పిలిచారు. దీంతో 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు లభించలేదు. దీంతో వీరంతా అప్పట్లో ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. పలు దఫాలుగా అభ్యర్థుల వాదనలు విన్న ట్రైబ్యునల్ వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని 2009లో ఆదేశాలు జారీచేసింది. 2011లో #హకోర్టు కూడా త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే డీఎస్సీ నియామకాలకు సంబంధించి #హకోర్టు తీర్పు కూడా అమలుకాకపోవడంతో అభ్యర్థులు చివరగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఇలా కోర్టులను ఆశ్రయిస్తూ, ప్రభుత్వంపై ఒత్తిడితెస్తూ వీరి పోరాటం నడుస్తునే ఉంది. హైకోర్టుకు ఆశ్రయించిన నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు కొంత మందికి అప్పట్లో అనుకూలంగా తీర్పు వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు కచ్చితంగా న్యాయం చేస్తారనే అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.